శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -2
🌹. శ్రీ లలితా చైతన్య విజ్ఞానము - 342-2 / Sri Lalitha Chaitanya Vijnanam - 342 -2🌹
🌻. లలితా సహస్ర నామముల తత్వ విచారణ 🌻
✍️. సద్గురు శ్రీ కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
మూల మంత్రము :
🍁. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః 🍁
🍀 76. క్షేత్రస్వరూపా, క్షేత్రేశీ, క్షేత్ర క్షేత్రజ్ఞ పాలినీ ।
క్షయవృద్ధి వినిర్ముక్తా, క్షేత్రపాల సమర్చితా ॥ 76 ॥ 🍀
🌻 342-2. 'క్షేత్రేశీ' 🌻
మహాభారత యుద్ధమున పాండవులకు ప్రకృతి అనుకూలమై నిలచినది. దుర్యోధనాదులకు ప్రతికూలమై నిలచినది. భీముడు ప్రార్థించగ వాయుపుత్రుడైన హనుమంతుడు యుద్ధమున పాండవులకు వాయు సహకారము నందించెను. దానితో పాండవసేనలు ప్రయోగించిన ఆయుధములకు బలము ఇనుమడింపగ ధార్తరాష్ట్రులు ప్రయోగించిన ఆయుధముల బలము వాయువుచే ప్రతిఘటింపబడి బలహీనములైనవి. అట్లే రామ రావణ యుద్ధము నందు కూడ రామునికి ప్రకృతి అనుకూలమై నిలచినది.
ఇట్లు ప్రకృతి అనుకూలమున సజ్జనులు పురోభివృద్ధి సాధించగ, దుర్జనులు నశింతురు. ప్రకృతి శ్రీమాత అధీనమున నుండును గనుక శ్రీమాత ఆరాధనమున అటు దైవము, ఇటు ప్రకృతి కూడ అనుకూలించి భక్తులు వైభవముతో నుందురు. మహా వైభవము గల యోగులందరూ శ్రీమాత భక్తులే. యోధులలో కూడ చక్రవర్తులు శ్రీమాత భక్తులే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
🌹 Sri Lalitha Chaitanya Vijnanam - 342-2 🌹
Contemplation of 1000 Names of Sri Lalitha Devi
✍️. Acharya Ravi Sarma
📚. Prasad Bharadwaj
🌻 76. Kshetra-svarupa kshetreshi kshetra kshetragynapalini
Kshaya-vrudhi vinirmukta kshetrapala smarchita ॥ 76 ॥ 🌻
🌻 342-2. Kṣtreśī क्ष्त्रेशी (342) 🌻
Wife of Kṣetrajña (Śiva) is Kṣtreśī (Śaktī). It is like Bhairava and Bhairavī. It must always be remembered that there is no difference between Śiva and Śaktī. Or it may also be said that She is the Īśvarī of all kṣetra-s (possible extension of the previous nāma).
Continues...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2022
మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139
🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 139 🌹
✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. సదవగాహన - 3 🌻
తోటి మానవులతో సత్సంబంధములు త్రెంచివేయు అంశములలో జుగుప్స తర్వాత ఎన్నదగినది "ఆత్మన్యూనతా భావము". దీని వలన నరుడు సంతోషమును చంపుకొనును. ఇతరులతో వ్యవహరించు నపుడు, ఈ న్యూనతాభావమను రంగుటద్దపు జోడుతో చూచును. అవగాహన వక్రమగును.
తన కన్నా అధికులని తాను తలంచువారిపై తిరుగుబాటు చేయ మనస్సు ఉద్రేకించును. ఇతరులలోని ఉన్నత విషయములను గుర్తింప నిరాకరించును.
నిజమునకు, తాను సాధింపదలచిన లక్ష్యము యొక్క స్థాయి కంటే తమ స్థాయి గొప్పదను ఎరుకయే ఈ న్యూనతకు హేతువగుచున్నది. ఆధ్యాత్మిక సాధనా యాన పథమున కొంతకాలము ఓటములు తాకక తప్పదు. అంతమాత్రము చేత, సాధకుడు తనను తాను అవమానింపబనిలేదు. నిస్పృహుడు కానక్కరలేదు.
.....✍️ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2022
శ్రీ శివ మహా పురాణము - 509
🌹 . శ్రీ శివ మహా పురాణము - 509 🌹
రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴
అధ్యాయము - 43
🌻. శివుని అద్భుత లీల - 1 🌻
ఓ మునీ! ఎవని కొరకై పార్వతి ఉత్తమమగు తపస్సును చేసినదో, అట్టి గిరిజాపతి యగు శివుని రూపము ఎట్లుండునో మున్ముందుగా చూడగోరుచున్నాను (1).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఓ మునీ! మూర్ఖురాలగు ఆమె నీతో బాటు శివుని చూచుట కొరకై వెంటనే ప్రాసాదము యొక్క పై భాగమునకు వచ్చెను (2). ఆమె యందు గల అహంకారము నెరింగి శివ ప్రభుడు అద్భుత లీలను ప్రదర్శించ గోరి విష్ణువును, నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (3).
శివుడిట్ల పలికెను-
కుమారులారా! మీరిద్దరు దేవతలతో గూడి వేర్వేరుగా హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్లుడు. మేము తరువాత వచ్చెదము (4).
బ్రహ్మ ఇట్లు పలికెను-
ఈ మాటను విని విష్ణువు అందరినీ పిలిచి వివరించెను. అప్పుడు తన్మయులై యున్న దేవతందరు అదే తీరున ఉత్సాహముతో శీఘ్రముగా ముందుకు సాగిరి (5). ఓ మునీ! ప్రాసాదము యొక్క అగ్రభాగమున నీతో కలిసి ఉన్న మేనకు గుండె జారిపోవు విధముగా విశ్వేశ్వరుడు తన రూపపమును ప్రదర్శించెను (6). ఓ మునీ! ఈ సమయములో మేనకా దేవి శుభకరమగు ఆ సేనను చూచి సామాన్యముగా హర్షమును పొందెను (7). సుందరులు, సౌభాగ్యవంతులు అగు గంధర్వులు శుభవస్త్రములతో ప్రకాశిస్తూ అనేకములగు భూషణములనలంకరించుకొని మున్ముందుగా వచ్చిరి (8).
వారు అనేక వాహనములలో ముందుకు సాగుతూ, అనేక వాద్యములను మ్రోయించుచుండిరి. వారి వాహనములపై రంగుల రంగుల జెండాలు ఉండెను. వారితో బాటు అప్సరసల గణములు కూడ ఉండెను (9). అపుడు వారికి పరమ ప్రభుడగు వసువును చూచి మేన ఆనందించినదై 'ఈతడే శివుడు' అని పలికెను (10). ఓ మహర్షీ! నీవు అపుడు ఆమెతో 'వీరు శివుని సేవకులు. ఈతడు పార్వతీ పతియగు శివుడు కాడు' అని చెప్పి యుంటివి (11). ఆ మాటను విని మేన అపుడు 'ఇంత కంటె గొప్పవాడగు శివుడు ఎట్లుండునో?' అని ఆలోచించ మొదలిడెను (12).
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2022
గీతోపనిషత్తు -311
🌹. గీతోపనిషత్తు -311 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -4 📚
🍀 21-4. జనన మరణ చక్రము - భగవద్గీత మార్గమున శ్రేయస్సు నుద్దేశించి, కర్తవ్యము నాచరించుటయే యున్నది గాని, పుణ్యమును భోగమును ఆశించుట బోధింప బడలేదు. కామ్యకర్మ ప్రోత్సహింప బడలేదు. కర్తవ్య కర్మే నిర్దేశింప బడినది. కర్తవ్య కర్మమునే స్వధర్మమని, కార్యం కర్మయని భగవానుడు పేర్కొనినాడు. కర్తవ్యాచరణము నందే శ్రేయస్సున్నది. ఫలముల నాశ్రయించక, కర్తవ్యమునే నిర్వర్తించమని (అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః) భగవానుడు నిర్దిష్టముగ తెలిపినాడు. అట్టివాడు జనన మరణ చక్రము నుండి విముక్తి చెంది శాశ్వత ధర్మపథమందు శాశ్వతుడై జీవించును. 🍀
21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||
తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.
వివరణము : దైవయోగము నాశ్రయించిన వారు జీవులలో కొందరే. ఇతరులు భోగాసక్తులై కామాభిలాషులై రాకడ, పోకడగల జనన మరణ చక్రమున తీరుబడి లేక, అనంత కాలము తిరుగాడు చుందురని భగవానుడు తెలుపుచున్నాడు. పుణ్యమాశించి పనిచేయుట అవివేకము. భగవద్గీత మార్గమున శ్రేయస్సు నుద్దేశించి, కర్తవ్యము నాచరించుటయే యున్నది గాని, పుణ్యమును భోగమును ఆశించుట బోధింపబడ లేదు. కర్తవ్యము నందే జీవున కధికారమున్నది గాని, ఫలము నందు లేదని దైవము స్పష్టముగ తెలిపినాడు.
భగవద్గీత యందు కామ్యకర్మ ప్రోత్సహింప బడలేదు. కర్తవ్య కర్మే నిర్దేశింప బడినది. కర్తవ్య కర్మమునే స్వధర్మమని, కార్యం కర్మయని భగవానుడు పేర్కొనినాడు. కర్తవ్యాచరణము నందే శ్రేయస్సున్నది. ఫలముల నాశ్రయించక, కర్తవ్యమునే నిర్వర్తించమని (అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః) భగవానుడు నిర్దిష్టముగ తెలిపినాడు. అట్టివాడు జనన మరణ చక్రము నుండి విముక్తి చెంది శాశ్వత ధర్మపథ మందు శాశ్వతుడై జీవించును. కోర్కెలు తీర్చుకొను మార్గమున జన్మల తరబడి శ్రమించుట కన్న, దైవమును చేర్చు యోగమార్గమును ఆశ్రయించుట ఉత్తమమని తెలియవలెను. కోరికలకై దైవమును ప్రార్థించుటగ కాక, దైవము కొరకే దైవమును ప్రార్థించుట ఋషి మార్గము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2022
Subscribe to:
Posts (Atom)