శ్రీ శివ మహా పురాణము - 509


🌹 . శ్రీ శివ మహా పురాణము - 509 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ

🌴. రుద్ర సంహితా - పార్వతీ ఖండః 🌴

అధ్యాయము - 43


🌻. శివుని అద్భుత లీల - 1 🌻

ఓ మునీ! ఎవని కొరకై పార్వతి ఉత్తమమగు తపస్సును చేసినదో, అట్టి గిరిజాపతి యగు శివుని రూపము ఎట్లుండునో మున్ముందుగా చూడగోరుచున్నాను (1).


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఓ మునీ! మూర్ఖురాలగు ఆమె నీతో బాటు శివుని చూచుట కొరకై వెంటనే ప్రాసాదము యొక్క పై భాగమునకు వచ్చెను (2). ఆమె యందు గల అహంకారము నెరింగి శివ ప్రభుడు అద్భుత లీలను ప్రదర్శించ గోరి విష్ణువును, నన్ను ఉద్దేశించి ఇట్లు పలికెను (3).


శివుడిట్ల పలికెను-

కుమారులారా! మీరిద్దరు దేవతలతో గూడి వేర్వేరుగా హిమవంతుని గృహద్వారము వద్దకు వెళ్లుడు. మేము తరువాత వచ్చెదము (4).


బ్రహ్మ ఇట్లు పలికెను-

ఈ మాటను విని విష్ణువు అందరినీ పిలిచి వివరించెను. అప్పుడు తన్మయులై యున్న దేవతందరు అదే తీరున ఉత్సాహముతో శీఘ్రముగా ముందుకు సాగిరి (5). ఓ మునీ! ప్రాసాదము యొక్క అగ్రభాగమున నీతో కలిసి ఉన్న మేనకు గుండె జారిపోవు విధముగా విశ్వేశ్వరుడు తన రూపపమును ప్రదర్శించెను (6). ఓ మునీ! ఈ సమయములో మేనకా దేవి శుభకరమగు ఆ సేనను చూచి సామాన్యముగా హర్షమును పొందెను (7). సుందరులు, సౌభాగ్యవంతులు అగు గంధర్వులు శుభవస్త్రములతో ప్రకాశిస్తూ అనేకములగు భూషణములనలంకరించుకొని మున్ముందుగా వచ్చిరి (8).

వారు అనేక వాహనములలో ముందుకు సాగుతూ, అనేక వాద్యములను మ్రోయించుచుండిరి. వారి వాహనములపై రంగుల రంగుల జెండాలు ఉండెను. వారితో బాటు అప్సరసల గణములు కూడ ఉండెను (9). అపుడు వారికి పరమ ప్రభుడగు వసువును చూచి మేన ఆనందించినదై 'ఈతడే శివుడు' అని పలికెను (10). ఓ మహర్షీ! నీవు అపుడు ఆమెతో 'వీరు శివుని సేవకులు. ఈతడు పార్వతీ పతియగు శివుడు కాడు' అని చెప్పి యుంటివి (11). ఆ మాటను విని మేన అపుడు 'ఇంత కంటె గొప్పవాడగు శివుడు ఎట్లుండునో?' అని ఆలోచించ మొదలిడెను (12).

సశేషం....

🌹 🌹 🌹 🌹 🌹


24 Jan 2022

No comments:

Post a Comment