గీతోపనిషత్తు -311
🌹. గీతోపనిషత్తు -311 🌹
✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 21 -4 📚
🍀 21-4. జనన మరణ చక్రము - భగవద్గీత మార్గమున శ్రేయస్సు నుద్దేశించి, కర్తవ్యము నాచరించుటయే యున్నది గాని, పుణ్యమును భోగమును ఆశించుట బోధింప బడలేదు. కామ్యకర్మ ప్రోత్సహింప బడలేదు. కర్తవ్య కర్మే నిర్దేశింప బడినది. కర్తవ్య కర్మమునే స్వధర్మమని, కార్యం కర్మయని భగవానుడు పేర్కొనినాడు. కర్తవ్యాచరణము నందే శ్రేయస్సున్నది. ఫలముల నాశ్రయించక, కర్తవ్యమునే నిర్వర్తించమని (అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః) భగవానుడు నిర్దిష్టముగ తెలిపినాడు. అట్టివాడు జనన మరణ చక్రము నుండి విముక్తి చెంది శాశ్వత ధర్మపథమందు శాశ్వతుడై జీవించును. 🍀
21. తే తం భుక్యా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మ మమప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||
తాత్పర్యము : దివ్యలోకములందు విస్తృతముగ దివ్య భోగానుభవము అనుభవింపగనే, చేసిన పుణ్యము క్షీణించుట వలన మరల జీవులు మర్త్యలోకములందు ప్రవేశించుచున్నారు. అర్థకామములను ధర్మము నాశ్రయంచి పొందుచున్నవారు ఇట్లు స్వర్గలోకమునకు, మర్త్యలోకమునకు నడుమ రాకపోకలను పొందుచు నున్నారు.
వివరణము : దైవయోగము నాశ్రయించిన వారు జీవులలో కొందరే. ఇతరులు భోగాసక్తులై కామాభిలాషులై రాకడ, పోకడగల జనన మరణ చక్రమున తీరుబడి లేక, అనంత కాలము తిరుగాడు చుందురని భగవానుడు తెలుపుచున్నాడు. పుణ్యమాశించి పనిచేయుట అవివేకము. భగవద్గీత మార్గమున శ్రేయస్సు నుద్దేశించి, కర్తవ్యము నాచరించుటయే యున్నది గాని, పుణ్యమును భోగమును ఆశించుట బోధింపబడ లేదు. కర్తవ్యము నందే జీవున కధికారమున్నది గాని, ఫలము నందు లేదని దైవము స్పష్టముగ తెలిపినాడు.
భగవద్గీత యందు కామ్యకర్మ ప్రోత్సహింప బడలేదు. కర్తవ్య కర్మే నిర్దేశింప బడినది. కర్తవ్య కర్మమునే స్వధర్మమని, కార్యం కర్మయని భగవానుడు పేర్కొనినాడు. కర్తవ్యాచరణము నందే శ్రేయస్సున్నది. ఫలముల నాశ్రయించక, కర్తవ్యమునే నిర్వర్తించమని (అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతియః) భగవానుడు నిర్దిష్టముగ తెలిపినాడు. అట్టివాడు జనన మరణ చక్రము నుండి విముక్తి చెంది శాశ్వత ధర్మపథ మందు శాశ్వతుడై జీవించును. కోర్కెలు తీర్చుకొను మార్గమున జన్మల తరబడి శ్రమించుట కన్న, దైవమును చేర్చు యోగమార్గమును ఆశ్రయించుట ఉత్తమమని తెలియవలెను. కోరికలకై దైవమును ప్రార్థించుటగ కాక, దైవము కొరకే దైవమును ప్రార్థించుట ఋషి మార్గము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Jan 2022
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment