🌹 పరమాత్మ మనకి దగ్గరా ? దూరమా ? 🌹

🌹 పరమాత్మ మనకి దగ్గరా ? దూరమా ? 🌹
✍సద్గురు శ్రీ చలపతిరావు 🙏

🌻 క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం నుండి 🌻

ఒక వస్తువు స్థూలం అయిన కొద్దీ తెలుస్తుంది. సూక్ష్మం అయిన కొద్దీ తెలియకుండా పోతుంది. భూమి, నీరు, స్థూలం కనుక తెలుస్తుంది. అగ్ని కొంచెం సూక్ష్మం, కనుక తెలుస్తుంది. వాయువు ఇంకా సూక్ష్మం కనుక చర్మానికి తప్ప తెలియదు. ఆకాశం ఇంకా సూక్ష్మం. శబ్ధగుణం వల్ల తెలియాల్సిందే తప్ప ఇక ఏ ఇంద్రియానికి గోచరం కాదు.

పరమాత్మ ఆకాశం కన్నా సూక్ష్మాతి సూక్ష్మం కనుక ఏ ఇంద్రియానికి తెలియదు. బాహ్య దృష్టి గలవారు ఎన్నటికీ తెలుసుకోలేరు. అంతర్దృష్టితో మాత్రమే తెలుస్తుంది.

భగవంతునిపట్ల విముఖులై, ఆయన గురించి తెలుసుకోవాలనే ఆలోచన లేక, ఆయనకు సంబంధించిన పనులు చేయకుండా, నిరంతరం లౌకిక వ్యవహారాలలో మునిగిన వారికి పరమాత్మ చాలా దూరం. కోటి జన్మలకైనా సాధ్యం కాదు.

అదే దూరస్థం.
అలాగాక బాహ్య విషయాల పట్ల ఆసక్తిని విడిచి, ఆ పరమాత్మను అందుకొనుటే ప్రధానంగా భావించి, శ్రవణ, మనన, నిధి ధ్యాసనల ద్వారా నిరంతరం సాధనలతో ఉండేవారికి పరమాత్మ దగ్గర. ఒక్క జన్మ చాలు.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము - 7 🌹

🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
7 వ భాగము

🌴 ఉత్పత్తి ప్రకరణము  🌴
🌻 5. పురుష ప్రయత్నము - 2 🌻

అదృష్టమును, దైవమును నమ్మి పురుషార్ధమును చేయకున్న, వాడు. ఏమియు సాధించలేడు. దైవమనగా, మనము చేసిన కర్మకు ఏ ఫలము లభించునో అది దైవము, వాటి అనుభవమే దైవము కాని వేరే దైవమెచటను లేదు. ఈ ప్రపంచమున దైవమునకే కర్తృత్వమున్న, పురుష ప్రయత్నమేల. దైవమే స్నాన దాన జపాదుల నొనర్చును. (ఇచట వసిష్ఠుని భావమేమనగా, దైవమనగా అదృష్టము, అదృష్టమనగా దృశ్యముకానిది, దైవము కూడ దర్శనీయము కాదు. అందువలన దైవముపై, అదృష్టముపై ఆధారపడకుండా, పురుష ప్రయత్నముపై మనుజుడు ఆధారపడవలెనని భావము. మనిషి ఆకారము. దైవము ఆకారము లేనిది. అందువలన రెండింటి కలయిక అసంభవము. దైవము, మనిషి కలవాలంటే మనిషి దైవము కావాలి. అనగా బంధనాల నుండి విముక్తి పొందాలి లేదా దైవము ఆకృతి దాల్చాలి. అనగా అవతారమెత్తాలి అని భావము. శూరులు, పరాక్రమవంతులు, బుద్ధిమంతులు, పండితులు అయిన వారు దైవము కొరకు వేచియుండవలసిన అవసరము లేదు. విశ్వామిత్రుడు, అదృష్టముపై ఆధారపడక, పురుషాకారము వలననే బ్రహ్మత్వము పొందినాడు. కుటుంబ పోషణ భోగవిలాసములు మొదలగునవి పురుష ప్రయత్నము వలననే గాని, దైవము వలన పొందుట లేదు. అందువలన ఎవరైనను, దైవముపై గాక పురుష ప్రయత్నముపైననే ఆధారపడవలెను.

అపుడు వసిష్ఠుని శ్రీరాముడిట్లు ప్రశ్నించెను. అసలు దైవమనునది వున్నదా లేదా తెలుపుమని పలికెను. అపుడు వసిష్ఠుడు దైవము ఏమిచేయుట లేదు, ఏమి అనుభవించుట లేదు. ఒక పురుషార్ధము వలననే లోకమున ఫలము లభించుచున్నది. దైవము వలన కాదు. అది కేవలము కర్మఫలము మాత్రమే. వెనుకటి జన్మల లోనివగు వాసనలు, ప్రభోదితములై, కర్మలుగ మారును. జన్మజన్మల సంస్కారముల ననుసరించి, బుద్ధి పనిచేయుటను. బుద్ధిననుసరించి, మనసు పని చేయును. మనసే కర్మలకు కారణము. ఆ కర్మల వలననే ఫలితములు లభించుచున్నవి . అంతేకాని, ఇచట దైవ ప్రసక్తి లేదు. దైవము మిథ్య. కేవలము పురుషాకారమే అభీష్టములన్నియు సిద్ధింపజేయుచున్నది. అదృష్టము వలన గాదు.

జీవుని చిత్తము శిశువువలె చంచలము. దానిని చెడు నుంచి మంచికి త్రిప్పిన, మంచికి మరలును. అలాగే మంచి నుండి చెడుకు మారవచ్చును. అందువలన ప్రయత్న పూర్వకముగ మంచికి మరల్చవలెను. అభ్యాసము వలననే వాసనలు ప్రభలమగుచున్నవి. కనుక మంచి పనుల అభ్యాసము ఫలవంతమగును. మంచి కొరకు పురుష ప్రయత్నము నవలంభించి, శుభములు పొంది, పంచేంద్రియములను జయించవలెను. మొదట శుభ వాసనలను అనుసరించి శోకరహితమగు పరమార్ధమును పొంది క్రమముగా, శుభవాసనలను కూడ వదలి, సత్యస్వరూపమున స్ధితుడు కావలెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్