🌹 గరుడ పురాణం ప్రకారం జీవితంలో తప్పని సరిగా చేయవలసిన కర్మలు. అవి చేయకపోతే శిక్షణగా వుండే శిక్షలు తప్పవు. 🌹
ప్రసాద్ భరద్వాజ హిందూ ధర్మంలో గరుడ పురాణానికి ప్రత్యేక స్థానం ఉంది. ఇది మరణానంతర జీవితాన్ని, పాపపుణ్యాలు, మనిషి చేసే కర్మల ఫలితాల గురించి ఎంతో వివరంగా చెబుతుంది. ముఖ్యంగా జీవితంలో మనం చేయాల్సిన కొన్ని కర్తవ్యాలను నిర్లక్ష్యం చేస్తే, మరణానంతరం తీవ్ర శిక్షలు ఎదుర్కోవాల్సి వస్తుందని గరుడ పురాణం చెబుతుంది. అందుకే ఈ పురాణంలో చెప్పిన నియమాలు, ధర్మాలు తెలుసుకోవడం అవసరమని పండితులు చెబుతుంటారు. మనిషి ప్రవర్తన, ఆచరణే అతని భవిష్యత్తును నిర్ణయిస్తాయని ఈ గ్రంథం వివరిస్తోంది.
గరుడ పురాణం ప్రకారం తల్లిదండ్రుల సేవ చేయడం ప్రతి ఒక్కరి ప్రధాన కర్తవ్యం. తల్లిదండ్రులను అవమానించడం, వృద్ధాప్యంలో వారిని పట్టించుకోకపోవడం పెద్ద పాపంగా గరుడ పురాణం చెబుతోంది. అలాంటి వారు యమలోకంలో కఠిన శిక్షలు అనుభవించాల్సి వస్తుందని ఈ పురాణంచెబుతోంది. తల్లిదండ్రులే మనకు మొదటి దేవుళ్లు అని, వారికి సేవ చేయడం వల్ల పుణ్యం లభిస్తుందని గరుడ పురాణం స్పష్టంగా తెలియ జేస్తుంది. జీవితంలో ఎంత బిజీగా ఉన్నా, వారిని గౌరవంగా చూసుకోవాలని ఈ గ్రంథం బోధిస్తుంది.
ఇంకా దానధర్మాలకు కూడా గరుడ పురాణంలో పెద్ద ప్రాధాన్యం ఉంది. సంపాదించిన ధనాన్ని పూర్తిగా స్వార్థానికి మాత్రమే ఉపయోగించడం పాపమని, అవసరమైన వారికి సహాయం చేయడం ధర్మమని చెబుతుంది. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టకపోవడం, దాహంతో ఉన్నవారికి నీళ్లు ఇవ్వకపోవడం తీవ్రమైన అపరాధంగా పరిగణిస్తారని గరుడ పురాణం చెబుతోంది. దానం చేయడం వల్ల మన పాపాలు తగ్గుతాయని, మంచి ఫలితాలు లభిస్తాయని గరుడ పురాణం సూచిస్తుంది.
స్త్రీల పట్ల గౌరవం చూపకపోవడం కూడా ఘోరమైన పాపంగా గరుడ పురాణం చెబుతోంది. భార్యను, స్త్రీలను అవమానించడం, హింసించడం వల్ల జీవితంలోనే కాక మరణానంతరం కూడా కష్టాలు ఎదురవుతాయని నమ్మకం. అలాగే గురువుల పట్ల అవమానంగా ప్రవర్తించడం, వేదాలు,శాస్త్రాలను తక్కువగా చూడడం కూడా పాపకర్మలుగా చెబుతుంది ఈ పురాణం. గురువు చూపిన మార్గాన్ని అనుసరించడం వల్లే జీవితం సరైన దారిలో సాగుతుందని గరుడ పురాణం వివరిస్తుంది.
అయితే గరుడ పురాణంలో చెప్పిన శిక్షలు, నరకాలు మనిషిని భయపెట్టడానికి మాత్రమే కాదని, ధర్మ మార్గంలో నడిపించడానికే అని పండితులు చెబుతారు. మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు, చెడు పనులు చేస్తే చెడు ఫలితాలు వస్తాయనే కర్మ సిద్ధాంతాన్ని ఇది బలంగా చెబుతుంది. శాస్త్రీయంగా చూసినా, మంచి ప్రవర్తన, మానవత్వం, బాధ్యతాయుతమైన జీవనం మన జీవితాన్ని సుఖమయం చేస్తాయి. గరుడ పురాణం బోధించే ధర్మాలను ఆచరిస్తే ఈ లోకంలోనే కాదు, పరలోకంలో కూడా శాంతి లభిస్తుందనే నమ్మకం ఉంది.
గరుడపురాణం ఒక వ్యక్తి తన కర్మను సరిదిద్దకునే మార్గం చూపిస్తుంది. ఈ పురాణంలో ఇటువంటి విధానాలు, జీవన నియమాలు స్పష్టం చేశారు. దీనిని అనుసరించడం ద్వారా ఒక వ్యక్తి తన కష్టాలన్నిటినీ అధిగమించ గలడు. ఈ పురాణం విష్ణువు పై భక్తి, జ్ఞానం మీద ఆధారపడి ఉంటుంది. ప్రతి ఒక్క వ్యక్తి దాన్ని చదివి దాని నుండి నేర్చుకొని వారి జీవితాన్ని మెరుగుపరుచుకోవాలి. గరుడ పురాణంలో చెప్పినటువంటి విషయాల్లో కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకుందాం. ఇది మనల్ని అన్ని కష్టాల నుండి కాపాడుతుంది. అలాగే, మన వ్యక్తిత్వాన్ని పెంచుతుంది.
ఒక వ్యక్తి జీవితాన్ని మెరుగుపర్చడానికి ఏకాదశి ఉపవాసం చాలా ముఖ్యమైనదని గరుడ పురాణంలో చెప్పారు. ఈ ఉపవాసం పూర్తి భక్తి, శ్రద్ధతో చేస్తే, అది ఖచ్చితంగా ఫలితమిస్తుందని ఇందులో పేర్కొన్నారు. ఉపవాసం పాటించే వ్యక్తి అన్ని కష్టాల నుండి బయటపడతాడు. అంతే కాకుండా అతను జీవితంలోని అన్ని ఆనందాలను పొందుతాడు. చివరికి అతను మోక్ష మార్గంలో పయనిస్తాడు.
🌹🌹🌹🌹🌹