🌹 శ్రీ యోగ వాసిష్ఠ సారము 🌹
✍ రచన : పేర్నేటి గంగాధరరావు
1 వ భాగము
🌴 ఉత్పత్తి ప్రకరణము 🌴
వైరాగ్యము - 1
మోక్షము లభించాలంటే కేవలం కర్మయోగము లేక కేవలం జ్ఞానయోగము సరిపోదు. ఆ రెండు పరస్పర ఆధారములు.
ఎట్లనిన పక్షి ఎగరాలంటే రెండు రెక్కలు అవసరం.
విష్ణుమూర్తంతటి వాడే భక్తుల శాపవశంబున రామావతారమెత్తి సతీవియోగ దుఃఖమనుభవించె.
సనత్కుమారుడు బ్రహ్మలోకమందున్నపుడు విష్ణువు అచట కరుదెంచగా బ్రహ్మదులెల్లరు విష్ణువును పూజించ, సనత్కుమారుడు నిష్కాముడగుటచే విష్ణువును పూజించలేదు. అందుకు విష్ణువు కోపించి సనత్కమారుని కుమారస్వామివై జన్మించి, కామపీడితుడ వగుమని శపింప, సనత్కుమారుడు విష్ణువుపై అలిగి విష్ణువుని శపించెను. అపుడు విష్ణువు శ్రీరామునిగా జన్మించి సర్వజ్ఞత్వమును కోల్పోయి కొంతకాలము జీవించమనెను.
భృగువు భార్య విష్ణువుని పూజించి అతనిలో లీనమయ్యెను. అపుడు భృగువు తన భార్య మరణమునకు విష్ణువు కారణమని భ్రమించి విష్ణువును, భార్యా వియోగముతో జీవించమని శపించె.
అలాగే రాధ శాపము వలన కృష్ణుని సఖుడైన సుధాముడు మరు జన్మములో జలంధరునిగా జన్మించినపుడు అతనిని వధించుటకు కృష్ణుడు జలంధరుని భార్య బృంద యొక్క పతివ్రతా ధర్మమును మాయతో తప్పునట్లుగా చేయగా, బృంద కోపించి, భార్యావియోగముతో జీవించమని శపించెను.
ఇంకొక పర్యాయము దేవదత్తుని భార్య నృసింహ రూపి, విష్ణువుని చూచి భయంతో ప్రాణములు విడువగా దేవదత్తుడు కోపించి విష్ణువును భార్యావియోగము పొందుమని శపించె. ఈ విధముగా వివిధ భక్తుల శాప కారణమున విష్ణువు శ్రీరామునిగా అవతారమెత్తి శాప ఫలితము అనుభవించె. దేముడంత వానికే కర్మఫలిత మనుభవింప తప్పలేదు. మానవులమైన మనకు తప్పునా! (తప్పదు అని భావము) యధార్ధముగా వాస్తవము కాని ఈ జగత్తు బ్రహ్మము వలన ఆరోపించబడుచున్నది. ఇట్టి కల్పిత ప్రపంచము మరల మనస్సు నందు ఉదయించకుండునట్లు విస్మరింపబడుటమే ముక్తి స్వరూపము. కనబడే ప్రతి వస్తువు స్థిరత్వము లేనిది, ఆశాశ్వతమైది, బ్రహ్మ మొక్కటే స్థిరత్వము కల్గినది. మిగిలిన ప్రపంచము భ్రాంతి మాత్రమే. వాసనలు అనగా సంస్కారముల త్యాగమే మోక్షము.
సంస్కారములు రెండు రకములు (1) మలిన సంస్కారములు (2) శుద్ద సంస్కారములు. మలిన సంస్కారములు జన్మకు కారణము. శుద్ద సంస్కారములు జన్మ నాశనమునకు తోడ్పడును. మలిన సంస్కారములు అహంతో కూడి పునర్జన్మకు కారణమైన, శుద్ద సంస్కారములు పునర్జన్మకుపయోగ పడే అంకురములను దగ్ధము చేయును. ఇవి వేయించబడిన గింజల వంటివి. శ్రీరాముని చరిత్ర తెలుసుకున్న అతడు సంస్కారములనెట్లు తొలగించుకొనెనో తెలియగలదు.
శ్రీరాముడు గురుకులము నుండి విద్యార్జన చేసి తిరిగి వచ్చి కొంత కాలమున్న తదుపరి తీర్ధములు, పవిత్ర ఆశ్రమములు జూడ కోర్కెగల్గి తండ్రి అనుమతి పొంది, వశిష్ఠుని ఆశీస్సులతో ఒక శుభదినమున కొందరు ముఖ్యులతో కూడి అడవులు దాటి పోవుచూ, మధ్యమధ్య వచ్చు ఆశ్రమములను, పర్వతములు, నదులు, ప్రయాగ, నైమిశారణ్య, వారణాసి, గయ, కేదార, శ్రీశైల, మానస సరోవరములు మొ|| సకల తీర్థములు సేవించి అనుజులతో గూడి పరిభ్రమించె. తిరిగి నిజపురికేతెంచి, బంధుమిత్రులందరితో ఎనిమిది దినములు ఉత్సవములు జరుపుకొని సుఖముగా గృహముననుండెను.
తదుపరి రాముడు దైనిక కృత్యములు నిర్వహించుచు తమ్ములతో గూడి పితృగ్రహమున వాసమొనర్పసాగెను.
🌹 🌹 🌹 🌹 🌹
🙏 ప్రసాద్