Showing posts with label Durvasa. Show all posts
Showing posts with label Durvasa. Show all posts
కార్తీక పురాణం - 29 :- 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము Kartika Purana - 29 :- Chapter 29 - Ambarisha worships Durvasa
🌹. కార్తీక పురాణం - 29 🌹
🌻. 29వ అధ్యాయము - అంబరీషుడు దుర్వాసుని పూజించుట - ద్వాదశి ప్రాణము 🌻
ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 29 🌹
🌻. Chapter 29 - Ambarisha worships Durvasa - Dwadashi Prana 🌻
Prasad Bharadwaja
అత్రి మహాముని అగస్త్యులవారితో యీ విధముగా - సుదర్శన చక్రము అంబరీషునక భయమిచ్చి వుభయులను రక్షించి, భక్త కోటికి దర్శనమిచ్చి అంతర్ధానమైన వైనము చెప్పి తిరిగి ఇట్లు నుడువ నారంభించెను.
ఆ తరువాత అంబరీషుడు దుర్వాసుని పాదముల ఫైబడి దండ ప్రణామములాచరించి, పాదములను కడిగి, ఆ కడిగిన నీళ్లను తన శిరస్సుపై జల్లుకొని, "ఓ మునిశ్రేష్టా! నేను సంసార మార్గమందున్న యొక సామాన్య గృహస్తుడను. నా శక్తి కొలది నేను శ్రీ మన్నారాయణుని సేవింతును, ద్వాదశశీ వ్రతము జేసుకోనుచు ప్రజలకు యెట్టి కీడు రాకుండా ధర్మవర్తనుడనై రాజ్యమేలుచున్నాను. నా వలన మీకు సంభవించిన కష్టమునకు నన్ను మన్నింపుడు. మీ యెడల నాకు అమితమైన అనురాగముండుట చేతనే తమకు ఆతిథ్యమివ్వవలయునని ఆహ్వానించితిని. కాన, నా అతిధ్యమును స్వీకరించి నన్నును, నా వంశమును పావనము జేసి కృతార్దుని చేయుడు, మీరు దయార్ద్ర హృదయులు, ప్రధమ కోపముతో నన్ను శపించినను మరల నా గృహమునకు విచ్చేసితిరి. నేను ధన్యుడనైతిని. మీరాక వలన శ్రీమహావిష్ణువు యొక్క సుదర్శనమును చూచు భాగ్యము నాకు కలిగినది. అందులకు నేను మీ వుపకారమును మరువలేకున్నాను.
మహానుభావా! నా మనస్సంతోషముచే మిమ్మెట్లు స్తుతింపవలయునో నా నోట పలుకులు రాకున్నవి. నా కండ్ల వెంటవచ్చు ఆనంద బాష్పములతో తమ పాదములు కడుగుచున్నాను. తమకు యెంత సేవచేసినను యింకను ఋణపడియుందును. కాన, ఓ పుణ్యపురుషా! నాకు మరల నర జన్మ రాకుండా వుండేటట్లును, సదా, మీ బోటి మునిశ్రేష్ఠుల యందును - ఆ శ్రీ మన్నారాయుణుని యందును మనస్సు గలవాడనై యుండునట్లును నన్నాశీర్వదించు"డని ప్రార్ధించి, సహాపంక్తి భోజనమునకు దయ చేయుమని ఆహ్వానించెను.
ఈ విధముగా తన పాదముల పైబడి ప్రార్ధించుచున్న అంబరీషుని ఆశీర్వదించి "రాజా! ఎవరు ఎదుటి వారి బాధను నివారణ గావించి ప్రాణములు కాపాడుదురో, ఎవరు శత్రువులకైనను శక్తి కొలది ఉపకారము చేయుదురో అట్టి వారు తండ్రితో సమానమని ధర్మశాస్త్రములు తెలియజేయుచున్నవి. నీవు నాకు యిష్టుడవు. తండ్రితో సమానుడవైనావు.
నేను నీకు నమస్కరించినచో నా కంటె చిన్న వాడగుట వలన నీకు అయుక్షిణము కలుగును.అందుచేత నీకు నమస్కరించుట లేదు. నీవు కోరిక యీ స్వల్ప కోరికను తప్పక నెరవేర్చెదను. పవిత్ర యేకాదశి వ్రతనిష్టుడవగు నీకు మనస్థాపమును కలుగ జేసినందులకు వెంటనే నేను తగిన ప్రాయశ్చిత్తమును అనుభవించితిని, నాకు సంభవించిన విపత్తును తొలగించుటకు నివే దిక్కయితివి. నీతో భోజనము చేయుట నా భాగ్యము గాక, మరొకటి యగునా?" అని దుర్వాస మహాముని పలికి, అంబరీషుని అభీష్టము ప్రకారము పంచభక్ష్య పరమాన్నములతో సంతృప్తిగా విందారగించి, అతని భక్తిని కడుంగడు ప్రశంసించి, అంబరీషుని దీవించి, సెలవు పొంది తన ఆశ్రమమునకు వెళ్ళెను.
ఈ వృత్తాంతమంతయు కార్తిక శుద్ధ ద్వాదశీ దినంబున జరిగినది. కాన ఓ అగస్త్య మహామునీ! ద్వాదశీ వ్రత ప్రభావమెంతటి మహాత్మ్యము గలదో గ్రహించితివిగదా! ఆ దినమున విష్ణుమూర్తి క్షీరసాగరమందున శేషశయ్యపై నుండి లేచి ప్రసన్న మనస్కుడై వుండును. కనుకనే, ఆరోజుకంతటి శ్రేష్టతయు, మహిమ గలిగినది. ఆ దినమున చేసిన పుణ్యము యితర దినములలో పంచ దానములు చేసినంత ఫలమును పొందును. ఏ మనుజుడు కార్తీక శుద్ధ యేకాదశి రోజున శుష్కోపవాసముండి పగలెల్ల హరి నామ సంకీర్తనచే గడిపి ఆ రాత్రంతయు పురాణము చదువుతూ, లేక, వింటూ జాగరణ చేసి ఆ మరునాడు అనగా ద్వాదశినాడు తన శక్తి కొలది శ్రీమన్నారయణునకు ప్రీతీ కొరకు దానములిచ్చి బ్రాహ్మణులతో గూడి భోజనము చేయునో అట్టి వాని సర్వ పాపములు యీ వ్రత ప్రభావము వలన పటాపంఛలై పోవును. ద్వాదశీ దినము శ్రీమన్నానరయుణుకు ప్రీతికరమైన దినము కనుక ఆనాడు ద్వాదశ ఘడియలు తక్కువగా యున్నను. ఆ ఘడియలు దాటకుండగానే భుజింపవలెను.
ఎవరికైతే వైకుంఠములో స్థిర నివాసమేర్పరచుకొని వుండాలని కోరిక వుండునో, అట్టి వారు ఏకాదశి వ్రతము, ద్వాదశి వ్రతము రెండునూ చేయవలెను. ఏ యొక్కటియు విడువకూడదు. శ్రీహరికి అత్యంత ప్రీతీకరమగు కార్తీక శుద్ధ ద్వాదశి అన్ని విధముల శ్రేయస్కరమైనది. దాని ఫలితము గురించి యెంత మాత్రము సంశయింప కూడదు. మఱ్ఱి చెట్టు విత్తనము చాల చిన్నది. అయినను అదే గొప్ప వృక్షమైన విధముగా కార్తీక మాసములో నియమానుసారముగ జేసిన యే కొంచము పుణ్యమైనను, అది అవసాన కాలమున యమదూతల పాలు కానీయక కాపాడును.
అందులకే యీ కార్తీకమాస వ్రతము చేసి దేవతలే గాక సమస్త మానవులు తరించిరి.
ఈ కథను యెవరు చదివినను లేక వినినను సకలైశ్వర్యములు సిద్దించి సంతాన ప్రాప్తి కూడా కలుగును - అని అత్రిమహాముని అగస్త్యనకు బోధించిరి.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి ఏకోనత్రింశోధ్యాయము - ఇరవై తొమ్మిదో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹కార్తీక మాసం 29వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్ భరధ్వాజ
నిషిద్ధములు:- పగటి ఆహారం, ఉసిరి
దానములు:- శివలింగం, వీభూది పండు, దక్షిణ, బంగారం
పూజించాల్సిన దైవము:- శివుడు (మృత్యుంజయుడు)
జపించాల్సిన మంత్రము:- ఓంత్రియంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం, ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయ మామృతాత్.
🌹 🌹 🌹 🌹 🌹
కార్తీక పురాణం 27వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట / Karthika Puranam 27th Chapter Parayan
🌹 కార్తీక పురాణం 27వ అధ్యాయము దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట KARTHIKA PURANAM 27th CHAPTER PARAYAN 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam
🌹🌹🌹🌹🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam
🌹🌹🌹🌹🌹
కార్తీక పురాణం - 27 :- 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట / Kartika Purana - 27 :- Chapter 27 - Durvasu takes refuge in Ambarish
🌹. కార్తీక పురాణం - 27 🌹
🌻. 27వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని ఆశ్రయించుట 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 27 🌹
🌻. Chapter 27 - Durvasu takes refuge in Ambarish 🌻
📚. Prasad Bharadwaja
మరల అత్రి మహాముని అగస్త్యున కిట్లు వచించెను- కుంభ సంభవా! ఆ శ్రీ హరి దూర్వాసుని యెంతో ప్రేమతో జేరదీసి యింకను ఇట్లు చెప్పెను.
"ఓ దూర్వాస మునీ! నీవు అంబరీషుని శపించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకరమైనవే. నేను అవతారము లెత్తుట కష్టము గాదు. నీవు తపశ్శాలివి. నీ మాటలకు విలువ యివ్వవలెను. గాన, అందులకు నేనంగగీకరించితిని. బ్రాహ్మణుల మాట తప్పకుండుట నా కర్తవ్యము నీవు అంబరీషుని యింట భుజింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరీవృతుడై ప్రాయోపవేశమొనర్పనెంచినాడు. ఆ కారణము వలన విష్ణు చక్రము నిన్ను బాధింపబూనెను. ప్రజారక్షణమే రాజధర్మము గాని, ప్రజాపీడనము గాదు.
ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వానిని జ్ఞానులగు బ్రాహ్మణులే శిక్షింపవలెను. ఒక విప్రుడు పాపియైన మరొక విప్రుడే దండించ వలెను. ధనుర్బాణములు ధరించి ముష్కరుడై యుద్దమునకు వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవ్వరిని యెప్పుడూ దండించకూడదు. బ్రాహ్మణ యువకుని దండించుట కంటే పాతకము లేదు. విప్రుని హింసించువాడును హింసింపచేయువాడును, బ్రాహ్మణ హంతకులకి న్యాయశాస్త్రములు ఘోషించుచున్నవి. బ్రాహ్మణుని సిగబట్టిలాగిన వాడును, కాలితో తన్నినవాడును, విప్రద్రవ్యమును హరించువాడును బ్రాహ్మణుని గ్రామము నుండి తరిమిన వాడును, విప్ర పరిత్యాగ మొనరించినవాడును బ్రహ్మహ౦తుకులే అగుదురు.
కాన, ఓ దూర్వాస మహర్షి! అంబరీషుడు నీ గురించి - తపశ్శాలియు, విప్రోత్తముడును అగు దూర్వాసుడు నా మూలమున ప్రాణసంకటం పొందుచున్నాడు. అయ్యో! నేను బ్రాహ్మణ హంతకుడనయితినే యని పరితాపము పొందుచున్నాడు. కాబట్టి, నీవు వేగమే అంబరీషుని కడకేగుము. అందువలన మీవుభయులకు శాంతి లభించును" అని విష్ణువు దూర్వాసునకు నచ్చజెప్పి అంబరీషుని వద్దకు బంపెను.
ఇట్లు స్కాంద పురాణా౦తర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి సప్తవి౦శోధ్యాయము - ఇరవయ్యేడవ రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹కార్తీక మాసం 27వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్ భరధ్వాజ
నిషిద్ధములు:- ఉల్లి, ఉసిరి, వంకాయ
దానములు:- ఉసిరి, వెండి, బంగారం, ధనం, దీపాలు
పూజించాల్సిన దైవము:- కార్తీక దామోదరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం శ్రీభూతులసీ ధాత్రీసమేత కార్తీక దామోదరాయ స్వాహా
🌹 🌹 🌹 🌹 🌹
కార్తీక పురాణం 26వ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట / Karthika Puranam 26th Chapter Parayan
https://youtu.be/YZcaWwhZUOY
🌹 కార్తీక పురాణం 26వ అధ్యాయము దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ KARTHIKA PURANAM 26th CHAPTER PARAYAN 🌹
ప్రసాద్ భరద్వాజ
Like, Subscribe and Share
https://youtube.com/@ChaitanyaVijnaanam
🌹🌹🌹🌹🌹
కార్తిక పురాణం - 26 :- 26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట Kartika Purana - 26 :- Chapter 26 - Durvasu takes refuge in Srihari
🌹. కార్తిక పురాణం - 26 🌹
🌻. 26వ అధ్యాయము - దూర్వాసుడు శ్రీహరిని శరణువేడుట - శ్రీహరి హితబోధ 🌻
📚. ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 26 🌹
🌻. Chapter 26 - Durvasu takes refuge in Srihari - Srihari's beneficial teachings 🌻
📚. Prasad Bharadwaja
ఈ విధముగా అత్రిమహముని అగస్త్యునితో - దూర్వాసుని కోపము వల్ల కలిగిన ప్రమాదమును తెలిసి, మిగిలిన వృత్తాంతమును ఇట్లు తెలియజేసెను.
ఆవిధముగా ముక్కోపియైన దూర్వాసుడు భూలోకము, భువర్లోకము, పాతాళలోకము, సత్యలోకములకు తిరిగి తిరిగి అన్ని లోకములలోను తనను రక్షించువారు లేకపోవుటచే వైకుంఠమందున్న మహావిష్ణువు కడకువెళ్లి
"వాసుదేవా! జగన్నాథా! శరణాగతరక్షణ బిరుదాంకితా! రక్షింపుము. నీభక్తుడైన అంబరీషునకు కీడు చేయదలచిన నేను బ్రాహ్మణుడను గాను. ముక్కోపినై మహాపరాధము చేసితిని. నీవు బ్రాహ్మణ ప్రియుడవు. బ్రాహ్మణుడైన భృగుమహర్షి నీ యురముపై తనిన్నను సహించితివి. అ కాలిగురుతు నేటికినీ నీ వక్షస్దలమందున్నది. ప్రశాంతమనస్కుడవై అతనిని రక్షించినట్లే కోపముతో నీ భక్తునికి శాపమిచ్చిన నన్ను కూడ రక్షింపుము.
శ్రీహరి! నీచక్రాయుధము నన్ను జంపవచ్చుచున్న"దని దూర్వాసుడు శ్రీమన్నారాయణుని పరిపరివిధముల ప్రార్దించెను. ఆవిధముగా దూర్వాసుడు అహంకారమును వదలి తనను ప్రార్దుంచుట చూచి - శ్రీ హరి చిరునవ్వు నవ్వి "దూర్వాసా! నీ మాటలు యదార్ధములు. నీవంటి తపోధనులు నాకత్యంత ప్రియులు. నీవు బ్రాహ్మణ రూపమున బుట్టిన రుద్రడవు. నిన్ను జూచిన వారు మూడు లోకములందు భయపడకుందురా! నేను త్రికరణములచే బ్రాహ్మణులకు మాత్రము యెట్టి హింసా కలిగించను. ప్రతియుగమందున గో, దేవ, బ్రాహ్మణ, సాధు జనంబులకు సంభవించే యాపదలను పోగొట్టుటకు ఆయా పరిస్ధితలకు తగిన రూపములు ధరించి దుష్టశిక్షణ శిష్టరక్షణ గావింతును.
నీవకారణముగా అంబరీషుని శపించితివి. నేను శత్రువుకైనను మనోవాక్కయములందు కూడా కీడు తలపెట్టను. ఈ ప్రపంచమందుగల ప్రాణి సమూహము నా రూపముగానే జూతును. అంబరీషుడు ధర్మయుక్తముగా ప్రజాపాలన చేయుచుండెను. కాని, అటువంటి నాభక్తుని నీవు అనేక విధములు దూషించితివి. నీ యెడమ పాదముతో తన్నితివి. అతని యింటికి నీవు అతిథినై వచ్చికూడ, నేను వేళకు రానియెడల ద్వాదశి షుడియలు దాటకుండ భుజింపుమని అంబరీషునకు చెప్పవైతివి. అతడు వ్రతభంగమునుకు భయపడి, నీ రాకకై చూచి జలపానమును మాత్రమే జేసెను. అంతకంటే అతడు అపరాధము యేమిచేసెను!
చాతుర్వర్ణములవారికి భోజన నిషిద్ద దినములందు కూడా జలపానము దాహశాంతికిని, పవిత్రతకును చేయదగినదే కదా? జలపాన మొనరించిన మాత్రమున నాభక్తుని దూషించి శపించితివి. అతడు వ్రతభంగమునకు భయపడి జలపానము చేసినాడు కాని నిన్నవమానించుటకు చేయాలేదే? నీవు మండిపడుచున్నను బ్రతిమాలి నిన్ను శాంతింపచేయ జూచెను. ఎంత బ్రతిమాలినను నీవు శాంతింపనందున నన్ను శరణువేడెను. నేనపుడు రాజు హృదయములో ప్రవేశించినాను. నీ శాపఫలము పది జన్మలలో అనుభవించుదునని పలికిన వాడిని నేనే. అతడు నీ వలన భయముచే నన్ను శరణు వేడుచుండెను. కాని, తన దేహము తాను తెలుసుకోనే స్దితిలో లేడు. నీ శాపమును అతడు వినలేదు. అంబరీషుడు నాభక్త కోటిలో శ్రేష్టుడు. నిరపరాధి, దయాశాలి, ధర్మతత్పరుడు. అటువంటి వానిని అకారణముగా దూషించితివి. అతనిని నిష్కారణముగా శపించితివి. విచారించవలదు. ఆ శాపమును లోకోపకారమునకై నేనే అనుభవింతును.
అదెటులనిన నీ శాపములోనిది మొదటి జన్మ మత్స్యజన్మ. నేనీ కల్పమును మనువును రక్షించు నిమిత్తము, సోమకుడను రాక్షసుని జంపుటకు మత్స్యరూపమెత్తుదును. మరి కొంత కాలమునకు దేవదానవులు క్షీర సాగరమును మదించుటకు మందర పర్వతమును కవ్వముగా చేయుదురు. అ పర్వతమును నీటిలో మునగకుండ కూర్మరూపమున నా వీపున మోయుదును. వరాహజన్మమెత్తి హిరణ్యాక్షుని వధింతును. నరసింహ జన్మమెత్తి హిరణ్యకశిపుని జంపి, ప్రహ్లాదుని రక్షింతును. బలిచే స్వర్గమునుండి పారద్రోలబడిన ఇంద్రనకు తిరిగి స్వర్గమును అప్పగించుటకు వామనరూపమెత్తి బలిచక్రవర్తిని పాతాళలోకమునకు త్రొక్కివేతును. భూభారమును తగ్గించుటకు క్షత్రియులను చంపి బ్రాహ్మణుడనై జన్మించి భూభారమును తగ్గింతును. లోకకంటకుడయిన రావణుని జంపి లోకోపకారము చేయుటకు రఘువంశమున రాముడనై జన్మింతును. పిదప, యదువంశమున శ్రీకృష్ణునిగను, కలియుగమున బుద్దుడుగను, కలియుగాంతమున విష్ణు చిత్తుడను విప్రునియింట "కల్కి" యను పేరున జన్మించి, అశ్వారూఢుండనై పరిభ్రమించుచు బ్రహ్మదేషులనందరను మట్టుబెట్టుదును.
నీవు అంబరీషునకు శాపరూపమున నిచ్చిన పదిజన్మలను యీ విధముగా పూర్తిచేయుదును. ఇట్లు నా దశావతారములను సదా స్మరించువారికి సమస్త పాపములు హరింపజేసి వైకుంఠ ప్రాప్తి నోసంగుదును. ఇది ముమ్మాటికి తథ్యము.
ఇట్లు స్కాంద పురాణాంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహత్మ్యమందలి షడ్వింశోధ్యాయము - ఇరవయ్యారో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹కార్తీక మాసం 26వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్ భరధ్వాజ
నిషిద్ధములు:- సమస్త పదార్ధాలు
దానములు:- నిలవవుండే సరుకులు
పూజించాల్సిన దైవము:- కుబేరుడు
జపించాల్సిన మంత్రము:- ఓం కుబేరాయవై శ్రవణాయ మహారాజాయ స్వాహా
🌹 🌹 🌹 🌹 🌹
కార్తీక పురాణం - 25 : 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట Kartika Purana - 25 : Chapter 25 - Durvasa curses Ambarish
🌹. కార్తీక పురాణం - 25 🌹
🌻 25వ అధ్యాయము - దూర్వాసుడు అంబరీషుని శపించుట 🌻
ప్రసాద్ భరద్వాజ
🌹. Kartika Purana - 25 🌹
🌻 Chapter 25 - Durvasa curses Ambarish 🌻
Prasad Bharadwaja
"అంబరీషా! పూర్వజన్మలో కించిత్ పాప విశేషము వలన నీకీ యనర్ధము వచ్చినది. నీ బుద్దిచే దీర్ఘముగా ఆలోచించి నీకెటుల అనుకూలించునో అటులనే చేయుము. ఇక మాకు సెలవిప్పించుము" అని పండితులు పలికిరి. అంత అంబరీషుడు "ఓ పండితోత్తములారా! నానిశ్చితాభిప్రాయమును ఆలకించి వెడలుడు. ద్వాదశీనిష్టను విడచుట కన్న, విప్రశాపము అధికమయినది కాదు. జలపానము చేయుట వలన బ్రాహణుని అవమానపరచుటగాదు. ద్వాదశిని విడచుటయుగాదు. అప్పుడు దూర్వాసుడు నన్నేల నిందించును? నిందింపడు. నా తొల్లి పుణ్యఫలము నశింపదు. గాన, జలపాన మొనరించి వూరకుందును" అని వారి యెదుటనే జలపానము నొనరించెను.
అంబరీషుడు జలపాన మొనరించిన మరుక్షణముచే దూర్వాసుడు స్నానజపాదులు పూర్తి చేసుకొని అక్కడకు వచ్చెను. వచ్చిన వెంటనే ఆ ముని మహారౌద్రాకారుడై క౦డ్ల వెంట నిప్పులు గ్రక్కుచూ "ఓరీ మదాంధా! నన్ను భోజనానికి రమ్మని, నేను రాకనే నీవేల భుజించితివి? ఎంత దుర్మార్గము, ఎంత నిర్లక్ష్యము? ఎంతటి ధర్మ పరిత్యాగివి? అతిధికి అన్నము పెట్టెదనని ఆశజూపి పెట్టకుండా తాను తినినవాడు మలభక్ష కుడగును. అట్టి అధముడు మరుజన్మలో పురుగై పుట్టును. నీవు భోజనమునకు బదులు జలపానము చేసితివి. అది భోజనముతో సమానమైనదే. నీవు అతిధిని విడిచి భుజించినావు కాన, నీవు నమ్మకద్రోహివగుదువేగాని హరిభక్తుడవెట్లు కాగలవు? శ్రీ హరి బ్రాహణావమానమును సహింపడు. మమ్మే యవమానించుట యనిన శ్రీహరిని అవమానించుటయే. నీవంటి హరినిందాపరుడు మరి యొకడులేడు. నీవు మహాభక్తుడనని అతి గర్వము కలవాడవై వున్నావు. ఆ గర్వముతోనే నీవు నన్ను భోజనమునకు ఆహ్వనించి అవమానపరచి నిర్లక్ష్యముగా జలపాన మొనరించితివి. అంబరీషా! నీవెట్లు పవిత్ర రాజకుటుంబములో బుట్టినావురా! నీ వంశము కళంకము కాలేదా?" అని కోపముతో నోటికి వచ్చినట్లు తిట్టెను. అ౦బరీషుడు, ముని కోపమునకు గడ గడ వణుకుచు, ముకుళిత హస్తములతో "మహానుభావా! నేను ధర్మహీనుడను, నా యజ్ఞానముచే నేనీ కార్యము చేసితిని. నన్ను రక్షింపుడు. బ్రాహణులకు శాంతియే ప్రధానము. మీరు తపోధనులూ, దయా దాక్షిణ్యములు గలవారూ కాన, నన్ను కాపాడు" డని అతని పాదములపై పడెను. దయాశూన్యుడైన దూర్వాసుడు అంబరీషుని తలను తన యెడమకాలితో తన్ని "దోషికీ శాపమీయకుండా వుండరాదు. నీవు మొదటి జన్మలో చేపగాను, రెండవ జన్మలో తాబేలుగానూ, మూడవజన్మలో పందిగాను, నాలుగవ జన్మలో సింహముగాను, యైదవజన్మలో వామనుడు గాను, ఆరోవ జన్మలో క్రూరుడవగు బ్రాహణుడవుగాను, యేడవ జన్మలో మూఢుడవైన రాజుగాను, యెనిమిదవ జన్మలో రాజ్యముగాని సింహాసనముగానిలేనట్టి రాజుగాను, తొమ్మిదవ జన్మలో పాషండ మతస్తునిగాను, పదవ జన్మలో పాప బుద్ధిగల దయలేని బ్రాహ్మణుడవుగాను పుట్టెదవుగాక" అని వెనుక ముందు లాలోచించక శపించెను. ఇంకను కోపము తగ్గనందున మరల శపించుటకు ఉద్యుక్తడగుచుండగా, శ్రీ మహావిష్ణువు బ్రాహణ శాపము వృధాకాకూడదని, తన భక్తునికి ఏ అపాయము కలుగకుండుటకు - అంబరీషుని హృదయములో ప్రవేశించి "మునివర్యా! అటులనే - మీ శాపమనుభవింతు" నని ప్రాధేయపడెను. కాని దూర్వసుడింకనూ కోపము పెంచుకొని శపించబోగా, శ్రీమన్నారాయణుడు తన సుదర్శన చక్రమును అడ్డుపెట్టెను. ఆ సుదర్శనము కోటి సూర్యప్రభలతో అగ్నిజ్వాలలు గ్రక్కుచూ దూర్వసునిపై పడబోయెను. అంత దూర్వాసుడు ఆ చక్రము తనని మసిచేయునని తలంచి ప్రాణముపై ఆశ కలిగి అచటి నుండి "బ్రతుకుజీవుడా" యని పరుగిడెను. మహాతేజస్సుతో చక్రాయుధము దూర్వసుని తరుముచుండెను. దుర్వాసుడు తనను కాపాడమని భూలోకమున ఉన్న మహామునులను, దేవలోకమున కరిగి దేవేంద్రుని, బ్రహ్మలోకానికి వెళ్లి బ్రహ్మదేవుని, కైలాసమునకు వెళ్లి పరమేశ్వరునీ యెంత ప్రార్దంచినను వారు సైతము చక్రాయుధము బారినుండి దూర్వాసుని కాపాడలేకపోయిరి.
ఇట్లు స్కాంద పురాణంతర్గత వశిష్టప్రోక్త కార్తీక మహాత్మ్యమందలి పంచవింశోధ్యాయము - ఇరవయ్యయిదో రోజు పారాయణము సమాప్తము.
🌹 🌹 🌹 🌹 🌹
🌹కార్తీక మాసం 25వ రోజు పూజించ వలసిన దైవం - చేయవలసిన మంత్రం - దానం - నైవేద్యం 🌹
ప్రసాద్ భరధ్వాజ
నిషిద్ధములు:- పులుపు, చారు - వగయిరా ద్రవపదార్ధాలు
దానములు:- యథాశక్తి
పూజించాల్సిన దైవము:- దిక్పాలకులు
జపించాల్సిన మంత్రము:-
ఓం ఈశావాస్యాయ స్వాహా
🌹 🌹 🌹 🌹 🌹
Subscribe to:
Posts (Atom)