సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 6

Image result for madame blavatsky secret doctrine
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 6 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

 🍃. ఐదవ స్థితి 🍃

216. 5వ స్థితి ప్రపంచ నిర్మాణము ముఖ్యముగా సౌర కుటుంబ నిర్మాణమును గూర్చి తెలియజేస్తుంది. మొదట కేవలం మూల పదార్థం  స్పందన రహితముగా, నిష్క్రియగా వుండి తరువాత అగ్ని దుమారం తరువాత సౌర కుటుంబం, ఒక్కొక్క గ్రహము ఇంకా ఇతర నిర్మాణాలు కావింపబడినవి.

217. మానవ స్థాయి కేవలం భౌతిక స్థాయికే పరిమితం కాకుండా, ఏలోకములోనైన ఉంటూ, పదార్థము ఆత్మ మధ్య కావలసిన సంతులత సాధించగల్గాలి. ప్రతి వ్యక్తి దివ్యత్వాన్ని పొందే హక్కు స్వానుభవం ద్వారానే పొందగల్గాలి. దేవతలు, ఋషులు, నిర్మాణ కర్తలు ఏ రూపంలో ఉన్నా ఒకప్పుడు మానవులేనని గుర్తించాలి.

218. దేవ పుత్రులు, వారివారి సంతానములు వివిధ ఊర్ధ్వ లోకములలో సంచరించగలరు. వారి సంకల్పములు వార్తాహరులుగా, అగ్ని సుడిగుండాలుగా ఏర్పడతాయి.

219. జ్ఞాని బుద్ధులు మొత్తం 7 గురు ఉంటారు. వారిలో 5గురు ప్రకటితమయ్యారు. వారు రహస్య జ్ఞానము, ప్రజ్ఞ కలిగి ఉంటారు. మిగిలిన ఇద్దరు బుద్దులు భూమి మరి కొంత వికాసం చెందినపుడు ఆ కాలములో అవతరిస్తారు.

220. ఒకసారి నిద్రిస్తున్న తల్లి, తండ్రి నుండి దివ్య పుత్రులు బయటపడిన వారు ప్రేరణా శక్తులుగా మారి, అనేక స్వరూపాలు పొందుటకు కారణమవుతారు. ఇవన్నీ ఏకమై సమూహ స్వరూపాలు రూపొందుతాయి.

221. విశ్వ స్థాయిలో సౌర కుటుంబము నుండి మిణుగురు పురుగుల వరకు, సృజనాత్మకత నాడులలో భగవంతుని ఇచ్ఛానుసారము ఆధ్యాత్మిక వేత్తలు మార్పు చేస్తుంటారు.

222. విశ్వములో ఉన్న సార్వత్రిక మనస్సు యొక్క ఊహలకు అనుగుణంగా సౌర కుటుంబములో విభిన్న వ్యవస్థల స్థితులు ఏర్పడతాయి.

223. వ్యక్తి సాధనలో ఆధ్యాత్మిక వేత్తలను గుర్తించి, వారి ఆలోచనలపై సాధన చేసి, కల్కి అవతారం ఉద్దేశ్యాలను గమనించి వాటికి తోడ్పడాలి.

224. విష్ణువు యొక్క వామనావతారములో 3 అడుగుల రహస్య కథ, జ్యోతి శ్చాస్త్ర పరంగా ఈ 3 అడుగులు సూర్యుని యొక్క పగలు, మధ్యాహ్నము, సాయంత్రాలుగా గ్రహించాలి.

225. సుడిగుండములు సృష్టిలోని ఒక నియమము. ఇది నక్షత్రములకు గ్రహాలకు, విశ్వాంతారాళములో జరిగే గమనములో గల నియమమును గూర్చి చర్చిస్తాయి.

226. సూర్య, అగ్ని, ఉపాసనములో చాలా గంభీరమైన ఆధ్యాత్మిక సత్యాలు నిండి ఉన్నాయి. భౌతిక పదార్థములన్నింటిలో అగ్నిని విశ్లేషించుట కష్టము. గాలి: ఆక్సిజన్‌, నైట్రోజన్‌ మరియు ఇతర వాయువుల మిశ్రమమని ఖచ్చితంగా చెప్పగలము. భూపదార్థములు కూడా నిశ్చిత రసాయనానికి, నిశ్చిత పదార్థముల సంయోగముగా చెబుతారు. కాని అగ్ని దహన క్రియ వల్ల ఏర్పడినది. ఇది వేడి, కాంతిగతి మరియు రసాయనిక శక్తుల సమ్మేళనము.

227. అగ్ని వల్ల అరూప, రూప ప్రపంచములు ఏర్పడ్డాయి. ఒక జ్యోతిలో ఏడు జ్యోతులు అలా ప్రతిదాని నుండి 7x7 చొప్పున వెలుగులతో ప్రపంచాలు రూపొందాయి.

228. ఉత్తర, దక్షణ, తూర్పు, పడమర దిక్కులను పాలించే దిక్పాలకులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క విశిష్టమైన రహస్య లక్షణాలు ఉన్నాయి. వారు కర్మతో కూడా సంబంధము కలిగి ఉంటారు. ఆ నల్గురు మానవ జాతి రక్షకులు. వీరిని గంధర్వ, అసుర, కిన్నెర, నాగులుగా పురాణాలలో పేర్కొన్నారు.

229. నిర్మాణాత్మక కార్యక్రమములు చేపట్టే మూడు ముఖ్యమైన సమూహాలు ఉన్నాయి. ప్రతి సమూహము ఏడు ఉపసమూహములుగా ఏర్పడతాయి.

230. మొదటి సమూహము బ్రహ్మ మానస పుత్రులు. ఆది ఋషి ప్రజాపతులు, వీరు మండలములను నిర్మిస్తూ, పునర్నిస్తూంటారు. రెండవ సమూహము గ్రహ మాలికలను నిర్మించే వారు. మూడవ సమూహము మానవజాతి, ఆదిశక్తులు, తూర్పున ఇంద్రుడు, పడమర వరుణడు, దక్షిణమున యముడు, ఉత్తరమున కుబేరుడు.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹