✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻. విషువత్ - 2 🌻
(21st March)
సంవత్సరాదిని నిర్ణయించుటకు వేదఋషులు ఒక పుల్లను పాతి దాని నీడను కొలిచి ఈ దినమును స్థాపించెడి వారు. ఈ బిందువునుండి సమస్త ఖగోళ గణితములను లెక్కించెడివారు.
ఈ బిందువు ప్రతి సంవత్సరము భూమధ్యరేఖపై కొంచెము వెనుకకు నడుచుచుండును. ఈ నడచుటనే గవామయము అను యజ్ఞముగా వేద ఋషులు గుర్తించిరి.
ఈ బిందువుతోపాటు సంవత్సరాది కూడ వెనుకకు నడచుచుండును. దీనినే కాలస్వరూపుడగు శంకరుడు మృగరూపమైన యజ్ఞమును వేటాడుటగా కవులు వర్ణించిరి.
'నల్లలేడియందు దృష్టి నిలిపి వింటియందెక్కు పెట్టిన బాణమును చూచుకొనుచున్న నీవు మృగము వెంట పరుగెత్తుచున్న పినాకపాణి వలె నున్నావు.' అని కాళిదాస కృతమగు శాకుంతల నాటకమున మాతలి దుష్యంతుని ప్రశంసించును.
నాటకము మొత్తము నందును చాంద్ర సంవత్సరము యొక్క కథ అంతర్వాహినిగా నడచును. కనుకనే దుష్యంతుడు చాంద్రవంశపు రాజుగా చమత్కరింపబడెను.
ఈ బిందువునకై భూమధ్యరేఖ ఖండింపబడుటకు కావలసిన సూర్యగతి ధ్రువుని కాలముననే పుట్టినది.
....✍🏼 మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె
07.Sep.2020
No comments:
Post a Comment