🌷. సద్గురు శివానంద 🌷
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. పిప్పలాద మహర్షి - 6 🌻
33. సౌర్యాయణి అనే ఋషి పిప్పలాదుని, “డెవా! శరీరంలో నిద్రించేది ఏది? మేల్కొనేది ఏది? సుఖమంటే ఏమిటి?” అనీ అడిగాడు.
దానికి పిప్పలాదుడు, “ఇంద్రియములన్నీకూడా మనసులో లయం చెందటమే నిద్ర. ఇంద్రియాలు మనసులో లయిస్తాయి. జ్ఞానేంద్రియ పంచకము – అంటే కన్ను, చర్మము వంటి కర్మేంద్రియపంచకము వెనుక సూక్ష్మరూపంలో ఉండే జ్ఞానేంద్రియ పంచకము – మనసులో లయిస్తే దానిని నిద్ర అంటాము” అని చెప్పాడు.
34. “ఈ జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ పంచకము, అంతఃకరణ చతుష్టయాన్ని నడిపించటానికి కావలసిన ప్రాణశక్తిని మనలోంచి ఉద్భవంచేసి నడిపించేశక్తి ఆ పరమాత్మయందు ఉంది. కాని దానియందు ఈ ఇంద్రియములుకాని, ఈ ధాతువులుకాని ఏవీ ఉండవు. వాటికన్నిటికీ కావల్సిన శక్తిమాత్రమే అందులో ఉంటుందికాని దానిలో వస్తువులేవీ ఉండవు” అని తెలిపాడు.
35. ఓంకారోపాసన గురించి తెలియచేయమని మరొక ఋషి అడిగాడు.
దానికి పిప్పలాదుడు, “ఓంకారం ఏ కొద్దికాలం ఉపాసించినవారైనాసరే ఋగ్వేదాభిమాని అయినటువంటి దేవతలవల్ల మళ్ళీ మనుష్యులై పుడతారు. అయితే అధికంగా ఉపాసన చేసినవాళ్ళు యజుర్వేదాభిమాని అయినటువంటి చంద్రుడివల్ల చంద్రమండలానికి వెళ్ళి తిరిగివస్తారు.
36. త్రిమాత్ర అంటె ఇంకా ఎక్కువ ఉపాసించినవాళ్ళు, పాప విముక్తులై, సామవేదాభిమాని దేవతచే సూర్యమండలమార్గంలో బ్రహ్మలోకానికి వెళతారు. ఋక్‌యజుస్‌సామవేదాలకు ఉత్కృష్టస్థితి ఈ క్రమంలో ఉంటుంది” అని చెప్పాడు.
37. “షోడశ కళాపురుషులు అంటే ఎవరు?” అని మరొక ఋషి అడిగారు. “అతడు శరీరంలో ఉన్నాడు. కాబ్ట్టి దేహం స్వస్థంగా ఉండటానికి ఆధారమైన ఐదు విధముల ప్రాణశక్తి, ఆ ప్రణానికి తోడుగా శ్రద్ధ, ఐదు ఇంద్రియాలు, పృథ్వి మొదలైన పంచభూతములు – ఇవే పురుషులు. మనసు, అన్నము, వీర్యము సమస్తమూ పుడుతూ నిత్యమూ జీవనక్రియ నడుస్తూ ఉందికదా!
38. ఈ క్రియలన్నిటినీ షోడశకళలంటారు. నదులన్నీ సముద్రంలో ప్రవేశించినట్లు, అవన్నీ సర్వసాక్షి అయిన పురుషుడిలోపల ప్రవేశించి అస్తమిస్తాయి. దానినే మృత్యువంటారు. అవి శాశ్వతంగా అస్తమిస్తే అతడు అమృతుడవుతాడు. ఆ పురుషునిలోకి వెళ్ళి నిద్రించినపుడే మృత్యువు, మళ్ళీ బయటకు వచ్చినప్పుడు పునర్జన్మ ఉంటుంది. మళ్ళీ రాకుండా వెళితే మాత్రం అది మృత్యువుకాదు, అమృతత్త్వం” అని చెప్పాడు పిప్పలాదుడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మహర్షులజ్ఞానం #సద్గురుశివానంద
07.Sep.2020
No comments:
Post a Comment