✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 51, 52, 53 📚
బుద్ధితో యోగించి, ఫలములను త్యజించి, కర్తవ్యమును నిర్వర్తించు యోగికి నిస్సంగము ఏర్పడగలదు. అతనికి కర్తవ్యము యుండును గాని, వ్యక్తిగతమగు ఆశయములు, గమ్యములు వుండవు.
కర్మజం బుద్ధియుక్తా హి ఫలం త్యక్త్వా మనీషిణః |
జన్మబంధవినిర్ముక్తాః పదం గచ్ఛంత్యనామయమ్ || 51 ||
యదా తే మోహకలిలం బుద్ధిర్వ్యతితరిష్యతి |
తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ || 52 ||
శ్రుతివిప్రతిపన్నా తే యదా స్థాస్యతి నిశ్చలా |
సమాధావచలా బుద్ధిస్తదా యోగమవాప్స్యసి || 53 ||
అనగా తాను, తన కర్తవ్యము మాత్రమే యుండును. మరణించ కూడదని యుండదు. పుట్టకూడదని కూడ యుండదు. మరణించకూడదని, పుట్టకూడదని, పుణ్య కర్మలను ఆచరించు వారు కళాసక్తితో ఆచరించు వారే తప్ప వారికి పుట్టని, చావని స్థితి కలుగనేరదు. శ్రీకృష్ణు తెలిపిన యోగజీవులు ఎట్టి సిద్ధుల కొరకును ప్రయత్నింపరు.
అమరత్వము కొరకు, బ్రహ్మత్వము కొరకు ప్రయత్నముండదు. ఉండుటయే యుండును. కర్తవ్యముండును. వారికి నిస్సంగము పరిపూర్తి యగుటచే కోరకయే సమస్తమును లభించగలదు.
వారి చేతలయందు కళాసక్తి లేదు
గనుక బంధము నుండి విడువబడిన వారలై యుందురు. బంధము లేక యుండుటయే పరమ పథంము. అట్టి వారు శరీరము నందు కూడ యుందురు. శరీరము వారిని బంధింపదు. ఎటు చూచినను ఫలమునందు ఆసక్తిలేని కర్తవ్య కర్మమే శ్రేయోదాయకమని భగవంతుడు బోధించుచున్నాడు.
బుద్ధి, మోహమును, మాయను, అజ్ఞానమును విసర్జించి, తాను అను వెలుగుగా నున్నప్పుడు నిర్మలమైన బుద్ధి అని తెలియ బడుచున్నది. నిర్మలమైన బుద్ధి ఏర్పడవలె నన్నచో సతతము లోపల, వెలుపల ఆత్మానుసంధానము చేసుకొను చుండవలెను. దీనిని దైవయోగము అందురు.
అనగా బుద్ధిని దైవముతో జత పరచుట. ఇది నిరంతరము సాగినప్పుడు బుద్ధి నిర్మలమగును. అట్టి బుద్ధితోనే నిష్కామముగ కర్మల నాచరించిన జనన మరణ రూప బంధమునుండి కూడ జీవుడు విడుదలను పొందును అని భగవానుడు చెప్పియున్నాడు.
అట్టి బుద్ధియే ధర్మముతో కూడిన కర్తవ్యములను సతతము నిర్వర్తించగలదు. అట్టి నిర్వర్తనమే కర్మలయందు కౌశలము అని తెలిపి యున్నాడు.
బుద్ధి, ఆత్మయందు యోగించగ, అట్టి బుద్ధితో యోగించిన మనస్సు కర్మలను క్షేమముగను, కౌశలముగను నిర్వర్తించ గలదని అర్థము. యోగము చెందని మనస్సు కౌశలముగ కర్మలను నిర్వర్తించుట జరుగదు.
అట్టి మనస్సే కౌశలము పేరున కుటిలత్వము ననుసరించును. కావున బుద్ధిని సదా ఆత్మతో అనుసంధానము చేయవలెను. అట్టి బుద్ధి క్రమశః నిర్మలమగును. చీకిటిని దాటిన బుద్ధిగా వెలుగొందును. అనగా మాయా వర్ణమును దాటి యుండును. అట్లు దాటి యుండుటకు కారణము ఆత్మానుసంధానమే.
అట్టి బుద్ధి కర్మలను సహజముగనే నిర్లిప్తముగను, బంధములు కలిగించని విధముగను, నిర్వర్తించుచుండును. ఏది వినినను, ఏది చూచినను వికారము చెందదు. చలనము లేని ఇట్టి బుద్ధిని పొందుట కర్తవ్యమని భగవానుడు బోధించుచున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్
07.Sep.2020
No comments:
Post a Comment