కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 47




🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 47   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 11 🌻

శాశ్వతమైనటువంటి ఆత్మ దృష్ట్యా చూచినప్పుడు ఇవన్నీ కూడా అశాశ్వతములైనటువంటివి.

వీటి యెడల నీ అంతరంగాన్నీ పూనడం అంటే నీ అంతరంగాన్ని పనిచేయించడం సరియైనటువంటి పద్ధతి కాదు, అది జీవ పద్ధతి, ఆత్మభావ పద్ధతి కాదు. కావున ప్రయత్నించి ఇటువంటి పద్ధతిని విడనాడాలి. అందుచేత కర్మఫలాపేక్షను వదలి కర్తవ్య కర్మలను నాచికేతాగ్ని చయన మొనరించి సాపేక్షిక నిత్యత్వం గల యమాధికారమును పొందితిని.

ఆయన అష్టదిక్పాలకులలో ఒకరిగా యమధర్మరాజు గా ఆయనకి ఆ స్థానం ఎలా లభించిందో ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఆయన వీటన్నింటినీ విసర్జించాడు. వీటన్నిటియందు వైరాగ్యమును కలిగివున్నాడు. ఇంకేం చేశాడు. కేవలం కర్తవ్య నిష్ట మాత్రమే కలిగివున్నాడు.

ఆ కర్తవ్య నిష్ట చేత ఎవరి ప్రాణములను ఎప్పుడు హరించవలసి వచ్చినా ఆఖరికి అవతార పురుషులైనా, శ్రీరామచంద్రుడైనా, శ్రీకృష్ణమూర్తి అయినా సరే కాలమాసన్నమైనపుడు వినయముగా అవతార పురుషునివద్దకు వెళ్ళి “అయ్యా! మీ సమయం పూర్తయింది. మీరిక అవతారాన్ని చాలించండి“ అని చెప్పేటటువంటి సమవర్తి యమధర్మరాజు.

కాబట్టి నిర్భయత్వముతో, నిర్భీతితో నిరంతరాయముగా తాను సహజముగా సాక్షిగా నిలబడి కర్తవ్య కర్మను మాత్రమే ఆచరించేటటువంటి వ్యక్తి.

ఇంకేమిటటా - మిగిలిన అంశాలనన్నింటినీ నాచికేతాగ్ని సంచయనము వాటియందు – ‘సంచయనము’ అంటే బాగా గుర్తుపెట్టుకోండి నిశ్శేషముగా లేకుండా చేయుట.

ఇది సంచయనము అంటే అర్ధం. ఇన్ని అకర్మలను ఆచరించినా కూడా ఎంతో కొంత శేషభాగం మిగిలిపోతుంది. ఆ శేషభాగాన్ని మొత్తాన్ని పట్టుకెళ్ళి నాచికేతాగ్ని అనే యజ్ఞంలో పూర్ణాహుతిగా నిశ్శేషముగా దగ్ధము చేయుట. సంచయనము అంటే నిశ్శేషముగా పోగొట్టుకొనుట.

అటువంటి సంచయనము ఒనర్చడం చేతనే ఆయన సాపేక్షిక నిత్యత్వము గల యమాధికారమును పొందాడు. అంటే స్వయముగా ఈశ్వరుడేమో నిత్యుడు. ఈశ్వరునితో సమానమైనటువంటి నిత్యత్వం. సాపేక్షిక నిత్యత్వం అంటే అర్ధం అది.

ఈశ్వరుడితో సమానమైనటువంటి నిత్యత్వాన్ని పొందినటువంటి యమధర్మరాజు తనకి ఆ స్థితి అట్లా కలిగింది. ఆ ఈశ్వరనియమంతో ఈశ్వరునితో సమముగా వ్యవహరించగలిగేటటువంటి స్థితి ఎట్లా కలిగిందో ఈ అంశములందు బోధించేటటువంటి ప్రయత్నాన్ని మనకి చేశారు.

ముఖ్యమైన అంశం ఏమిటంటే కామ్య కర్మలను ఫలాపేక్షతో చేసేటటువంటి వాడు మోక్షం పొందజాలరు. తీవ్ర మోక్షేచ్ఛ అనేది వీళ్ళకు కలగదు. అతి ముఖ్యమైన అంశం. ఫలాపేక్షలేకుండా కర్మలని ఆచరించడంచేత, అంటే నిష్కామ కర్మ చేత చిత్తశుద్ధి కలుగుతుంది.

జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం కలుగుతుంది. ఈ రెండూ చాలా ముఖ్యం. నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి, ఆత్మ విచారణ ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానం, జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం అనేవి చాలా ముఖ్యం.

ఈ రెండు జీవిత లక్ష్యాలనే స్వీకరించి కామ్యక కర్మలను సదా త్యజించవలెను. త్యజించవలెను అంటే ఫల అపేక్షను త్యజించవలెను. ఫల ఆసక్తిని త్యజించవలెను. ఫల ప్రేరణ ద్వారా నువ్వు చేయరాదు. ఈ రకమైనటువంటి కర్తవ్య నిష్ట కలిగివుండాలి.

తదుపరి చిత్తశుద్ధి ద్వారా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి. తద్వారా జీవన్ముక్తిని నీవు పొందగలవాడవు. ఈ రకముగా నీవు తెలుసుకొనవలసినది అని యమధర్మరాజు నచికేతునికి బోధించుచున్నాడు.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

07.Sep.2020

No comments:

Post a Comment