మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 154 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 2 🌻

ప్రతికూలపు ఆలోచన ప్రతికూల దృక్పథమునే‌ కల్పింపక తప్పదు. ఇతరులకు మనము ప్రతికూలపు ఆలోచనను అందించినచో మనకు కూడా వారి నుండి ప్రతికూలపు ఆలోచనయే ఎదురగాక తప్పదు.

ఇట్టి వ్యవహారము, ఇరువురు వ్యక్తుల నుడమ వాటిల్లినచో, దాని ప్రభావము సమాజముపై అంతగా ఉండదు. కాని, ఇట్టిదే రెండు వర్గములకో, జాతులకో, దేశములకో ప్రాతినిధ్యము వహించు ఇరువురు వ్యక్తుల నడుమ వాటిల్లినచో ఫలితము వినాశకరమగును.

సంగ్రామము పేరున, మానవ చరిత్ర పుటలలో చాలా బాధాకరములయిన గుణపాఠములు లిఖింపబడినవి. ప్రతి యుద్ధము గూడ, నరుడను జీవిలోని పశుప్రవృత్తి యొక్క చేవ్రాలు మాత్రమే. అనగా మృగ ప్రాయమైన బాధ్యతారహిత పథమున ఆలోచనలను, దృక్పథములను ఉద్భవింపజేయుటయే.

ప్రసార కేంద్రము నుండి వెలువడు ఒకే కార్యక్రమమును ఎవరి రేడియో అయినను స్వీకరించును. ఉద్వేగము వలన మనలో ఒక తలంపు పుట్టగనే, ఇతరులలోను అది ఉద్వేగమునే ప్రేరేపించును. అవతలి వ్యక్తి, ఉద్వేగమును అంతయు తనలోన సంలీనము గావించుకొన్నవాడయితే తప్ప, ఇది యథార్థము.

దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా..

...✍ మాస్టర్ ఇ.కె.🌻
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

12.Sep.2020

No comments:

Post a Comment