నారద భక్తి సూత్రాలు - 92


🌹.  నారద భక్తి సూత్రాలు - 92  🌹

✍️. సద్గురు శ్రీ విజ్ఞాన స్వరూప్ కోసూరి మురళీకృష్ణ,

🌻. చలాచలభోధ

📚. ప్రసాద్ భరద్వాజ

చతుర్ధాధ్యాయం - సూత్రము - 63

🌻 63. స్తీ ధన నాస్తిక (వైరి) చరిత్రం న శ్రవణీయమ్‌ ॥| 🌻

పురుషులలో శృంగారం ఉదయించడానికి కారణ భూతమైన స్త్రీల కథలను వినరాదు. ఇంద్రియ భోగాలకు, వ్యసనాలకు ఆలవాలమైన ధనంతో ముడిపడిఉన్న విషయాలను వినరాదు. నాస్తికులతో వాదన చేయరాదు. ఈ మూడింటిని శత్రువులుగా చూడవలెను.

స్త్రీ విషయంగా దర్శనం, స్పర్శనం, కేళి, కీరనం, గుహ్యభాషణం, సంకల్పం, అధ్యవసాయం, క్రియానివృత్తి అని ఎనిమిది మైధున భావా లున్నాయి. స్త్రీ సంపర్కం చేయకున్నను పై ఎనిమిది వికారాల వలన మనసు చలించి భక్తిభావం విచ్చిన్న మవుతుంది. స్త్రీలపై తృష్ణ భోగ్యతా బుద్ధి విడనాడాలి. అట్లే స్త్రీలు కూడా పురుషుల యెడ ఈ విధమైన వికారాలు కలుగకుండా చూచుకోవాలి.

ధనం వలన చెడు అలవాట్లు కలిగి, వ్యసనాలవాలై విడుదలవడం కష్టమవుతుంది. ఇంద్రియ భోగలాలసకు అవకాశం కలుగుతుంది. ఇక దిగ జారుడు మొదలవుతుంది. కనుక కాంత, కనకాల ప్రస్తావనే రాకూడదని చెప్పన్నారు. ఆ విషయాలు ఎవరైనా చెపితే వినరాదని కూడా చెప్తున్నారు. అత్యంత జాగరూకత అవసరం.

శివ భక్తుడైన రావణుడు స్త్రీ కాంక్ష వల్లనే పతనమయ్యాడు. రామకృష్ణ పరమహంస తన భార్య శారదను మాతవలె భావించారు. భక్త ప్రహ్లాదుడు స్త్రీలు ఎదురైతే మాతృభావంతో అడ్డుతొలగేవాడు. “ప్రతి స్త్రీలో అమ్మను చూచేవాడికి అందనిదంటూ లేదు” అని జిల్లళ్ళమూడి అమ్మ వాక్యం.

స్త్రీలు వలె పురుషులు కూడా వారి శరిర రూప సౌందర్య పోషణ గావించు కోవడం చూస్తుంటాం. ఇట్టి విలాసపరులచే స్త్రీలు ఆకర్షింపబడాలనే కదా ఈ అలంకారం ? ఇట్టి బాహ్యమైన ఆడంబరాల మీద ధ్యాస ఉంటే ఇక భక్తి ఏకాగ్రతలు ఎలా కుదురుతాయి ? ఇదే మాదిరిగా స్రీలు కూడా ఆడంబరాలకు దూరంగా ఉండాలి.

నాస్తిక వాదులతో స్నేహం, వారితో వాదోపవాదాలు చేయడం వలన మనలో ఉన్న ఆస్తిక్య బుద్ధిలో సందేహాలు తలెత్తుతాయి. అంతటితో భక్తిలో ఏకాగ్రత తగ్గటం మొదలవుతుంది. భక్తి పెంపొందే దిశగా సత్సంగ గోష్టిలో పాల్గొంటూ పెద్దల సలహాలను, మార్దదర్శకాలను పాటించాలి.

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #నారదభక్తిసూత్రములు #చలాచలబోధ

12.Sep.2020

No comments:

Post a Comment