శ్రీ శివ మహా పురాణము - 222



🌹.  శ్రీ శివ మహా పురాణము - 222  🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

49. అధ్యాయము - 4

🌻. కామ వివాహము - 1 🌻

నారద ఉవాచ |

విష్ణుశిష్య మహాప్రాజ్ఞ విధే లోకకర ప్రభో | అద్భుతేయం కథా ప్రోక్తా శివలీలామృతాన్వితా || 1
తతః కిమభవత్తాత చరితం తద్వదాధునా | అహం శ్రద్ధాన్విత శ్ర్శోతుం యది శంభుకథాశ్రయమ్‌ || 2

నారదుడిట్లు పలికెను -

ఓ విష్ణుశిష్యా! నీవు గొప్ప ప్రాజ్ఞుడవు. హే విధే! నీవు లోకములను సృష్టించితివి. హే ప్రభో! శివుని లీలలు అనే అమృతముతో కూడిన ఈ అద్భుతమగు గాథను చెప్పితివి (1).

తండ్రీ! ఆతరువాత ఏమైనది? ఆ వృత్తాంతమును ఇప్పుడు చెప్పుము. నేను శంభుని గాథను వినుటయందు శ్రద్ధ గల వాడను (2).

బ్రహ్మోవాచ |

శంభౌ గతే నిజస్థానే వేధస్యంతర్హితే మయి | దక్షః ప్రాహాథ కందర్పం సంస్మరన్‌ మమ తద్వచః || 3

బ్రహ్మ ఇట్లు పలికెను -

శంభుడు తన స్థానమునకు వెళ్లెను. బ్రహ్మనగు నేను అంతర్థానము చెందితిని. అపుడు దక్షుడు నా ఆ మాటను స్మరించుచూ, మన్మథునితో నిట్లనెను (3).

దక్ష ఉవాచ |

మద్దేహజేయం కందర్ప సద్రూపగుణసంయుతా | ఏనాం గృహ్ణీష్వ భార్యార్థం భవతస్సదృశీం గుణౖః || 4
ఏషా తవ మహాతేజా స్సర్వదా సహచారిణీ | భవిష్యతి యథాకామం ధర్మతో వశవర్తినీ || 5

దక్షుడిట్లు పలికెను -

ఓ మన్మథా! ఈమె నా దేహమునుండి పుట్టినది. మంచి రూపము, గుణములు కలది. ఈమె గుణములలో నీకు తగినది. ఈమెను భార్యగా స్వీకరింపుము (4).

గొప్ప తేజస్వినియగు ఈమె సదా నీకు తోడుగా నుండును. ఈమె నిన్ను ప్రేమించును. నీకు అనుకూలముగా నుండి ధర్మమును పాలించగలదు (5).

బ్రహ్మో వాచ |

ఇత్యుక్త్వా ప్రదదౌ తసై#్మ దేహ స్వేదాంబుసంభవామ్‌ | కందర్పాయాగ్రతః కృత్వా నామ కృత్వా రతీతి తామ్‌ || 6
విహహ్య తాం స్మరస్సోsపి ముమోదాతీవ నారద | దక్షజాం తనయాం రమ్యాం మునీనామపి మోహినీమ్‌ || 7
అథ తాం వీక్ష్య మదనో రత్యాఖ్యాం స్వస్త్రియం శుభామ్‌ | ఆత్మా గుణన విద్దోసౌ ముమోహ రతిరంజితః || 8

క్షణ ప్రదాsభవత్కాంతా గౌరీ మృగదృశీ ముదా | లోలాపాంగ్యథ తసై#్యవ భార్యా చ సదృశీ రతౌ || 9

బ్రహ్మ ఇట్లు పలికెను -

దక్షుడు ఇట్లు పలికి తన దేహము యొక్క చెమటనుండి పుట్టిన ఆమెకు రతియను నామకరణము చేసి ఆమెను కందర్పుని ఎదుట నిలిపి సమర్పించెను (6).

ఓ నారదా! సుందరి, మునులను కూడ మోహింపజేయునది అగు ఆ దక్షపుత్రిని వివాహమాడి మన్మథుడు మిక్కిలి ఆనందించెను (7).

అపుడు మన్మథుడు రతి అనే శోభాయుక్తమగు తన భార్యను చూచి, అనురాగముచే నిండిన మనస్సు గలవాడై, తన బాణములచే తానే కొట్టబడినవాడై, మోహమును పొందెను (8).

గౌరవర్ణము గలది, లేడికన్నులు గలది, చంచలమగు ఓర చూపులు గలది, సుందరి అగు ఆ మన్మథుని భార్య అతనితో సమమైన అనురాగము గలదియై, అతనికి ఉత్సవమును కలిగించెను (9).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము

12.Sep.2020



No comments:

Post a Comment