🌹. కఠోపనిషత్ వివరణ - చలాచలభోధ - 52 🌹
✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 16 🌻
ఏంటంటే, ఈ జన్మలో, ఈ శరీరంతో నువ్వు ఏదైనా సరే, అధికారాన్ని, ఆధిపత్యాన్ని... చాలామందికి తెలుసు. మీ ఇళ్ళల్లో మీమాటే చెల్లుతూ వుంటుందనుకోండి. దాని అర్థం ఏమిటి? అంటే అది కూడా ఒక అధికారమే. నీ మాటే నెగ్గించుకోవడం.
అప్పుడు ఏం ఖర్చు అయిపోతుంది అంటే, పుణ్యఫలం ఖర్చు అయిపోతూ వుంటుంది. ఎదుటివాడు నువ్వు ఏదైనా చెప్పగానే, చెప్పకుండానే విని ఆచరిస్తున్నాడు, నీమాటను ఔదర దాలుస్తున్నాడు, ఔదారుస్తున్నాడు అనంటే, అంటే అక్కడ నీ పుణ్యఫలం ఖర్చైపోతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అబ్బా! నేనే నా సంసారమునకు అధిష్ఠానమును. నేనే నా కుటుంబమునకు అధిష్ఠానమును. నామాటే చెల్లుతుంది. నామాటే నెగ్గుతుంది. అనేటటువంటి అహం ఏదైతే వుందో, ఆ అహం ఈ పుణ్యభోగాన్ని అనుభవించేస్తూ వుంది.
ఈ రకంగా రాజ్యాధికార పదవి, అనేక రాజ్యాలుంటాయి ఈ ప్రపంచంలో... మనోరాజ్యం వేరే, బుద్ధిరాజ్యం వేరే, శారీరక రాజ్యం వేరే. ఐహికమైనటువంటి భూమండలాధిపత్యం వేరే.
అనేక రకాల అధికారములతో కూడినటువంటి, అనేక శాసనములు, అనేక పదవులు నా శాసనమే చెల్లుతుంది, నా మాటే చెల్లుతుంది, నేనే అధికారిని, నేనే అధిష్ఠానాన్ని అనేటటువంటి బలం ఏదైతే వుందో, ఆ బలం అంతా ఇతః పూర్వ పుణ్యఫలం చేత, ఖర్చయ్యేటప్పుడు జరిగేటటువంటి ఫలితం.
కాబట్టి, భక్తుడైనటువంటి వాడు ఎప్పుడూ ఎలా వుంటాడయ్యా? అనంటే, ‘దాసోహం’ - నాయనా! నాకు ఏ రాజ్యములు వద్దూ, నాకు ఏ సేవకులు వద్దూ, నేనే దాసాను దాసుడను. నేనే సేవకులకు సేవకుడను. నాకు సేవకులు అసవరం లేదు. నా సామాన్య అవసరములు తీరితే చాలు. నాకు ఏ రకమైనటువంటి ఇతరత్రా... ఇతరత్రా... ఎవరక్కడా అంటే పలికేటటువంటి వాళ్ళు అవసరం లేదు. ఈ రకంగా నిశ్చలంగా, భక్తి విశ్వాసాలతో ఉండి, ఈ రకమైనటువంటి ఆకర్షణ నుంచీ బయటపడాలి.
ఇంకొక్కటి ఏం చెప్తున్నారు? ఐహికంలో రాజ్యపదవి ఎలాగో, ఆముష్మికంలో హిరణ్యగర్భ పదవి కూడా అంతే. ఈ హిరణ్మయ కోశానికి అధిష్ఠానం హిరణ్యగర్భుడు. మీరు అందరూ కూడా ఐదు కోశముల విషయం తెలుసుకుని ఉండాలి. ఈ ఐదు కోశములకు అవతల హిరణ్మయకోశం అని ఆరవ కోశం కలదు.
కాబట్టి, “జనన మరణ రాహిత్యం పొందాలి అనంటే, షట్కోశ రహితం అవ్వాలి”. పంచకోశ విచారణ, పంచకోశ నిరసన వరకూ సరిపోదన్నమాట. ఆరవకోశమైనటువంటి హిరణ్మయకోశము నందు ప్రవేశించి, అట్టి హిరణ్యగర్భ పదవిని కూడా, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ వున్నటువంటి సమస్తమూ ‘నాకు అవసరం లేదు’ - అనే త్యాగం చేయగలిగేటటువంటి, తీవ్రవైరాగ్యం కలిగినటువంటి వాడు ఎవడైతే వున్నాడో, వాడు మాత్రమే మోక్షమునకు అర్హుడు.
ఈ రకమైనటువంటి సత్యాన్ని ఇక్కడ పునరుద్ఘాటిస్తున్నారు. ఇవి అశాశ్వతమని ఎరిగి తోసిపుచ్చాలి. ఇది చాలా ముఖ్యం. - విద్యా సాగర్ స్వామి
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
12 Sep 2020
No comments:
Post a Comment