29. గీతోపనిషత్తు - ఆత్మ చింతన - ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తు వివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును




🌹  29.  గీతోపనిషత్తు - ఆత్మ చింతన - ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తు వివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును.  🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚. గీతోపనిషత్తు - సాంఖ్య యోగము - 59 📚

విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః |

రసవర్జం రసో‌உప్యస్య పరం దృష్ట్వా నివర్తతే || 59 ||

దైవచింతన లేక ఆత్మచింతన దీర్ఘకాలము జరిగిన వానికి విషయ చింతన తొలగుటయే కాక క్రమశః వాని వాసన కూడ తొలగి పోగలదు. దైవమును నమ్ముట వేరు, దైవము నచ్చుట వేరు. నచ్చినపుడే మనస్సునకు ఆసక్తి కలుగును.

అట్టి ఆసక్తి వలన మనస్సు దైవమునందే రమించుటకు పదే పదే కోరుకొనుచుండును. అనురక్తి దైవము పైకి మరలక అది హెచ్చు చుండును. ప్రబల మగుచుండును. అది కారణముగ తాత్కాలిక సుఖ సంతోషముల కన్న శాశ్వత సంతోషము నందు రుచి కలుగుటచే విషయ వాసనలయందు కూడ క్రమశః ఆసక్తి తొలగిపోవును.

ఇంద్రియార్థముల వెంట తీరుబడి లేక తిరుగువాడు ఎట్లు ప్రవర్తించునో అట్లే తీరుబడి లేని దైవచింతన యందు మనస్సు పాదుకొని ఇంద్రియార్థముల యందు కూడ దైవమునే గుర్తించుట జరుగుచుండును.

ప్రకృతి దైవీప్రకృతిగ గోచరించును. తన ప్రకృతి దైవీప్రకృతి కాగ సమస్తము నందలి దైవమునే చూచుచు స్థిరమతియైు యుండును. అతనిని దైవము తప్ప మరి ఇతరములు ఆకర్షించవు. అట్టి వాడు 'స్థితప్రజ్ఞుని' భగవంతుడు తెలుపుచున్నాడు.

జీవుడు ఆహారమును అనేక రకములుగ స్వీకరించుచున్నాడు. కేవలము భోజనమే ఆహారము అనుకొనరాదు. పంచేంద్రియముల నుండి, మనస్సు నుండి (అనగా భావము నుండి) రక రకములైన విషయములను తన లోపలికి మనిషి స్వీకరించుచున్నాడు. ఈ ప్రవృత్తి కూడ ఆహారమే. ఇక్కడ ఆహారము వాసనాపరముగ నుండును.

ఈ వాసనలు జన్మ జన్మలలో జీవుడు ప్రోగుచేసుకొని తనతో తెచ్చుకొను చుండును. మాలిన్య పదార్థములను ప్రోగుచేసుకొని తెచ్చుకొను జంతువువలె జీవుని మనస్సు ఈ వాసనలను కూడ శుభవాసనలతో పాటు కొని తెచ్చుకొనును. ఈ ఆహారమును విసర్జించుట నిజమైన నిరాహార దీక్ష.

ఉదాహరణకు భోజనమును గూర్చిన ఆసక్తి భుజించని సందర్భములలో ఉండినచో అది వాసన యగును. భార్య లేని సమయములో భర్తకు భోగాసక్తి యుండుట వాసన యగును. ఇట్లే ధనము గూర్చి, ఇతర చిల్లర విషయముల గూర్చి అవి లేని సందర్భమున భావించుట వాసనయే. ఈ వాసనలు కూడ ఆహారముగ సంకేతింపబడినవి.

వీటి యందు రతి చెందిన వాడు సతతము అశుద్ధ ఆహారమును భావముచే స్వీకరించుచుండును. వీని విసర్జన సులభమైన విషయము కాదు. ఆత్మ విచార మొక్కటియే పరిష్కారము.

ఆత్మ తత్త్వమును గూర్చి వినుట, మననము చేయుట బాగుగ సాగినచో నిత్యానిత్య వస్తువివేక మేర్పడి ఆత్మజ్ఞానము నందు రుచి కలుగును.

ఆ జ్ఞానము అగ్నిది. అగ్ని సమక్షమున ఏదియును నిలువక అగ్నిలో లయమగును. ఆ విధముగ వాసన లంతమొందును. అట్టి వాడు ఇంద్రియార్థ విషయములను స్వీకరింపనట్టి దేహము కలవాడై యుండును. అతడు స్థితప్రజ్ఞుడు. అంతే నిరాహారి.

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్

12.Sep.2020

No comments:

Post a Comment