మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155



🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 155  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 3 🌻

దౌర్భాగ్య వశమున, మన నరులలో 98% మంది, ఉద్వేగమునందే బ్రతుకుచు, ఉద్వేగమను మాలిన్యము నుండియే తలంపులను ఉద్భవింప జేయుచున్నారు. ఫలితమెప్పుడును, తిరిగి ఉద్వేగముతోడి స్పందనయే గదా.

అధిక రుచికరమైనది ఏదయిన, ఉద్వేగము యొక్క స్థానమున వెలయ కున్నచో ఈ విపత్తు నుండి బయటపడుట సాధ్యము కాదు. మనలో ఉద్వేగము యొక్క స్థానము గొనవలసినది ఏది? పెద్దలు దీనినే స్పూర్తి అనుచున్నారు.

మనము ఉదాత్తమైన దాని నుండి స్పూర్తి నందినచో మన ఉద్వేగములు క్రమముగా క్షాళితములగును మట్టి రేణువులు, అడుగున నిలిచి, నిర్మల జలములు బయటపడుటకు అవకాశము కలుగును. స్వర్ణ రసాయన శాస్త్రవేత్త దీనినే పరిశుద్ధీకరణ విధానమని పేర్కొనెను. మన యందు ఈ విధానము అమలు జరిగినచో అవతలి వారి స్పందనయు పరిశుద్ధముగానే ఉండును.

పరిశుద్ధి చెందిన జలములలో ఏదయిన సంచలనమును కలిగించినను, ఎట్టి అవక్షేపమును అడుగునకు జేరదు. రంగు మార్పు జరుగదు.

మనలో ఇట్లు పరిశుద్ధీకరణము చెందిన అనుభూతి యొక్క వాహికను పెంపొందించుకొననగును. అనగా, అనుభూతి తన ద్వారమున అందుకొననగు వాహిక అను మాట. ఇట్టి స్థితినే 'స్పూర్తి' అందురు.

ఇట్టి స్థితిలో మన సంబాషణ, అవతలి వానిలో ఉద్వేగమును గాక, పరమప్రేమ రూపమగు భక్తిని ప్రేరేపించును. భక్తికి, ఉద్వేగమునకు గల వ్యత్యాసము పరిశుద్ధ జలములకు మట్టితో గూడిన మురికి నీటికి గల వ్యత్యాసము వంటిదే. భక్తి అనునది, మన దృక్పథమును ఉదాత్తము గావించి, మనకు అనుభూతినందించును.....
✍ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

13 Sep 2020

No comments:

Post a Comment