మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156


🌹.  మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 156  🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ


🌻. భావ బలము - 4 🌻

ఇంకొక యధార్థమేమనగా, ఉద్వేగమనునది ఉప్పెన కెరటములుగా మార్పు చెందుచుండును. భక్తి అట్లు గాక, నిశ్చల జలముల వలె మన యందు నిండిపోవును.

స్పూర్తితో పుష్టినొందిన భక్తి (పరమ ప్రేమ) అనభూతి కలిగిన వానిలో దృక్పథము మార్పు చెందుట జరుగదు. నాకు, నీ యెడల ప్రేమను అసత్యపు పేరుతో ఉద్వేగపూరితమైన సంగమున్నచో, అది తప్పక‌ మిక్కిలి ధృడమై తీరును.

మరియు అతి ధృడమైన ద్వేషమును కలిగించకుండ యుండదు. ఉద్వేగబంధితుడగు జీవుడు పశుప్రాయుడే‌, సెలవు రోజున తన ప్రియ స్నేహితుడు అతని వేరొక స్నేహితునితో కలిసి చరించుట గాంచినచో ఫలితమేమి? తనకు, అవతలి వాని యెడల గల ప్రేమకు ఫలముగా, అసూయా రోషములతో దుఃఖించుట దక్కును. ఇది ఉద్వేగముతో కలుషీకృతమైన ప్రేమ యొక్క ఫలితము.

ఉద్వేగము వలన అవతలి వ్యక్తులను వస్తువులను మనకు చెందిన వానిగా భావించి చిక్కులలో పడుట జరుగును.

పరమప్రేమ రూపమయిన భక్తి వలన మనవి అనబడు వానిని చివరకు మనలను గూడ సమర్పించుకొనుట జరుగును. పశుపద్ధతిలో మనము అవతలి వానిని ఇష్టపడినచో, వానిని మనకు చెందిన వస్తువుగా ‌భావించుట జరుగును. మనము అనుకొన్న మంచి పద్ధతిలో అవతలి వాడు నడువ వలెనని ఆశించుట జరుగును. ఈ పద్ధతి వట్టి మూర్ఖత యగును.

అవతలివాడు, తనదయిన రీతిలో తాను వర్తింపనారంభింపగనే, మనలో తీవ్రమగు కఠిన ప్రతిక్రియ ఉప్పతిల్లును.

అంతటితో వానిని ద్వేషింప ఆరంభింతుము. ఇట్లగుటకు కారణమేమి? అవతలి వానిని మనము ప్రేమించుటయే. ఇట్టి ప్రేమ నిజమైన ప్రేమ అగునా? ఇదియు ద్వేషమను కాలుష్యముతో గూడిమదై సంగమగుచున్నది. మన ప్రేమకు గురిఅయిన వానిని ద్వేషించుటకు కారణము, ఉద్వేగముచే ప్రేరేపింపబడిన భావముల శక్తియే...
...✍ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #మాస్టర్ఇకె

14 Sep 2020


No comments:

Post a Comment