రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ
🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴
49. అధ్యాయము - 4
🌻. కాముని వివాహము - 2 🌻
తస్యా భ్రూయుగలం వీక్ష్య సంశయం మదనోsకరోత్ | ఉత్సాదనం మత్కోదండం విధాత్రాస్యాం నివేశితమ్ || 10
కటాక్షాణా మాశుగతిం దృష్ట్వా తస్యా ద్విజోత్తమ | ఆశు గంతుం నిజాస్త్రాణాం శ్రద్దధేన చచారుతామ్ || 11
తస్యాస్స్వభావ సురభి ధీర శ్వాసానిలం తథా | ఆఘ్రాయ మదనశ్శద్ధాం త్యక్తవాన్మలయాంతికే || 12
పూర్ణేందు సదృశం వక్త్రం దృష్ట్వా లక్ష్మ సులక్షితమ్ | న నిశ్చికాయ మదనో భేదం తన్ముఖ చంద్రయోః || 13
ఆమె కను బొమలను చూచి, ' బ్రహ్మ నా ధనస్సును లాగుకొని ఈమె కనుబొమలను మలచినాడా యేమి?' అని మన్మథుడు సందేహపడెను (10).
ఓ ద్విజశ్రేష్ఠా! ఆతడు ఆమె యొక్క వేగము గల చూపులను పరికించి, తన అస్త్రముల యందు శ్రద్ధను శీఘ్రమే కోల్పోయెను. ఆమె ఇతర సౌందర్యమునైననూ ఆతడు పరికించలేదు (11).
స్వభావ సిద్ధముగా పరిమళముగల ఆమె యొక్క నిటారైన శ్వాస వాయువును ఆఘ్రాణించి మన్మథుడు మలయమారుతము నందు విశ్వాసమును విడిచిపెట్టెను (12).
పూర్ణిమనాటి చంద్రుని బోలియున్న, చిన్న మచ్చతో శోభించే ఆమె ముఖమును చూచి, మన్మథుడు ఆమె ముఖమునకు, చంద్రునకు గల భేదమును ఎరుంగలేపోయెను (13).
సువర్ణ పద్మకలికాతుల్యం తస్యాః కుచద్వయమ్ | రేజే చూచుకయుగ్మేన భ్రమరేణవ వేష్టితమ్ || 14
దృఢీపీనోన్నతం తస్యాస్త్సనమధ్యం విలంచినీమ్ | ఆనాభి ప్రతలం మాలాం తన్వీం చంద్రాయితాం శుభమ్ || 15
జ్యాం పుష్పధనుషః కామః షట్పదావలి సంభ్రమామ్ | విసస్మార చ యస్మాత్తాం విసృజ్యైనాం నిరీక్షతే || 16
గంభీరనాభి రంధ్రాంతశ్చతుః పార్శ్వత్వగావృతమ్ | ఆననాబ్జేsక్షణద్వంద్వ మారక్తక ఫలం యథా || 17
బంగరుపద్మముల మొగ్గలవంటి ఆమె కుచ ద్వయము భ్రమరములు వాలినవా యన్నట్లున్న చూచుకములతో ప్రకాశించెను (14).
దృఢముగా బలిసి ఎత్తుగా నున్న ఆమె స్తనముల మధ్యలో నాభి గహ్వరము వరకు వెన్నెల వలె తెల్లనైన సన్నని మాల వ్రేలాడుచుండెను. శుభకరమగు (15)
ఆ మాలను నిరీక్షించుచూ, మన్మథుడు తుమ్మెదల పంక్తిచే నిర్మితమై అల్లకల్లోలముగా నున్న పుష్పధనుస్సు యొక్క నారిత్రాటిని మరిచిపోయెను (16).
అన్ని వైపుల మృదువగు చర్మముచే ఆవరింపబడియున్న నాభీరంధ్రములోతుగనున్నది. పద్మము వంటి ఆమె ముఖమునందలి రెండు కన్నులు ఎర్రని ఫలముల వలె ప్రకాశించుచున్నవి (17).
క్షీణాం మధ్యేన వపుషా నిసర్గాష్టాపదప్రభా | రుక్మవేదీవ దదృశే కామేన రమణీ హి సా || 18
రంభా స్తంభాయతం స్నిగ్ధం యదూరు యుగలం మృదు | నిజశక్తి సమం కామో వీక్షాం చ క్రే మనోహరమ్ || 19
ఆరక్త పార్‌ష్ణి పాదాగ్ర ప్రాంతభాగం పదద్వయమ్ | అను రాగమివానేన మిత్రం తస్యా మనోభవః || 20
తస్యాః కరయుగం రక్తం నఖరైః కింశుకోపమైః | వృత్తాభిరంగులీభిశ్చ సూక్ష్మా గ్రా భిర్మనోహరమ్ || 21
సన్నని నడుము గలది, సహజముగా బంగరు వన్నె గలది అగు ఆ రమణి మన్మథునకు బంగరు వేదిక వలె కన్పట్టెను (18).
అరటి బోదెల వలె పొడవైనది, స్నిగ్ధమృదు మనోహరము అగు ఆమె యొక్క ఊరు ద్వంద్వమును చూచి మన్మథుడు తన సమ్మోహనశక్తితో సమమైనదిగా భావించెను (19).
ఆమె రెండు పాదముల అగ్రములు, మధ్య భాగము, మడమలు మిక్కిలి ఎర్రగా నుండి, ఆమెకు ప్రియుడగు మన్మథుని యందు గల అనురాగము వాటి యందు ప్రకటమైనదా అన్నట్లుండెను (20).
ఆమె చేతులు ఎర్రగా నుండి, చిగుళ్లవంటి గోళ్లతో, గుండ్రని సన్నని అగ్రములు గల వ్రేళ్లతో మనోహరముగా నుండెను (21).
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణము
14 Sep 2020
No comments:
Post a Comment