కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 53



🌹.   కఠోపనిషత్‌ వివరణ - చలాచలభోధ - 53   🌹

✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ


🌻. ఆత్మ విచారణ పద్ధతి - 17 🌻

పిపీలి కాది బ్రహ్మపర్యంతమూ వున్నటువంటి సమస్త పదవులు, సమస్త శరీరములు, సమస్త వ్యవహారములు, సమస్త భోగములు సమస్త అనుచానమైనటువంటి సాంప్రదాయక విధానములన్నీ, సమస్త అధిష్ఠాన పద్ధతులన్నీ, అధిష్ఠాన ఆశ్రయ పద్ధతిగా వున్న సమస్త వ్యవహారమునంతటిని, పిపీలికాది బ్రహ్మపర్యంతమూ ఎవరైతే కాదనుకోగలుగుతారో, ఎవరైతే నిరసించగలుగుతారో,

ఎవరైతే తనకు అవసరం లేనివిగా గుర్తిస్తారో, ఎవరైతే అశాశ్వతముగా గుర్తిస్తారో, ఎవరైతే పరిణమించేవిగా గుర్తిస్తోరో, ఎవరైతే నిరంతరాయముగా చలనశీలమై ఉన్నట్లుగా వీటిని గుర్తించగలుగుతారో, ఎవరైతే అస్థిరమని గుర్తించ గలుగుతారో వాళ్ళు మాత్రమే ఆత్మనిష్ఠులు, బ్రహ్మనిష్ఠులు అయ్యేటటువంటి అవకాశం వుంది.

పరబ్రహ్మనిర్ణయాన్ని పొందే అవకాశం వుంది. వాళ్ళు మాత్రమే మోక్ష లక్ష్మిని వరించే అవకాశం వుంది. వాళ్ళు మాత్రమే ముక్తికాంతను వరించేటటువంటి అవకాశం వుంది. వాళ్ళు మాత్రమే జీవన్ముక్తులై, విదేహముక్తులయ్యేటటువంటి అవకాశం వున్నది.

ఇంకేం కోరకూడదట? ‘స్తుతింప దగిన సర్వమాన్యతను’ - అంటే అర్థం ఏమిటి? ఈ ప్రపంచంలో అందరూ కూడా నీవు కలిగివున్న వాటిని బట్టి నీకు ‘మాన్యత’ అంటే ప్రశంసిస్తూ వుంటారు.

ఆయనకేమిటండీ? వాళ్ళ పిల్లలు అమెరికాలో వున్నారు... వాళ్ళ కోడళ్ళు అమెరికాలో వున్నారు. వాళ్ళు అంతటివాళ్ళు, వీళ్ళు ఇంతటి వాళ్ళు, వీళ్ళు కోటీశ్వరులు, వాళ్ళకు అంత డబ్బువుంది, వీళ్ళకు ఇంత డబ్బు వుంది, వాళ్ళకు అంత ఇల్లు వుంది, వీళ్ళకు ఇంత ఇల్లు వుంది.

ఇట్లా భౌతికమైనటువంటి ఆశ్రయాలతో ‘మానత్య’ - కీర్తిస్తూ వుంటారు. ఆ కీర్తిని ఆశ్రయించకూడదు. నీ నిన్ను గుర్తించేవాళ్ళు, నువ్వు గుర్తించే వాళ్ళ మధ్యలో, నీవు ఎప్పుడైతే కీర్తిని ఆశ్రయిస్తావో, ఆ కీర్తి యొక్క ఫలం, పుణ్యఫలం ఖర్చైపోవడం వల్ల నీకు లభించేటటువంటిది.

తత్‌ ప్రభావం చేత మరలా, జనన మరణ చక్రంలో, పుణ్యపాప చక్రంలో, ద్వంద్వానుభూతి అనే చక్రంలో పడిపోతూ వుంటావు. కాబట్టి ఎవరైనా కీర్తించినప్పుడు అంతా ఈశ్వరానుగ్రహం అండీ నాదేం లేదు. నా ప్రయత్నం ఏమీ లేదు.

నేను నిమిత్తమాత్రుడని, నాకెట్టి అందులో ప్రాధాన్యతా లేదు, నాకెట్టి అందులో వున్నటువంటి ఆశ్రయమూ లేదు. నేనేమీ దాంట్లో కోరలేదు, నేనేమీ దానిని అనుభవింప లేదు. అనేటటువంటి నిరసించేటటువంటి కీర్తి, యశః కాములై వుండేటటువంటి విధానాన్ని నిరసించుకోవాలి ఎవరికి వారు.

ఇంకేమిటి? ‘కీర్తిని కోరవైతివి’ - ఇది చాలా ముఖ్యం. ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ కోరేది ఏమిటంటే, మానవులకున్న అతిపెద్ద దుర్భలత్వం ఏమిటంటే, కీర్తిని కోరటం.

అంటే అర్థం ఏమిటంటే, ప్రక్కవాళ్ళు తనని ప్రశంసించాలి. ఆహా! ఇవాళ మీరు ఎంతటి మంచి డ్రస్‌ వేసుకుని వచ్చారండీ! ఆహా! మీరు ఎంత అందంగా వున్నారండీ? ఆహా! మీరు ఎంత ఐశ్వర్యంతో వున్నారండీ? ఆహా! మీరు ఎంత చదువుకున్నారండీ! ఆహా! మీరు ఎంత అందంగా వున్నారండీ!

ఇట్లా అష్టమదములకు సంబంధించినటువంటి ప్రశంసని పొందుతూ వుంటారు. ఆహా! మీరు ఎంతబాగా చదువుకున్నారండీ! ఆహా! మీ కుటుంబం ఎంతబాగా ఔన్నత్యంగా వున్నదండీ! ఆహా! మీరు పదిమందిలో ఎంతో గొప్పగా వున్నారండీ! ఆహా! మీరు ఈ దేశంలోనే గొప్పగా వున్నారండీ! ఆహా! మీరు ఈ ప్రపంచంలోనే గొప్పగా వున్నారండీ! అసలు మీలాంటి వారు... ప్రపంచంలోనే లేరండీ, ఇలాంటి ‘యశఃకామత’ -

దీనిని ఏమంటారంటే, ‘యశః కామత’ - కామంలో ఇది కూడా ఒక కామం అన్నమాట! కోర్కెలలో ఇది కూడా ఒక కోరిక. నీడ వలె, చాప క్రింద నీరు వలె, ఇది మన జీవితంలో ఆక్రమిస్తూ వుంటుంది.

ప్రతి రోజూ ఎవరో ఒకరు, నిన్ను ఒక్కరన్నా కనీసం భార్యగారు భర్తగారినో, భర్తగారు భార్యగారినో లేకపోతే తల్లిదండ్రులు పిల్లలో, పిల్లల్ని తల్లిదండ్రులో ఎవరో ఒకరు ఒకర్ని కీర్తించకపోయినట్లయితే, స్తుతించకపోయినట్లయితే, ఆ రోజు సరిగ్గా నిద్రపట్టదు. దీని పేరు ‘యశః కామత’ అంటారు దీనిని.

ఈ యశఃకామత ఎవరిలో అయితే బలంగా వుంటుందో, వాళ్ళు ఎవరో ఒకరిచేత మీరు అద్భుతమండీ! అని అనిపించుకుంటేనే ఆ రోజుకి అహం శాంతిస్తుంది. దాన్నే పునః పునః పునః స్మృతిలో ఊహించుకుంటూ, పునః పునః స్తుతింపజేసుకుంటూ ఆ సంతృప్తిని పొందుతారు.

దీనిని ‘కీర్తికామత’ లేదా ‘యశః కామత’ అంటారు. అటువంటి కీర్తిని కోరలేదు నచికేతుడు. కారణం ఏమిటట? ఇవన్నీ సంసార భోగమునకు సంబంధించినవి.

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ

14 Sep 2020

No comments:

Post a Comment