పరమపద సోపానం

🌹 అంతర్యామి - *పరమపద సోపానం* 🌹

జీవితంలో ఏం కావాలనుకుంటారో అది చాలామందికి దక్కదు. దక్కకపోవడం సహజంగా బాధను కలిగిస్తుంది. దక్కినదాంట్లోనే ఆనందం వెతుక్కునేవారు మరోరకం. తృప్తి, అసంతృప్తి అనేవి మనుషుల ఆలోచనావిధానంలో ఉంటాయి. కొందరు నిరంతరం కావాల్సినదానికోసం ప్రయత్నాలు సాగిస్తూనే ఉంటారు. ఏ పద్ధతిలో అన్నది ముఖ్యం. కోరిక ఉండాలి. దాన్ని నెరవేర్చుకునేందుకు కృషి జరగాలి. ఫలితం ఎలాగున్నా ప్రయత్నంలో మాత్రం ఆనందం పొందాలి. లక్ష్యసాధనలో పండుగ జరుపుకోవాలి.

గమ్యం చేరుకున్నప్పుడు ఆనందం ఎలాగూ ఉంటుంది. ఒకవేళ చేరుకోకపోయినా ఆ ప్రయాణంలోని కుతూహలాన్ని పరిపూర్ణంగా అనుభవించగలగాలి. ఆట ఆడటం ఒక రకమైన ఆనందాన్ని ఇస్తే, గెలుపు మరోరకమైన ఉత్సాహాన్ని నింపుతుంది. లోకంలో గెలుపునే ఆనందంగా తీసుకుంటారంతా. ప్రక్రియ, ప్రయాణం, ప్రయత్నం- మూడింటిలోనూ ఆనందముంటుందని గ్రహించాలి.

వైకుంఠపాళి అందరికీ పరిచయమున్న ఆట. పాములు, నిచ్చెనలు, పాచికలు వేయడం, ముందుకు అడుగులు వేయడం... మెట్టుమెట్టుకీ ఒక అనిశ్చితి, అనుమానం, ఆతురతతో కూడిన నిరీక్షణ. ఒక మజిలీ నుంచి మరో మజిలీకి చేరేసరికి అక్కడ నోరు తెరుచుకున్న పామో, పైకి చేర్చే నిచ్చెనో దర్శనమిస్తాయి. పాము నోట్లో పడకుండా తప్పించుకున్నప్పుడు ఒక నిశ్చింత. ఏది ఎప్పుడు ఎవరికి ప్రాప్తిస్తుందో తెలియదు. ఎవరు పరమపద సోపానాన్ని చేరుకుంటారోనని పాచికలు వేసిన ప్రతిసారీ ఒక ఉత్కంఠే. ప్రయాణం సుఖవంతమో, క్లిష్టతరమో ఎవరూ ఊహించలేరు. ఆడేవారి చేతిలో ఉన్నది పాచికలు వేయడం మాత్రమే. జరిగేదంతా అదృష్టం మీదే ఆధారపడి ఉంటుందనుకోవాలి.

అదృష్టం, దురదృష్టం అన్నవి జీవనక్రీడ సాగించే మనిషి చేతుల్లో లేదనే తాత్విక భావానికి వైకుంఠపాళి దర్పణం పడుతుంది. అందుకే దాన్ని మోక్షపటం అంటారు. మనిషి నిమిత్తమాత్రుడు. మనిషి జీవితంలో ఎదురయ్యే హెచ్చుతగ్గులు, ఆటుపోట్లు జూదంగా గోచరిస్తున్నప్పుడు మనిషి చేతిలో ఏముంది అనే సంశయం తలెత్తకమానదు. మనిషిని అవి నిస్సహాయస్థితిలోకి నెట్టివేసినట్లు అనిపిస్తుంది.

అన్నీ కలిసివస్తే అదృష్టవంతుడిగా చలామణీ అయ్యే మనిషి గెలుపును కేవలం తన ప్రతిభగా ప్రకటించుకోవడం ఎంతవరకు సమంజసం?

ఆటలో పాల్గొనకపోతే సోమరితనం కలగడం ఒక్కటే కాదు. సరదా కోల్పోతారు. ఆడేవారి పక్కన కూర్చుని తిలకించడం, వారి ఆటను ఎగతాళి చేయడం సరైన పద్ధతి కాదు. తెలివైనవారు ఆటలో పాల్గొంటారు. ఫలితాలపైన దృష్టి నిలపకుండా ఆనందిస్తారు. జయాపజయాలు తమ అధీనంలో ఉండవని, సంభావ్యతను తెలుసుకుని మసలుకుంటారు.

దురదృష్ట సర్పాలు కిందకు పడేస్తుంటే, అదృష్టపు నిచ్చెనలు పైపైకి తీసికెళ్తుంటాయి. కొన్నిసార్లు సర్పం తోకభాగానికి పక్కనే అదృష్టపు నిచ్చెన అందలం ఎక్కించడానికి సిద్ధంగా ఉంటుంది. అదృష్టం చివరన దురదృష్టమూ పొంచి ఉంటుంది. మనిషికి ఎప్పుడు, ఏది ఎదురవుతుందో తెలియదు. ప్రతి ఒక్కరికీ జీవితాంతం ఆశ్చర్యాలు... సాహసాలు, చర్య... ప్రతిచర్యల సమాహారమే జీవితం. మంచిపనుల సంచితాల ఫలితం నిచ్చెనలైతే, చెడు పనుల పర్యవసానం పాములుగా భావించాలి.

జీవితం ఎలా రూపుదిద్దుకుంటుందో, ఎక్కడెక్కడ మలుపులు తిరుగుతుందో ఎవరూ చెప్పలేరు.

మనం చేసే మంచి పనులే మన అదృష్టాన్ని నిర్ణయిస్తాయని భావించేవారు కొందరైతే, మనం గతంలో చేసుకున్నదాన్ని బట్టే ఈ స్థితి అని విశ్వసించేవారు మరికొందరు. ఈ వైకుంఠపాళిలో ఎవరూ ఏదీ ఊహించలేరు, నియంత్రించలేరు. ఎదురయ్యే అనుభవాన్ని ఏ విధంగా తీసుకుంటామన్నదే ముఖ్యం. అదే జీవితసత్యం.

No comments:

Post a Comment