సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 14

Image result for blavatsky
🌹. సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 14 🌹
✍️. రచన : సద్గురు పేర్నేటి గంగాధర రావు
📚. ప్రసాద్ భరద్వాజ 

🍃.  మన పూర్వీక గురువులు 🍃

59. యోగులలో పరబ్రహ్మమే ప్రథమ యోగి. ఇతడు సర్వజ్ఞుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు యోగ నిద్రలో ఉండి యోగమాయతో ఈ సృష్టిని నిర్వహించుచున్నారు. వేద విజ్ఞానము ముందుగా అగ్ని, వాయువు, ఆదిత్యుడు, అంగీరస లనువారిలో ప్రకాశించెను.

60. సృష్టి ప్రారంభమున ఋషి వర్గ మంతయు స్వయంగా ఉద్భవించి జ్ఞానము, శ్రవణము, తపస్సు అను నిశ్చిత రూపములో ఉండియున్నారు. వీరినే బ్రహ్మవేత్తలు అనియు, ఇంద్రియములను జయించి బ్రహ్మనిష్ఠను పొందినవారనియు పిలిచిరి.

61. మునులు అనగా మనన శీలులై ఎల్లపుడు పరమాత్మయందు లీనమై, పరమాత్మనే స్వస్వరూపముగా ధ్యానించువారు. వీరు ఆత్మ సర్వవ్యాప్తము, సర్వ శ్రేష్ఠమని ఆరూఢమై యుందురు.

62. దేవలోకమున నివసించువారిని దేవర్షులనిరి. వీరు త్రికాలజ్ఞులు, మంత్ర ప్రవక్తలు, సత్యవాదులు, గొప్ప తపశ్శక్తితో సర్వలోకములలో నిరంతరము సంచరించుచూ, దేవతలను కూడా తమ అధీనములో ఉంచుకొనువారు. ఇట్టి లక్షణములు కల దేవతలు, బ్రహ్మణులు, రాజర్షులు, శూద్రులు కూడా దేవర్షులనబడుదురు. ఉదాహరణ:- నరనారాయణులు, నారదుడు, వ్యాసుడు మొదలగువారు.

63. సనకసనందనాదులు కూడా బ్రహ్మ మానస పుత్రులే. వీరు బ్రహ్మ మనస్సు నుండి పుట్టినవారు. వీరు అందరకు జ్ఞానము ప్రసాదించిన ఆచార్యులు.

64. మనువులు పదునాల్గురు. ప్రతి మన్వంతరమునకు మనువులు మారుచుందురు. వారితోపాటు సప్త ఋషులు, దేవతలు, ఇంద్రుడు, మనుపుత్రులు కూడా మారిపోదురు.

65. సప్త ఋషులు, బ్రహ్మ మానస పుత్రులు భగవత్‌ కార్యములను ఆచరించుచుందురు. వీరు మరీచి, ఆత్రి, పులహుడు, వసిష్టుడు, అంగీరసుడు, పులస్త్యుడు, క్రతువు. వీరు ధర్మరక్షకులు, లోకరక్షకులు. 

66. విశ్వామిత్రుడు జమదగ్ని, భరద్వాజుడు, గౌతముడు, కశ్యపుడు మొదలగువారు బ్రహ్మ మానస పుత్రులు కాదు. పిదప బ్రహ్మర్షి అయినవారు.

67. వసిష్టుడు సప్త ఋషులలో శ్రేష్ఠుడు. శ్రీరామచంద్రుని గురువు. వీరి ధర్మ పత్ని అరుంధతి. అష్ట సిద్ధులు కలవారు. వీరి నూర్గురు కుమారులను విశ్వామిత్రుడు వధించినను ప్రతీకారము తీర్చుకొనలేదు. తపస్సు కంటెను సత్‌సాంగత్యము గొప్పదని విశ్వామిత్రునితో వాదించి రుజువుచేసెను. శ్రీయోగ వాసిష్టి గ్రంథ�ము, శ్రీవసిష్టునికి, శ్రీరామచంద్రునికి జరిగిన సంవాదమే. ఇది వసిష్ట గీత అని పిలువబడినది.

68. సప్త ఋషులలో ఒకడైన మరీచికి అనేక మంది భార్యలు కుమారులు కలరు. కశ్యప మహర్షి ఈయన కుమారుడే. బ్రహ్మ పురాణమును మొదట బ్రహ్మదేవుడు మరీచికి వినిపించెను.

69. అత్రి మహర్షి గొప్పతపస్సంపన్నుడు. మహా పతివ్రత అయిన అనసూయ ఈయన ధర్మపత్నియే. అనసూయ కపిల మహర్షి యొక్క చెల్లెలు. వీరికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ప్రత్యక్షమై, వీరి అంశతో దత్తాత్రేయులు విష్ణు అంశతో జన్మించెను. అలాగే చంద్రుడు బ్రహ్మ అంశతోనూ, దుర్వాసుడు శివుని అంశతోనూ జన్మించిరి.

70. పులస్త్యుడు సమస్త యోగ శాస్త్ర పారంగుతుడు. మహా తపస్వి. ధర్మ పరాయణుడు. వీరికి ముగ్గురు భార్యలు కలరు. పెక్కు మంది కుమారులు కలరు. విశ్వవసువు వీరికుమారులు. కుబేరుడు, రావణుడు, కుంభకర్ణుడు, విభీషణులు విశ్వవసువు కుమారులే.

71. పులహుడు మహజ్ఞాని. వీరు సనందన మహర్షి నుండి జ్ఞానమును పొందిరి. వీరికి ఇద్దరు భార్యలు ఒకరు దక్షప్రజాపతి కుమారై అయిన 'క్షమ', రెండవ వారు కర్దమ పుత్రిక అయిన 'గతి' అనువారు. వీరికి అనేక మంది పుత్రులు, పుత్రికలు కలరు.

72. క్రతువు మహాతేజస్సంపన్నుడు. ఇతనికి ఇద్దరు భార్యలు. ఒకరు కర్దమ మహార్షి పుత్రిక 'క్రియ' ఇంకొకరు దక్ష కుమార్తె 'సన్నతి' వీరి వలన వాలఖిల్యులు అను పేరు గల్గిన అరవై వేల మంది ఋషులు జన్మించారు.

73. అంగీరసుడు అసాధారణ ఋషి. అధ్యాత్మిక తేజోసంపన్నుడు ఇతనికి పెక్కుమంది భార్యలు కలరు.

74. సప్త ఋషులు బ్రహ్మ ద్వారా సృష్టించబడి సంతాన ఉత్పత్తికి తద్వారా భూలోక ప్రజా జీవనమునకు, ప్రధాన కారకులైరి.

75. సప్త ఋషుల లక్షణములు: బ్రహ్మ మానస పుత్రులు, తేజోమూర్తులు, ధర్మాచరణ ప్రవక్తలు, ప్రజాపతులు, దీర్ఘాయువులు, వేదమంత్రప్రవక్తలు, దివ్యశక్తి, సంకల్ప శక్తి గల్గి దివ్య దృష్టి కలవారు, సర్వ ధర్మమర్మజ్ఞులు యజ్ఞములు చేయుట, చేయించుటలో ప్రవీణులు, గురుకులముల ద్వారా విద్యాభివృద్ధికి తోడ్పడతారు. సంతాన ప్రాప్తికి గృహస్తాశ్రమములు స్వీకరించిరి. సంతానము, గోధన సంపన్నులు. ప్రాపంచిక భోగములందు ఆసక్తి లేని వారు. మనస్సును జయించినవారు. వాక్‌ శుద్ధి కలిగిన వారు.

76. ఇతర మహా ఋషులలో ముఖ్యులు:

1. కాక భుషుండి మహర్షి: ఇతని చే రచింపబడిన 'కాక భుజందర్‌ నాడీ'. అను గ్రంథము చాలా ప్రసిద్ధి చెందినది. ఈ గ్రంథములో అనేక ఆశ్చర్యకర విశేషములతో పాటు ఎన్నో రహస్యాలు వర్ణింపబడినవి. కేవలము కారణజన్ములు. అవతారముర్తులను గూర్చి వారి రహస్యములను ఇందు తెలుపబడినవి.

2. పరాశరమహర్షి: వీరు రచించిన ''హోరానాడి'' అను గ్రంథము అద్భుతము, ఆశ్చర్యకరమైనది. అందు యోగజ్ఞానము, సత్యజ్ఞానము, లోకజ్ఞానము, సృష్టి రహస్యములు తెలుపబడినవి. భూతభవిష్యత్‌ విషయములు వర్ణింపబడినవి.

3. కపిల మహర్షి: అణువులో బ్రహ్మశక్తిని ధర్శించిన వారిలో కణ్వ, గౌతమ మహర్షుల తర్వాత కపిల మహర్షిని పేర్కొనబడిరి. అణువు నందు గల శక్తియే బ్రహ్మము అను అణు సిద్ధాంతాన్నీ మొదట కపిల మహర్షి రూపొందించారు.

4. విశ్వా మిత్రుడు: ఇతడు పదివేల సంవత్సరములు తపస్సు చేసిన క్షత్రియుడు బ్రహ్మర్షి అయ్యెను. దశరధుని కుమారుడైన రామచంద్రుని తన యాగ రక్షణుకు తీసుకొని వెళ్ళి అతనికి అనేక అస్త్ర శస్త్రములను బోధించినవాడు.
వీరు కాక వాల్మికి, కర్దముడు, భృగువు, చ్యవనుడు, ఉద్దాలకుడు, ఉశీలుడు, వామదేవుడు, దుర్వాసుడు, భరద్వాజుడు, బుచీకుడు మొదలైన అనేక మంది వేదవేదాంగపారంగతులైరి.

77. ఈ ప్రపంచమున నివశించు ప్రజలందరు ఎవరికి సంతతి అయినారో అట్టి పూర్వీకులైన సప్తఋషులకు కూడా సనకసనందనాదులు, వసువులు, దేవర్షులు మొదలగువారు చాలా పూర్వీకులు. వీరందరినుండియె ఈ ప్రపంచములోని జనులందరు పుట్టిరి. అందుకే వారి గోత్రనామాలను మనము ఇప్పటికి వంశానుసారముగా కలిగి యున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹

Date: 22/Mar/2019

No comments:

Post a Comment