సాధనా పరిక్రమ - 1

సాధనా పరిక్రమ - 1

 హంస జయము - అతీంద్రియ అనుభవములు - అనుభూతులు :

 హంస అనగా ప్రాణము. ప్రాణము లపై సంయమము పొందుట, హంస జయసాధన. హంస జయ సిద్ధి ప్రాప్తించినచో ..... శ్వాస, ప్రశ్వాసలు లేకుండా..... ఎంత సమయం అయినా ఉండవచ్చు. శవాసన సాధన తొందరగా ప్రాప్తించుటకై హంస జయము ఆవశ్యకము.

      దీర్ఘ ప్రాణాయామం ద్వారా హంస జయము సాధ్యమగును.  కేవల కుంభకము - హంస జయము... వీటిలో అంతరం ఉన్నది. కేవల కుంభక అవస్థ ద్వారా, సాధకుడు సమాధి అవస్థలోకి పోవచ్చును. కానీ హంస జయ అవస్థ ద్వారా సాధకుడు, సమాధి అవస్థలోకి వచ్చునా?  అయినచో అక్కడ స్థిరముగా ఉండునా అన్నది చెప్పలేము. హంస జయ అవస్థ శరీర నియంత్రణకు చెందిన ఉచ్ఛ అవస్థ. ఈ అవస్థ శరీరమునకు సంబంధించినదే. కేవల కుంభకావస్థ శరీర భావమునకు అతీతమైనది.

    ప్రాణ జయ సాధన చేయగలిగిన సాధకునకు, హంస జయ సాధన  సాధ్యమగును. హంస జయము ఒక విధమైన కేవల కుంభకావస్థ, అయిననూ.....కేవల కుంభకావస్థ యందు అధిక సమయం ఉండుట వలన సమాధి అవస్థ ప్రాప్తించును. దేహ భావ రహితావస్థ... కేవల అవస్థయే. ఇది ఆత్మ సాక్షాత్కారము నిచ్చెడి అవస్థ.

      హంస జయము హఠయోగము నందలి ఒక ఉచ్ఛ అవస్థ. ప్రాణాయామ అభ్యాసం లేకుండా హంస జయము ప్రాప్తించదు. కానీ కేవలం కుంభకా వస్థ, ప్రత్యేకమైన సాధన లేకుండగానే తీవ్రమైన విచారణ ద్వారా కూడా ప్రాప్తించును. హంస జయ అవస్థలో కేవలము శ్వాస ప్రశ్వాసలు స్తంభించును.

      కానీ కేవల అవస్థలో..... శ్వాస ప్రశ్వాసలు, రక్త సంచారము, కోసికల ఉత్పత్తి ..... ఇత్యాది శరీర క్రియలన్నీ ఆగిపోవును. హంస జయ అవస్థలో మనస్సు, బుద్ధి క్రియాత్మకంగా ఉండును. కానీ కేవల అవస్థలో మనోబుద్ధులు శాంత మగును.

      ఈ అవస్థ శరీరమునకు అతీతమైన ఉచ్చ జ్ఞానావస్థ.

 శవాసన సాధనలో .....హంస జయము ఆవశ్యకము. అయితే శవాసన సాధన కేవల కుంభకావస్థ కంటే నిమ్నమైనది. కేవల కుంభక అవస్థ ద్వారా .....సాధకునకు గహనమైన ధ్యానము ద్వారా..... "సమాధి" అవస్థ ప్రాప్తించును.

     కేవల కుంభకం అవస్థ అనేది ఒక అవస్థయే గాని శూన్యావస్థ కాదు.నిర్వికల్ప అవస్థ కంటే అతీతమైనది "శూన్యావస్థ". ఇది ఒక అవస్థా రహిత అవస్థ.

No comments:

Post a Comment