సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 52

 


🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 52 🌹 
52 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 ప్రాణాయామము - 2 🍃 

391. అభ్యాస యోగములో శ్వాసను ఓంకారముతో పీల్చి బయటకు పోకుండా ఆపి, ప్రాపంచిక విషయములపై మనస్సు పోకుండా నశింపజేయుటయే అభ్యాస యోగమని పేరు. దీని ద్వారా ఇంద్రియములను అరికట్టుట, మనస్సును హృదయమునందు స్థిరపర్చుట, ప్రాణవాయువును బ్రహ్మరంధ్రమున నిలుపుట, ఓం కారము ఉచ్ఛరించి శ్వాసను లయింపజేయుట జరుగును. 

392. ప్రాణాయామమునకు మనస్సుకు చాలా సన్నిహిత సంబంధమున్నది. ఇది మనస్సు యొక్క చంచలత్వమును నశింపజేయును. మనస్సు బహిర్ముఖము కాకుండును. మనస్సు ప్రాణములు పరస్పరము నిరోధించబడును. కావున సాధకుడు యోగాభ్యాసము నందు కొంత సమయము ప్రాణాయామ సాధనలో కేటాయించిన మనస్సు నిశ్చలమగును. 

393. సాధకులు ప్రాణాయామము చేయునపుడు 'ఓం' అను మంత్రముతో పీల్చి 'ఓం' అను మంత్రముతో వదలవలెను. అలానే 'సోహం' మంత్రమును కూడా ప్రాణాయామముతో జతపర్చాలి. శ్వాసను పీల్చినపుడు 'సో' అనియూ వదలినపుడు 'హం' అనియూ ఉచ్చరించుచుండవలెను. పీల్చుచున్నప్పుడు బ్రహ్మ భావమును పెంచుకొనుచు, వదలుచున్నప్పుడు జీవ భావము తగ్గించుకొనవలెను. చివరకు నేనే బ్రహ్మమును అని దీని భావము. 'అజప' గాయత్రిలో 'సోహం', 'హంసో' అని జపించిన, నీవే నేను, నేనే నీవు అని సాధన చేసినట్లగును. ఈ విధముగా సోహం మంత్రమును సర్వకాల సర్వావస్థలందును జపము చేయు వారికి మరుజన్మ ఉండదు. 

394. ప్రాణాయామ సాధనా విధానము: మొదట కుడిముక్కును కుడిచేతి బొటన వ్రేలితో నొక్కిపెట్టి, ఎడమ ముక్కుతో గాలిని పూర్తిగా పీల్చి నింపవలెను. ఆసమయములో బ్రహ్మ తత్త్వములో ఉండి జగత్తు తనలో లీనం అవుతున్నట్లు భావించాలి. అలా ఉంచగలిగినంత సేపు ఉంచాలి. తరువాత ఎడమ నాశికను మూసి, నిలిపి ఉంచిన గాలిని కుడి నాశిక గుండా బయటకు వదలాలి. అట్టి శూన్యక కుంభకములో ఉండగలిగినంత సేపు ఉండి, తరువాత కుడి నాశికను ద్వారా గాలిని పీల్చి, నిల్పి ఉంచి ఎడమ నాశిక ద్వారా గాలిని బయటకు వదలాలి. ఇపుడు ఒక రౌండు పూర్తి అయినట్లు. రెండవ రౌండు మొదట తెల్పినట్లు ఎడమ ముక్కుతో పీల్చి బిగబెట్టి కుడిముక్కుతో వదలాలి. మరల కుడి ముక్కుతో పీల్చి బిగించి ఎడమ ముక్కుతో వదలాలి ఇలా చేయగల్గినన్ని రౌండ్లు కనీసము 5 సార్లు ఒక వారము చేసిన తరువాత, ఒక్కొక్క రౌండు పెంచుకుంటు 10 రౌండ్ల వరకు చేయవచ్చు. సాధారణముగా 10 రౌండ్లు సరిపోతాయి. ఇలా 10 రౌండ్లు పూర్తి చేయుటకు 5 నుండి 10 నిమిషములు పట్టవచ్చు.

395. ప్రాణాయామములో ఇంకొక విధానము: పైన తెల్పినట్లు ఏ విధమైన పూరక శూన్యక కుంభకములు లేకుండా ఆపకుండా చేస్తూ పోవాలి. ఇలా చేయుటకు మొదట పదిరౌండ్లతో మొదలపెట్టి 20, 30, 50 పెంచుకుంటూ 108 రౌండ్ల వరకు చేయవచ్చు. అందుకు షుమారు 5 నిమిషములు చాలు. 

396. ప్రాణాయామములో మూడవ విధానము: కుడి ముక్కు నొక్కి పెట్టి ఎడమ ముక్కుతో శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అదే ముక్కుతో 10, 20, 30, 108 రౌండ్లవరకు క్రమముగా పెంచుకుంటూ చేయాలి. దీనికి చంద్రభేది ప్రాణాయామమని పేరు. 

397. ప్రాణాయామములో నాలుగవ విధానము: ఎడమ ముక్కు నొక్కి పెట్టి కుడి ముక్కుతో శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అదే ముక్కుతో 10, 20, 30, 108 రౌండ్ల వరకు క్రమంగా పెంచుకుంటూ చేయాలి. దీనికి సూర్యభేది ప్రాణాయామమని అంటారు. 

398. ప్రాణాయామములో ఐదవ విధానము: ఈ పద్ధతిలో రెండు ముక్కుల ద్వారా శ్వాసను వదులుతూ పీల్చుకుంటూ అలానే 10, 20, 30, 108 రౌండ్ల వరకు పెంచుకుంటూ పోవాలి. దీనికి భస్త్రికా ప్రాణాయామమని పేరు. 

399. ప్రాణాయామములో ఆరవ విధానము: ఈ పద్ధతిలో రెండు ముక్కుల ద్వారా శ్వాసను గట్టిగా వదులుతూ ఉండాలి. ప్రత్యేకంగా పీల్చుకోవలసిన పనిలేదు. దీనికి కపాలభాతి అని పేరు. ఈ పద్ధతిలో శ్వాసను ప్రత్యేకముగా పీల్చకపోయినప్పటికి ఒక సారి వదలి మరల రెండవ సారి వదలినపుడు మధ్యలో కొంత సమయము మనకు తెలియకుండానే కొంచము శ్వాసను తీసుకొనుట జరుగుతుంది. ఈ ప్రాణాయామము వలన లోపల ఉన్న చెడు అంతా వేగముగా ఊడ్చిపెట్టినట్లు బయటకు నెట్టివేయబడుతుంది. కొత్త శక్తిని నింపుకొనుటకు వీలవుతుంది. తలలో ఉన్న అడ్డంకులు (బ్లాక్సు) తొలగిపోతాయి. 

400. ప్రాణాయామములో ఏడవ విధానము (శ్రీతలి):- ఈ పద్ధతిలో నాలుకను ముందుకు చాపి మడత పెట్టి నోటి ద్వారా గాలిని పూర్తిగా పీల్చుకొని నోరు మూసి ముక్కుతో గాలిని వదలాలి. అలా నాలుక ద్వారా పీల్చుకుంటూ ముక్కు ద్వారా వదులుతున్నప్పుడు శరీరములోని వేడిగాలి. బయటకు వెళ్ళి సమత్వ స్థితి ఏర్పడుతుంది. ఇది కూడా 10, 20, 30, 108 సార్లు చేయవచ్చు.
🌹 🌹 🌹 🌹 🌹


29 Apr 2019

No comments:

Post a Comment