🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 41 🌹
41 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 మక్ష మార్గము - 1 🍃
296. మోక్ష మనునది ఒక ప్రదేశముకాదు. అది ఒక అనుభూతి. సహజ స్థితి. దీనికి ముక్తి, కైవల్యము, సంపూర్ణ స్వాతంత్య్రము, లయము, ఐక్యము, బంధ విముక్తి, అమృతత్వము, బ్రహ్మత్వము అను పర్యాయ పదములు కలవు. ఇదియె బ్రహ్మానంద ప్రాప్తి. ఇంకను నిర్మాణము, అపవర్గము, పరమ పదము అని కూడా అందరు.
297. బంధ రహితము పొందినపుడే మోక్షము. బంధ విముక్తి పొందాలంటే మోక్ష సాధన మార్గాలను అనుసరించాలి. పునఃజన్మ రహితమైనదే మోక్షము. ఇది స్వయం ప్రకాశము. జనన, మరణ, విషచక్రము నుండి విముక్తియె మోక్షము. మోక్ష స్థితిని అనుభూతి పొందినవారు కూడా దానిని వర్ణించలేరు.
298. సచ్చిదానందమనగా సత్, చిత్, ఆనంద రూపము. ఏకరూపమైనది సత్. బాహ్య వస్తువులను ఏది గ్రహించునో అది చిత్. ఏ ఉపాధి లేని సుఖము ఏదో అదే ఆనందము.
299. కైవల్యమనగా బ్రహ్మ జ్ఞానము వలన పొందిన ఏకైక సిద్ధి. అఖండ ఆనందమైన మోక్షమే కైవల్యము. ఆత్మ స్వాతంత్య్రమే కైవల్యము. సాధకుని చరమ లక్ష్యము కైవల్యము. దానినే అమృతత్వము అని కూడా అంటారు.
300. మోక్ష గృహము బయట ఎచటోలేదు. అది మనలోనే ఉన్నది. అది ఉన్నదని తెలియకపోవుటయే అజ్ఞానము. అది తెలుసుకొనుటే జ్ఞానము. అదియే ఆత్మ. ఆత్మ స్థితియె మోక్షము కావున నీ హృదయమందే మోక్ష సామ్రాజ్యము కలదు. దేహమే దేవాలయము. జీవుడే దేవుడు. ''అహం బ్రహ్మాస్మి'' అట్టి బ్రహ్మ స్థితిని అనుభూతి పొందుటయే మోక్షము. మోక్షము ఇంద్రియాతీతమైనది. దేహాతీతమైనది. దేవాలయములలో, పుణ్యతీర్ధములలో, నదీతీరములలో మోక్ష గృహము లేదు. ఎక్కడ ఎప్పుడు భ్రాంతి రహితమో - అప్పుడే అక్కడే ముక్తి లేక మోక్షము.
301. మోక్షము మరణించిన తరువాత పొందేది కాదు. జీవించి ఉండగనే పొందే స్థితి. జీవన్ముక్తిని పొందుటే మోక్షము. ఇది పరలోక ప్రాప్తి కాదు. జ్ఞాన వైరాగ్య సంపన్నులకు తన అంతరాత్మ యందే మోక్షము కలుగును. ఆత్మ విచారణే మోక్షమునకు మార్గము. నిర్మల చిత్తమే మోక్షము. మోక్షమునకు అంతఃస్ఫూర్తి, జ్ఞానము అవసరము. హృదయమునందు ధ్యానము చేయుట వలన మోక్ష రూపమైన తన స్వరూపము తెలుసుకొనబడును. శరీరమందుగల మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారములు నశించిన తక్షణమే ఆత్మ దర్శనం అగును. అంతఃజ్యోతి దర్శనమే ఆత్మ దర్శనము.
302. మోక్షము పొందునది జీవాత్మ. ఇది మాయతో కప్పబడి ఉన్నది. జీవాత్మ పరమాత్మ యొక్క అంశయే. జ్ఞానులు మాత్రమే ఈ రహస్యమును తెలుసుకొని మోక్షమును పొందుచున్నారు. అంతర్ముఖియై గమనించిన తేజోవంతమైన దివ్య జ్యోతి దర్శనమై బ్రహ్మానంద స్థితి ఏర్పడును.
303. దివ్య భోగములు అనుభవించు పరలోకమే స్వర్గము. ఇది ఇంద్రుని లోకము. ఇది భోగవస్తు నిలయము. ఇచట శారీరక, మానసిక శక్తులు, ఆయుర్ధాయము భూలోక మానవుల కంటే ఉన్నతముగా ఉండును.
304. స్వర్గలోక ప్రాప్తి కలగాలంటే యోగి యజ్ఞయాగాధి కర్మలు, వేదాధ్యయనము, పుణ్య కార్యములు చేయవలెను. స్వర్గ ప్రాప్తి పొంది అందు తగిన పుణ్య ఫలమును అనుభవించిన తక్షణమే ఆ స్వర్గము నుండి వేరేలోకమునకు నెట్టివేయబడును. భూలోకమున జన్మించి మిగిలిన పాపకర్మలు ఏవైన ఉన్నచో వాటిని తొలగించుకొనవచ్చును. అనగా పుణ్య కార్యముల వలన పుణ్య లోకములు, పాప కార్యముల వలన భూలోకము నందు జన్మించవల్సిందే. ఈ విధముగా జీవుడు భూలోకమునుండి స్వర్గము, అచ్చట నుండి భూలోకము జన్మలు తీసుకుంటూ చివరకు ఆత్మ జ్ఞానము పొందినపుడే జన్మ పరంపరలకు ముక్తి లభించును. మోక్షము పొందాలంటే భూలోకములోనే సాధన చేయవల్సి ఉంటుంది.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment