సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 42

 

🌹  సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 42 🌹 
42 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 2 🍃 

305. పుణ్య కార్యములను కామ్యకర్మలంటారు. సత్రములు, కోనేరులు, దేవాలయములు, చలివేంద్రములు, అన్నదానములు, వస్త్రాదానము మొదలగువాని వలన స్వర్గము లభించునే కానీ మోక్షము లభించదు. కానీ ఆ కార్యములను నిష్కామముగా చేసిన అపుడు ముక్తికి మార్గము లభించును. 

306. మోక్షము, మరణించిన తరువాత పరలోకములో పొందునది కాదు. అది అనుభవించేది కాదు. ఈ జన్మయందే, భౌతిక స్థితిలోనే, జీవించి ఉండగానే పొందవల్సిందే. అందుకు భౌతిక శరీరం కావాలి. ఇది వార్ధక్యములో చేయవల్సింది కాదు. బాల్యము, యవ్వనములందే మోక్ష సాధన ప్రారంభించి కొనసాగించవలెను. వృద్ధుడైన తరువాత శరీరము క్షీణించిన తరువాత చేయు సాధన వలన ఫలితము ఉండదు. అందుకే శరీరము ఆరోగ్యముగా శక్తివంతమై ఉన్నప్పుడు చేయవలయును. కావున ఎవరు ఈ జన్మ యందే తమ శరీరమును విడువక ముందే, కామ క్రోధాది అరిషడ్వర్గములను జయించగలరో వారే సాధకులు, యోగులు, మోక్షార్హులు. 

307. మోక్షాభిలాష కలవానిని ముముక్షువు అందురు. అందుకు తగిన సాధన చేయాలి. 
ముముక్షువు లక్షణము:- ఏ వికారము లేకుండుట. క్రియారహితులు లేక నిష్కామకర్మ చేయువారు, ఆత్మావగాహన కలవారు, గురువు ద్వారా జ్ఞానము పొందుట, సాక్షి స్థితిలో ఉండుట, తలంపులు తలెత్తకుండునట్లు జీవించుట. 

308. జీవన్ముక్తుడు కానివాడు మోక్ష గృహము చేరలేడు. ఒక వ్యక్తి జీవించి ఉండగనే ముక్తిని పొందుటయే జీవన్ముక్తి. జీవన్ముక్తి రహస్యములను తెలుసుకొని దాని ప్రకారము సాధన చేయాలి. యోగి నిస్సంగిగా జీవ యాత్ర సాగిస్తాడు. మానవులలో శ్రేష్ఠుడు జీవన్ముక్తుడు. బ్రహ్మసాక్షాత్కారము పొందిన వాడు. 

309. జీవన్ముక్తుని లక్షణములు:- విగ్రహారాధన చేయనివాడు, పూజలను వదిలినవాడు, సకల మలిన వాసనలు వదిలినవాడు, అహంకార రహితుడు, బ్రహ్మజ్ఞాని, త్యాగశీలి, పరమాత్మ ధ్యానములో ఉన్నవాడు, ఇష్టాఇష్టములు లేకుండుట, విషయాల సుఖదుఃఖాలు శరీరానికేగాని తనకు కాదని తలచుట, తామరాకుపై నీటి బొట్టువలె జీవించుట, జ్ఞానామృతమును పానం చేయుట. 

310. బంధములే మోక్షమునకు ఆటంకములు. మోక్షమనగా విడుదల అని అర్థము. బంధముల నుండి విడుదల కావలెను. అదియె మోక్షము. సర్వ స్వాతంత్రమే విముక్తి. 

311. బాహ్య బంధములు, అంతర బంధములు అని బంధములు రెండు రకములు. 1) బాహ్యబంధము: ఇది శరీరమునకు సంబంధించినది. ధనము, భార్య, బిడ్డలు, వస్తువులు, వాహనాలు, వ్యవహారములు, శబ్దములు, ప్రపంచ విషయములు. 2) అంతరబంధములు: కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము, అహంకారము దంభము, దర్పము ఈర్ష్య, అసూయలు రాగము, ద్వేషము మొదలగునవి. 3) స్వభావ బంధములు: సత్వ రజస్‌ తమో గుణములు. 

312. రోదసీలో ఉత్తరాయణ, దక్షిణాయములే మార్గములు. ఉత్తరాయణము మానవ జన్మ రాహిత్యమునకు, దక్షిణాయణము పునఃజన్మలకు మార్గములు. వీటిని అర్చరాది, ధూమ్రాది మార్గములంటారు. 

313. ఉత్తరాయణములో యోగులు, పుణ్యాత్ములు, బ్రహ్మవేత్తలు, మానవ జన్మరాహిత్యమునకు ఈ మార్గమును అనుసరించాలి. శుక్లపక్షము, ఉత్తరాయణము, ఉత్తమగతులకు సరైనది. అంతరిక్షమునందు శుక్లపక్షము పగలు కృష్ణపక్షము రాత్రిగా ఉండును. ఉత్తరాయణ కాలము దేవతల అధీనంలో ఉంది. 

314. భూలోకమున ఒక రాత్రి ఒక పగలు, అంతరిక్షములో 30 రోజులకు సమానము. ఉత్తరాయణము 6 నెలలు పగలు, 6 నెలలు రాత్రి ఉండును. ఉత్తరాయణములో పుణ్యాత్ములు అంతరిక్షమునుండి దేవతల ద్వారా పుణ్యలోకములైన సూర్య చంద్ర లోకములకు చేర్చబడుదురు. అచట నుండి యోగ్యులైన వారిని భగవంతుని యొక్క పరంధామానికి పారిషదులు వచ్చి తీసుకెళ్ళిన తరువాత అపుడు బ్రహ్యైక్యము సిద్ధించును. కావున యోగి అగ్ని, ఆకాశము, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణముల ద్వారా బ్రహ్మమును చేరును.
🌹 🌹 🌹 🌹 🌹


19.Apr.2019

No comments:

Post a Comment