49 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 2 🍃
364. ఈ శరీరము 25 తత్త్వములతో విరాజిల్లుచున్నది. అందు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియాలు, 5 ప్రాణములు, 5 విషయములు, 4 అంతఃకరణ చతుష్టయము, 25వది జీవాత్మ.
1. జ్ఞానేంద్రియములు: కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మము.
2. కర్మేంద్రియములు: కాళ్ళు, చేతులు, నోరు, గుదము, జననేంద్రియము.
3. పంచప్రాణములు: ప్రాణ,అపాన,ఉదాన,సమాన, వ్యాన వాయువులు.
4. విషయ పంచకము: భూమికి వాసన, నీటికి రుచి, అగ్నికి రూపము, వాయువుకు స్పర్శ, ఆకాశమునకు వినికిడి. ఇవి జీవుని యందు గల విషయాసక్తి.
5. అంతఃకరణ చతుష్టయము: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. 25వది జీవాత్మ. 26వది పరమాత్మ.
365. పంచ ప్రాణములు కాక ఉపప్రాణములు 5 కలవు. 1) నాగవాయువు: ఇది మాటలను పలికించును. వాంతి, త్రేన్పులను తెప్పించును. 2) కూర్మవాయువు: కనురెప్పలు తెరచుట, మూయుట చేయును. 3) క్రుకురము: తుమ్ములు వచ్చునట్లు చేయును, ఆకలి దప్పికలు కలుగజేయును. 4) దేవదత్తము: ఆవులింతలు కలుగుజేయును. 5) ధనుంజయవాయువు: శిశువును గర్భము నుండి బయటకి నెట్టి వేయును. శవంలో ఉబ్బించి తరువాత పోవును.
366. ఈ శరీరము యొక్క గుణములు: 1) కామము 2) క్రోధము 3) లోభము 4) మోహము 5) మదము 6) మాత్సర్యము 7) దంబము 8) దర్పము 9) ఈర్ష్య 10) అసూయ మొదలగునవి.
367. శరీర రకములు: 1) స్థూల శరీరము 25 తత్వములతో కూడి కర్మలు చేస్తూనే యోగ మార్గాలను అనుసరిస్తూ ముక్తిని పొందుటకు అవసరమై ఉన్నది. అందుకే ''శరీర మాధ్యమం ఖలు ధర్మ సాధనం'' అన్నారు. కంటికి కనిపించని షడ్చక్రాలు, కుండలిని, ఇడా పింగళ, సుషుమ్ననాడులు, ఈ శరీరములోనే ఉన్నవి. ఇవే యోగ మార్గములు.
368. అజ్ఞాన స్వరూపమైన కారణ శరీరము నుండే ఈ స్థూల శరీరము ఏర్పడినది. ఈ శరీరము 7 జానల పొడవు, 4 జానల వలయము, 70 ఎముకలు, 40 ఫలముల రక్తము, 23 కోట్ల రోమములు, 192 సంధులు, 8 ఫలముల గుండె, 360 ఫలముల మాంసము, 1 సోలెడు పైత్యము, 1 సోలెడు శుక్లములతో ఏర్పడినది.
369. సూక్ష్మ శరీరము ఇది 17 తత్వములతో ఏర్పడినది. జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, ప్రాణములు 5, మనస్సు, బుద్ధి. దీనికి మనోమయ శరీరమని పేరు. ఇది శ్వేత వర్ణము కలిగి ఉండును.
370. వ్యక్తి నిద్రించుచున్నప్పుడు, ఇంద్రియములు పని చేయుటలేదు. ఆ సమయములో సూక్ష్మ శరీరమే ఆ పనిని నిర్వహించుచున్నది. ఇట్టి సూక్ష్మ శరీరము అగ్నితో కాలదు, కత్తితో నరకబడదు, నీటిలో తడవదు, గాలికి కదలదు, ప్రళయకాలమందును నశించదు. ఈ సూక్ష్మ శరీరమునకు ఒక కారణ శరీరము కూడా కలదు. కారణ శరీరము నశించిన సూక్ష్మ శరీరము కూడా నశించును. తక్షణం జీవాత్మ పరమాత్మ యందు లయించును.
371. మోక్షము కోరువాడు మొదట సూక్ష్మ శరీరమునకు మూల కారణమైన కారణ శరీరమును జయించవలెను. దానిని జయించాలంటే బ్రహ్మ సాక్షాత్కారము చేత భ్రాంతిని నశింపజేయాలి. కారణ శరీరమే అజ్ఞానము. స్థూల సూక్ష్మ శరీరముల రెంటికి జన్మకారణమైన అవిద్యయె కారణ దేహము. అహంకారము నశించిన కారణ శరీరము నశించి ముక్తి కలుగును.
372. అహంకారము వలన అవివేకము కలుగును. అవివేకము వలన అభిమానం కలుగును. అభిమానం నుండి కామక్రోధములు, కామక్రోధముల వలన కర్మలు చేయుట, కర్మల నుండి పునఃజన్మలు కలుగును.
373. మహాకారణ శరీరము కారణ శరీరమునకు మూల కారణము. జీవుడు ప్రత్యగాత్మ అన్న పేరుతో సహస్రారమున నిల్చి, తురీయావస్థను పొంది, ప్రపంచ విషయములనెరుగక తన నిజానందములో ఉండును. అందుకే యోగ సాధన. మహాకారణ శరీరము ఒక ఆధ్యాత్మికత. ఇదే ముక్తికి మార్గము.
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #BookofDzyan #Theosophy
26.Apr.2019
No comments:
Post a Comment