సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 36

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 36 🌹 
36 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 శరీరావస్థలు 1 🍃 

254. యోగులు సాధనలో చేరవల్సిన చివరి స్థితి ''తురీయ'' స్థితి. అది సాధించుటకు ముందు క్రమముగా 1) జాగ్రదావస్థ 2) స్వప్నావస్థ 3) సుషుప్తావస్థ నాల్గవది తురీయావస్థ. తురీయావస్థకు చేరిన తర్వాత అతని స్థితి 'సమాధి' స్థితి. ఇది అపుడు సహజముగా ఏర్పడి యుండును. 

255. జాగ్రదావస్థలో; దర్శనము, స్పర్శ, కర్తృత్వముతో సకల వ్యవహారములు చేయుచుండును. ఇందులో నేత్రములు ప్రధానమైనవి. ఈ స్థితిలో మనస్సు అనేక విషయములందు ఆసక్తి, అభిమానము, ప్రీతి, కలిగి విహరించును. ఇంద్రియముల ద్వారా బాహ్యసంస్కారములను అనుభవించుట జాగ్రత్‌ స్థితి. ఈ స్థితిలో, అంతిమ సమాధి స్థితికి కావల్సిన సమస్త విషయములు గ్రహించి ఎల్లప్పుడు ఎరుకలో వుండును. పంచ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణ చతుష్టయముల ద్వారా ఎరిగుచున్న ఎరుకయె జాగ్రత్‌స్థితి.

256. స్వప్నావస్థ: ఈ అవస్థలో సాధకుడు మనోరూపుడు, భావరూపుడై ఉండును. అతనిని ''తైజసుడు'' అని అందురు. ఈ స్థితిలో జాగ్రత్‌ వస్తు సముదాయమంతా మనోభావరూపములో దర్శించును. తెలిసీ తెలియని స్థితి, జ్ఞాపకము ఉండి లేని స్థితి ఉండును. శ్వాస ప్రాణవాయువుతో కలిసినప్పుడు స్వప్నజాగ్రత్‌ స్థితి ఏర్పడును. 

257. సుషుప్తావస్థ: చిత్తము దృశ్యరహితమైనపుడు, క్షీణ చిత్తము కలవారికి జాగ్రత్తునందే సుషిప్తి అగును. వాస్తవముగా విషయములు జ్ఞాపకము లేకుండా మరపు స్థితిలో వుండును. జడ స్థితిలో ఉండును. సుషుప్తిలో ఇది ఏమీ తెలియని స్థితి. జగత్‌ వస్తు వృత్తుల యొక్క నివృత్తి, తురీయదృశ్యమే జాగ్రత్తలో సుషుప్తి స్థితి. సుషుప్తిలో జాగ్రత్‌ స్థితిని పొందినవాడు జీవన్‌ముక్తుడు. సాధకుడు జాగ్రత్‌లో కూడా సుషుప్తిలో ఉండును. స్వప్నములేని నిద్రావస్థ సుషిప్తి ఈ స్థితిలో సర్వవృత్తులు అణగి ఉండును. 

258. తురీయావస్థ: అవస్థలన్నింటిలో తురీయావస్థ ఉన్నతమైనది. సమాధి స్థితి పొందిన సాధకుడు ఆనందమయ జ్యోతి స్వరూపుడగుచున్నాడు. అదియె తురీయము. అభ్యాస యోగము స్థిరపడినచో ఏర్పడిన నిస్సంకల్ప స్థితియె తురీయము. మేల్కొని ఉన్నను, సుషిప్తిలో ఉన్నను తురీయ స్థితిని అనుభవించవలెను. ఆ స్థితిని పొందుటకు అహంకారం విడువ వలెను. సమత్వము పొంది దృఢ చిత్తము కల్గి ఉండవలెను. తురీయ స్థితి నిలకడ పొందినపుడు ఒకప్పుడు జాగ్రత్తు స్వప్నం వలె కనబడును. అందులో భిన్నత్వములోనూ అద్వైత భావనలు నిలకడ పొందవలెను. జాగ్రత్తు సుషుప్తివలె ఉన్నవాడు విదేహ ముక్తుడు.

259. తురీయ స్థితి సదా స్వీయ జ్ఞానము చింతించుట వలన ఏర్పడును. బ్రహ్మనిష్ఠయందు చలించకుండుట, స్వప్నంలోనే స్వప్న విషయము స్వీయ జ్ఞాపకము ఉండుట, గాఢ నిద్రలో నిద్రించుటను తెలియుటయే గాక తురీయ స్థితిలో ఆత్మ జ్ఞానము కలిగి ఉండవలెను. అదియె తురీయ స్థితి. ఈ స్థితిలో ద్వంద్వ రహితుడై సదా బ్రహ్మమునే ధ్యానించుచూ తరువాత విదేహ ముక్తి పొంది పరమాత్మలో లీనమగును.
🌹 🌹 🌹 🌹 🌹


13.Apr.2019

No comments:

Post a Comment