సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 43

 

🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్‌ డాక్ట్రిన్‌) - 43 🌹 
43 వ భాగము

✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ

🍃 మక్ష మార్గము - 3 🍃 

315. దక్షిణాయణము, కృష్ణపక్షములో శరీరము వదిలిన వారు సకామకర్మ యోగ సంబంధమైన ప్రకాశమును పొంది తిరిగి జన్మింతురు. ఆత్మ జ్ఞానములేని, ఫలాపేక్ష కలిగిన వాడు తిరిగి జన్మించును. దక్షిణాయణము అధో మార్గము. 

316. మోక్ష లోక ప్రవేశము దేవతలకు కూడా అసాధ్యము. సాధన కొద్ది బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి లభించును. చిత్తమును, ఇంద్రియములను నిగ్రహించిన వారికి మాత్రమే మోక్షము సాధ్యము. గురువు కేవలము సాంప్రదాయ బద్ధమైన బోధనయే కానీ సాధన మాత్రము సాధకుడే కొనసాగించవలెను. దీనితో పాటు దైవానుగ్రహము కావాలి. స్వయం కృష్ణి, సాధన, విశ్వాసము, శ్రద్ధ, ఆసక్తి, పురుష ప్రయత్నము ద్వారా ఎవరికి వారె ప్రయత్నించవలెను. కాని చరమ సాధనలో గురు కృప అనెడి సహాయము లభించును. 

317. సాధనలో శ్రేష్ఠమైనది:- అజ్ఞానుల కంటే విగ్రహారాధకులు శ్రేష్ఠులు, విగ్రహారాధకుల కంటే నిర్మల బుద్ధితో బ్రహ్మమును ఆరాధించువారు, వారి కంటే అంతరాత్మలో భగవంతుని తెలుసుకొన్నవారు, వారి కంటే సదా పరమాత్మలో మైమరచి ధ్యానించువారు, వారి కంటే తనను తాను మరచి బ్రహ్మానందములో తేలియాడువారు శ్రేష్ఠులు. 

318. సృష్టి నిర్మాణ కాలమందు పరబ్రహ్మము నుండి జీవులుగా కోట్లాదికోట్ల జన్మలు పొంది ఏదో ఒక జన్మలో సాధన ద్వారా ముక్తిని పొందిన వారు చివరకు ఏదో ఒక జన్మలో మోక్షమును పొందుదురు. సాధనను బట్టి ముందు వెనుక ఉండును. 

319. మోక్షమునకు సాధన సంపత్తి: జ్ఞానము, యోగము, ఇంద్రియ నిగ్రహము, రాగద్వేషములు లేకుండుట, ద్వంద్వాతీతుడై సమత్వ స్థితిలో ఉండాలి. అహంకార రాహిత్యము, చిత్త శుద్ధి, మనోనాశము, వాసనాక్షయము, గృహస్థాశ్రమము, ప్రాపంచిక విషయములు త్యజించుట మొదలగునవి కావలెను. 

320. అనేక పేర్లతో నెలకొల్పబడుతున్న ఆధ్యాత్మిక సంస్థలు, ఆశ్రమాలు, కేంద్రాలు, అభ్యాసమునకేగాని మోక్షమునకు ఉపయోగపడవు. చివరికి ప్రతి వ్యక్తి ఎవరికి వారు ఏకాకియై సాధన చేయాలేకాని జన సమూహములతో కూడి చేయునది మోక్ష సాధన కాదు. కుల, మత, జాతి, భేదములు లేని వారై ఉండాలి. అన్ని రకాల బంధముల నుండి విడివడాలి. వేషధారణ, వివిధాలంకారములు సాధనకు అడ్డంకులు. 

321. నీటి మీద నడుచుట, గాలిలో తేలుట, ఉంగరాలు, హారాలు సృష్టించుట మొదలగునవి మోక్షమునకు తోడ్పడవు. నిజమైన యోగులు జనబాహుళ్యానికి, ప్రజాకర్షణకు దూరంగా ఉంటారు. వారికి సిద్ధులు లభించినప్పటికి వాటిని వినియోగించరు, ప్రదర్శించరు. 

322. మానవునకు స్వయముగా విశిష్ఠ జ్ఞానము కలదు. సృష్టిలోని 84 లక్షల జీవ రాశులలో మానవ జన్మ శ్రేష్ఠమైనది. దానిని ఆత్మాజ్ఞానోపార్జనకు ఉపయోగించి ముక్తిని పొందాలి.

323. మోక్షమునకు ఉపయోగపడనివి: జపతపాలు, పూజలు, ఉపాసనలు, తీర్థయాత్రలు, జంతుబలులు, కీర్తి ప్రతిష్ఠలు, యాగములు మొదలగు భౌతిక సాధనలు వలన ముక్తి లభించదు. 

324. కేవలం ఆత్మానుసంధానము, యోగ సాధన వలననె, బ్రహ్మత్వం, అమరత్వం, భగవదనుగ్రహము వలననె ముక్తి లభిస్తుంది అని నిర్ద్వంద్వముగా తెలియుచున్నది.
🌹 🌹 🌹 🌹 🌹

No comments:

Post a Comment