🌹 సర్వయోగ సమన్వయము - గుప్తవిద్య (సీక్రెట్ డాక్ట్రిన్) - 48 🌹
48 వ భాగము
✍️ రచన : పేర్నేటి గంగాధరరావు
📚. ప్రసాద్ భరద్వాజ
🍃 యగం చేయాలంటే శరీరం తప్పనిసరి - 1 🍃
356. శరీర శోధనయె యోగము. అందుకే దానిని గూర్చి పూర్తిగా తెలుసుకొనుటయే యోగమార్గము. ఇట్టి శరీరమును పరీక్షించి, పరిశోధించి దాని తత్త్వములను కనుగొని, ఆరోగ్యమును శరీర పునఃనిర్మాణమును తెలుసుకొనవలసి ఉండును. ఇదియే యోగరహస్యము. ఇది దేహాంతర భాగము నందు జరుగవలెను. దీనికి బాహ్యవస్తువులతో పనిలేదు. ఆత్మ, అనాత్మ, మనస్సు, జీవాత్మ, పరమాత్మ, జీవుడు వాటి వివరములు తెలుసుకొనవలెను. దీనినే సాంఖ్య యోగమందురు. పరమాత్మ తత్త్వము కూడా శరీరము నందే కలదు.
357. బ్రహ్మ జ్ఞానము శరీరము ద్వారానే సాధనతో అనుభూతి చెందవలెను. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయావస్థలు శరీరమునకు సంబంధించినవే. అందుకు మౌనము, ధ్యానము, కర్మ, జ్ఞానము శరీరాధారముగా జరుగు క్రియలే. గణపతి, రుద్రుడు, శివుడు మొదలగు చక్రాధిష్ఠాన దేవతలందరు శరీరమందే కొలువుతీరి యున్నారు.
358. శరీరము ఆరోగ్యముగా, దృఢముగా ఉన్నంత కాలము జీవుడు శరీరములోనే ఉండును. దేహమే దేవాలయము. అహం బ్రహ్మాస్మి. జీవుడే దేవుడు. శరీరము నశ్వరమైనను అందే సర్వశక్తులు, దేవతలు వసించి ఉన్నారు.
359. శరీరము అను గూడు చర్మముచే కప్పబడినది. మాంసము, నరములు, గ్రంధులు, దుర్వాసనలతో కూడి ఉన్నది. వివిధాలంకారములతో శోభిల్లిన శరీరం స్మశానమున కుక్కలు, గ్రద్దలు, నక్కలకు ఆహారం అగుచున్నది. ప్రథ్వి అంతయు స్మశాన వాటికయే. కాని కేవలం జన్మాదిగా దృఢమైన వాసనలు మాత్రము తన వెంట గొనిపోవు చున్నాడు.
360. పూర్వము ఋషులు, యోగులు, ముముక్షువులు సాధనలో శరీర ప్రాధాన్యతను గుర్తించి దాని ఆధారముగానే అనేక సిద్ధులు పొందిరి.
361. ఈ శరీరము మైధునం వలన కలిగినది. నరక సదృశమైన యోని నుండి వెలువడినది. ఎముకలు, మాంసము, చర్మముతో కప్పబడి, మలమూత్రములు, పిత్తము, కఫము, మజ్జ, క్రొవ్వు మొదలగు అనేక మలముల కోశాగారము ఈ శరీరము.
362. ఒక పదార్థము దాని విభజన అణువుల మయము. ఇంకా వేరు చేయలేని ఒక చిన్న పదార్థమును పరమాణువు అంటారు. ఇవన్నియూ మూల అణువు నుండి వచ్చినవే. అణువు పరిమాణవులుగా విడిపోయాయి. ఇవి సున్నితమైన సూక్ష్మ దర్శినితో కూడా కనబడవు.
363. జీవుడు స్థూల శరీరమును వదలి సూక్ష్మ శరీరుడై పరలోకములకు పోవును. సూక్ష్మ శరీరము నశించదు. జీవుడు సూక్ష్మ శరీరమును వదలి ఉండడు. జీవుడు ఒక శరీరమును వదలి వేరొక శరీరమును పొందును. కాని సూక్ష్మ శరీర భంగమే మోక్షము, జన్మరాహిత్యము.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment