గీతోపనిషత్తు -338


🌹. గీతోపనిషత్తు -338 🌹

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

📚. 9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 29-1 📚


🍀 29-1. అతీత స్థితి - స్థూలముగ జీవలోకమగు భూలోకము నుండి సత్యలోకము వరకు ఏడు లోకములుగా తెలుపవచ్చును. మరల ప్రతి లోకము నందు కూడ ఏడు ఉప లోకములను దర్శింపవచ్చును. అన్ని లోకము లందు పరమాత్మ ఒకే విధముగ నుండును. దుష్టుల యందు ద్వేషముగాని, శిష్టుల యందు ప్రీతిగాని యుండదు. 'ఉనికి'గ పరమాత్మ సర్వమునకు అతీతుడు. చైతన్యపరముగ జీవులయందు హెచ్చుతగ్గు లుండునుగాని, అందరి విషయమున ఉనికి ఒకటియే. అన్నిటి యందు తాను సమముగనే యున్నాడు. కాని వారియందలి చైతన్యము ఉత్తమము అధమముగను, ధర్మము అధర్మముగను, వారి వారి పరిణతి బట్టి ఏర్పడు చుండును. 🍀

సమో హం సర్వభూతేషున మే ద్వేష్యో స్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ II 29

తాత్పర్యము : సమస్త భూతములయందు నేను సమముగ నున్నాను. నాకు ద్వేషింపతగు వారుగాని, ప్రేమింపతగు వారు గాని ప్రత్యేకముగ నెవ్వరును లేరు. వారియందున్న నన్ను సేవించు వారిని నేనునూ సేవింతును.

వివరణము : సమస్త ప్రాణికోటియందు ఉనికిగ నున్నది నేనే. నేనాధారముగనే అన్నిభూతములు ఉండుట జరుగుచున్నది. చైతన్యపరముగ జీవులయందు హెచ్చుతగ్గు లుండునుగాని, అందరి విషయమున ఉనికి ఒకటియే. దేవతలు ఉన్నారు. అసురులు ఉన్నారు. ఆదిత్యు లున్నారు. రుద్రులున్నారు. ప్రజాపతు లున్నారు. వసువులున్నారు. రాయి రప్ప మొదలుకొని అన్ని వర్గములందు జీవు లున్నారు. ఈ ఉండుట అందరికిని సమముగనే యుండును. ఇది భగవంతుని అస్థిత్వము. అన్నిటి యందు తాను సమముగనే యున్నాడు. కాని వారియందలి చైతన్యము ఉత్తమము అధమముగను, ధర్మము అధర్మముగను, వారి వారి పరిణతి బట్టి ఏర్పడుచుండును.

స్థూలముగ జీవలోకమగు భూలోకము నుండి సత్యలోకము వరకు ఏడు లోకములుగా తెలుపవచ్చును. మరల ప్రతి లోకము నందు కూడ ఏడు ఉప లోకములను దర్శింపవచ్చును. అన్ని లోకము లందు పరమాత్మ ఒకే విధముగ నుండును. దుష్టుల యందు ద్వేషముగాని, శిష్టుల యందు ప్రీతిగాని యుండదు. 'ఉనికి'గ పరమాత్మ సర్వమునకు అతీతుడు. అట్టి ఉనికియే లేనిచో ఊర్ధ్వలోకములు లేవు, అధోలోకములు లేవు. ధర్మపరులు లేరు, అధర్మపరులు లేరు. ప్రళయమున తానొక్కడే ఉనికిగ యుండును. అంతయు తన యందు ఇమిడి యున్నది. సృష్టియందు కూడ పరమాత్మ ఒకడిగనే యుండును. అతడాధారముగ సృష్టి ఏర్పడుచు యుండును.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


19 Mar 2022

No comments:

Post a Comment