మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163


🌹. మాస్టర్ ఇ.కె. గారి సందేశములు - 163 🌹

✍️. రచన : సద్గురు ఇ. కృష్ణమాచార్యులు
📚 . సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻. సర్వాంతర్యామి సాక్షాత్కారం 🌻


మహనీయులు దేవుని అస్తిత్వమునందు‌ శరణాగతి చెంది, జీవయాత్ర సాగింతురు. వీరు తమ‌ హృదయములందు ఎనిమిది అంగుళముల‌ కొలత కలిగిన దివ్యదేహునిగా సర్వాంతర్యామిని ధ్యానింతురు. అనగా ఎనిమిది ప్రకృతులలోని వానిని తెలియుదురు. చూపుడు వ్రేలు‌ కొలతగా హృదయమున శ్రీహరిని ధ్యానింతురు. అనగా చూపడు వ్రెలితో ఎవ్వనిని చూపినను, ఏ వస్తువును చూపినను, వాని యందు భగవంతుడు జ్ఞప్తి రావలెను గాని ఆయా వ్యక్తులు, వస్తువులు‌గాదు.

స్వామిని చతుర్భుజుడుగా ధ్యానింపవలెను. అనగా తాను నిలబడిన తావున నుండి నాలుగు దిక్కుల వరకు కనుపించునంతమేర దేవుని బాహువులు రక్షించుచున్నవని తెలియవలెను. మందర ధారియగు కూర్మమూర్తిగా భావింపవలెను. అనగా జగత్తును ధరించు‌ శక్తిగా తెలియవలెను.

దేవుని గూర్చి మనకు ఎంత గొప్ప అభిప్రాయమున్నను, అది అభిప్రాయమే గాని దేవుడు కాదని గ్రహింపవలెను. సాధన చేయుచున్నప్పుడు కలుగు స్వప్న సాక్షాత్కారములు మున్నగు అనుభవములకు మురిసి పొంగినచో, ఇంక ఆ పైకి పోవుట జరుగదు. ఇట్టివి మన కోరికల సాక్షాత్కారములే కాని, దేవుని సాక్షాత్కారములు గావు. భగవంతుని‌ సాక్షాత్కారమనగా సృష్టిలోని జీవుల రూపములోని సాక్షాత్కారమే. మిగిలినదంతయు జీవులల్లుకొన్న పాండిత్యమనియు తెలియవలెను.


.✍️ మాస్టర్ ఇ.కె.🌻

🌹 🌹 🌹 🌹 🌹


13 Mar 2022

No comments:

Post a Comment