దేవాపి మహర్షి బోధనలు - 112
🌹. దేవాపి మహర్షి బోధనలు - 112 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 91. భౌతికలోక సత్యము - 2 🌻
ధర్మము నాచరించు వారికే క్రమముగ సమానత్వ మననేమో తెలియును. ధర్మనిష్ఠ బాధ్యతగ నిర్వర్తించు వారకే స్వతంత్రత అననేమో తెలియును. అట్టివారి మధ్యే సోదరత్వము వెల్లి విరియును. భౌతిక ప్రపంచమున జీవుడు కర్తవ్యమును, సృష్టి ధర్మములను నెరిగి ప్రవర్తించుట ద్వారా బుద్ధి లోకములలోనికి ప్రవేశించినపుడు పై మూడు అంశములు అవగాహన కాగలవు.
శ్రీరాముని జీవితమున ఈ మూడు అంశములను గమనించవచ్చును. అతడు సర్వ స్వతంత్రుడు. ఆ స్వాతంత్ర్యము అతనికి కర్తవ్య నిర్వహణము నుండి ధర్మాచరణము నుండి వికసించినది.
బాధ్యత పడక కర్తవ్యము నెరుగక ధర్మము నెరుగక జీవించు జీవులకు సోదరత్వము, సమానత్వము, స్వతంత్రము ఎండమావులవంటివి. చట్టములెన్ని ఏర్పరచినను ఈ ఆశయములను పొందలేరు. వీని పేర విధ్వంసమే జరుగుచు నున్నది.
స్వతంత్రమని, సమానత్వమని అగ్రరాజ్యములు, అగ్రవర్ణములు బలహీనులను హింసించుటయే మానవజాతి చరిత్రగ సాగుచున్నది. ఈ మూడు ఆశయములు వ్యక్తిగతముగ సిద్ధించగలవే గాని సామాజికముగ సిద్ధింపవు. అవతార పురుషులు దిగి వచ్చినను భౌతికలోకమున నుండు శాశ్వత సత్యమిదియే.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
12 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment