దేవాపి మహర్షి బోధనలు - 129


🌹. దేవాపి మహర్షి బోధనలు - 129 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 106. సద్గురు రూప ధ్యానము 🌻


నీ సద్గురువు యొక్క ముఖారవిందమును అతని రూపమును, నీవు వివరముగ ధ్యానము నందు దర్శించుట నీకెన్నియో విధములుగ మేలు చేయును. అతని సహకారమున నీవు చాల విషయములను దర్శనము చేయగలవు. నీ దృష్టికి చేయవలసిన ప్రణాళిక దర్శన మగును. బోధనలు వ్రాతపూర్వకముగ దర్శనమగును. నీ వద్దకు రాబోవు మనుష్యులు, వస్తువులు, ధనము కూడ ముందుగనే దర్శన మగును. వానిని వినియోగించు ప్రణాళికలు కూడ దర్శనమగును. దివ్యమగు విషయములెన్నియో గోచరించును. క్రమముగ యితర గ్రహముల నుండి కూడ వలసిన ప్రశక్తి కూడ లభించును. మేమట్లే గ్రహగోళాదుల నుండి మీకెన్నియో విలువైన విషయములను కొనివచ్చి పంచుచున్నాము. ఇందు ఆశ్చర్యపడవలసినదేదియు లేదు.

మీ ఆజ్ఞా కేంద్రము సర్వలోకములకు ముఖద్వారము. నీవచ్చట దర్శనమునకై చేయు నిరంతర సాధన, నీ గురువు యొక్క సహకారము కారణముగ యిట్టివి జరుగగలవు. క్రమముగ మీ మూడవకన్ను తెరవబడగలదు. అప్పుడు నీకు క్రమముగ అనంతవిశ్వము, అందు పని చేయుచున్న అనేకానేక ప్రజ్ఞలు, శక్తులు పరిచయము కాగలవు. నీవు ఒక అయస్కాంతమువలె వానినాకర్షించ గలవు. మీకు ఈ విధమైన మేలుకొలుపు నందించిన సద్గురువును మార్గమును మాత్రము మరువకుము. మరచినచో నిశీధిని (చీకటి యందు) ఆలంబనము లేక గజిబిజి కాగలవు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


20 Aug 2021

No comments:

Post a Comment