https://www.facebook.com/groups/chaitanyavijnanam/posts/2281520119301123
🌹🔱 7. నవ దుర్గల ఆరాధన - సప్తమ దుర్గ – కాళరాత్రి దేవి – మహాకాళీ దేవి విశిష్టత, ప్రార్థనా శ్లోకాలు, ఆరాధనా విధానం - పురాణ కధ, సాధన 🔱🌹
✍️ ప్రసాద్ భరద్వాజ
🌹🔱 7. Worship of the Nava Durgas (Nine Forms of Durga) – The Seventh Durga: Goddess Kalaratri (Maha Kali) – Significance, Prayer Verses, Rituals of Worship, Mythological Legend, and Spiritual Practice 🔱🌹
✍️ Prasad Bharadwaj
ఆరాధనా దినం: ఏడవ రోజు | సంప్రదాయ రంగు: నీలం
దుర్గా నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. మహాకాళీ దేవి ఆదిపరాశక్తి యొక్క ఉగ్రశక్తిని, దుష్టశక్తుల సంహారాన్ని, అజ్ఞాన నిర్మూలనను సూచిస్తుంది. కాళరాత్రి స్వరూపం ద్వారా అమ్మవారు భయాలను తొలగించి, భక్తులకు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదిస్తుందని విశ్వసిస్తారు.
🌼 కాళరాత్రి ప్రార్థనా శ్లోకం
ఏకవేణీ జపాకర్ణపూరా నగ్నా ఖరాస్థితా ।
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ ॥
వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా ।
వర్ధనమూర్ధధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ॥
భావం: ఉగ్రస్వరూపిణి అయిన కాళరాత్రీదేవి మా భయాలను తొలగించి, అజ్ఞానాంధకారాన్ని పారద్రోలి, ధైర్యాన్ని, శుభాన్ని ప్రసాదించుగాక.
అలంకారం: మహాకాళీ దేవి
మహాకాళీదేవిని గాఢమైన నీలం లేదా నలుపు రంగు అలంకరణతో, దివ్యాభరణాలతో, పుష్పమాలలతో ఆరాధిస్తారు. ఈ అలంకారం కాలశక్తికి, దుష్టశక్తుల నిర్మూలనకు, అహంకారంపై విజయానికి ప్రతీకగా భావించబడుతుంది.
🌼 మహాకాళీ ప్రార్థనా మంత్రం
ఓం క్రీం కాలికాయై నమః ॥
భావం: మహాకాళీదేవికి నమస్కారాలు. ఆమె దివ్యశక్తి మా భయాలను తొలగించి, ధైర్యాన్ని, ఆత్మబలాన్ని ప్రసాదించుగాక.
నైవేద్యం: కదంబం, శాకాన్నం లేదా కుటుంబ సంప్రదాయానుసారమైన ప్రసాదం.
🌷 పురాణ కధ - సాధన
దుర్గామాత ఏడవ శక్తి ‘కాళరాత్రి’ అనే పేరుతో ఖ్యాతి వహించింది. ఈమె శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లాచెదరై ఉంటాయి. మెడలోని హారము విద్యుత్కాంతులను విరజిమ్ముతూ ఉంటుంది. ఈమెకు గల త్రినేత్రాలు బ్రహ్మాండములాగా గుండ్రనివి. వాటినుండి విద్యుత్కాంతులు ప్రసరిస్తూ ఉంటాయి. ఈమె నాసికాశ్వాసప్రశ్వాసలు భయంకరములైన అగ్ని జ్వాలలను వెడలగ్రక్కుతుంటాయి. ఈమె వాహనము గార్ధబము లేదా గాడిద.
ఈమె తన ఒక కుడిచేతి వరదముద్ర ద్వారా అందరికీ వరాలను ప్రసాదిస్తుంది. మరోక కుడిచేత అభయముద్రను కలిగి ఉంటుంది. ఒక ఎడమచేతిలో ఇనుపముళ్ళ ఆయుధాన్నీ, మరొక ఎడమచేతిలో ఖడ్గాన్నీ ధరించి ఉంటుంది.
కాళరాత్రి స్వరూపము చూడటానికి మిక్కిలి భయానకమైనప్పటికీ ఈమె ఎల్లప్పుడూ శుభ ఫలితాలనే ప్రసాదిస్తుంది. అందు వలన ఈమెను ‘శుభంకరి’ అని కూడా అంటారు. కాబట్టి భక్తులు ఈమెను చూసి ఏ భయాన్నిగానీ, అందోళననుగానీ పొందనవసరం లేదు.
దుర్గా నవరాత్రులలో ఏడవ రోజున కాళరాత్రి మాతను ఉపాసిస్తారు. ఆ రోజు సాధకుని మనస్సు సహస్రార చక్రంలో స్థిరమవుతుంది. అతనికి బ్రహ్మాండములలోని సమస్త సిద్ధులూ కరతలామలకములవుతాయి. ఈ చక్రాన స్థిరపడిన సాధకుడి మనస్సు పూర్తిగా కాళరాత్రి స్వారూపంపైనే స్థిరమవుతుంది. ఈమె సాక్షాత్కారం వలన భక్తునికి మహాపుణ్యము లభిస్తుంది. అతని సమస్త పాపాలు, ఎదురయ్యె విఘ్నాలు పటాపంచలైపోతాయి. అతనికి అక్షయ పుణ్యలోప్రాప్తి కలుగుతుంది.
కాళరాత్రి మాత దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రానే దానవులూ, దైత్యులూ, రాక్షసులూ, భూతప్రేత పిశాచాలూ భయంతో పారిపోవడం తథ్యం. ఈమె అనుగ్రహంవల్ల గ్రహబాధలు తొలగిపోతాయి. ఈమెను ఉపాసించేవారికి అగ్ని, జలము, జంతువులు మొదలైన వాటి భయం కానీ శత్రువుల భయం కానీ, రాత్రి భయం కానీ – ఏ మాత్రం ఉండవు. ఈమె కృపవల్ల భక్తులు సర్వదా భయవిముక్తులవుతారు.
కాళరాత్రి మాత స్వరూపాన్ని హృదయంలో నిలుపుకొని మనుష్యుడు నిష్ఠతో ఉపాసించాలి. యమ, నియమ సంయమనాలను పూర్తిగా పాటించాలి. త్రికరణ శుద్ధి కలిగి ఉండాలి. ఈ దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించే వారికి కలిగే శుభాలు అనంతాలు. మనం నిరంతరం ఈమె స్మరణ, ధ్యానములను, పూజలనూ చేయటం – ఇహపర ఫల సాధకం.
✍️ ప్రసాద్ భరధ్వాజ
🌹 🌹 🌹 🌹 🌹
