దేవాపి మహర్షి బోధనలు - 123


🌹. దేవాపి మహర్షి బోధనలు - 123 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 100. శంబళ 🌻


శంబళ, ఒక దివ్యాశ్రమము. భూమిపై జరుగు దివ్య కార్యక్రమములకు ప్రధాన కేంద్రము. అన్ని ఆశ్రమములకాధారము. దివ్య జీవనులకు శంబళ దివ్యానుభూతి. శాశ్వత సత్యము. ఇతరులకు అది పుక్కిటి పురాణము. శంబళను గూర్చి అనేకానేకములుగ వదంతులున్నవి. కొందరికది, మరుగుపడిన దివ్యసంపద. మరికొందరికి అది భూగర్భితమైన ప్రాచీన గ్రామము. ఇంకొందరికి అది ఆకసమున తేలుచుండు సూక్ష్మమగు ఆశ్రమము. తెలిసినవారు శంబళను భూమికి దివ్యరాజధానిగ తెలుపుదురు.

అందు భూమిని పాలించు ఏకైక చక్రవర్తి యగు సనత్కుమారుడు, వసించియున్నాడని భావింపుడు. అతడు శ్రీకృష్ణుడు భూమిపై సంచరించినపుడు, ప్రద్యుమ్నుడై అతనికి జన్మించినాడని తెలుపుదురు. శ్రీకృష్ణుడు దేహత్యాగము చేసిన వెనుక మరల సనత్కుమారునిగ స్వస్థానమున నిలచి పరమ గురువుల పరంపరకు అండగ నిలచియున్నాడని కూడ తలతురు. అతడే భూమిని, భూమి జీవులను పరిపాలించుచు వారి పరిణామమునకై కృషి సలుపుచున్నాడని భావింతురు.

సనత్కుమారుడు సనక సనందనాదులతో నొక త్రిభుజముగ నేర్పడి బ్రహ్మలోకము నుండి భూలోకము వరకు నొక చైతన్య సూత్రమును సంధించియుంచినాడని, తత్కారణముగ భూమి జీవులు బ్రహ్మలోకమునకు చేరుటకు వలసిన మార్గము తెరచి యున్నదని మైత్రేయాదులు తెలుపుదురు.

అతడే ఈ భూమికి జీవమని, ప్రధాన చేతనమని, మేము తెలిసియున్నాము. అతడు మైత్రేయునికి కొండంత అండగ నిలచి అతని ఆశయ పరిపూర్తికై వలసిన సహాయ సహకారము లందించుచు అనాదిగనున్నాడు. అతడు చక్రవర్తి. మైత్రేయుడు గురువు. ఒకరు రాజు, మరియొకరు పురోహితుడు. మేమందర మతని ఋత్విక్కులము. మీరందరతని పిల్లలు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


8 Aug 2021

No comments:

Post a Comment