దేవాపి మహర్షి బోధనలు - 121


🌹. దేవాపి మహర్షి బోధనలు - 121 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 98. యుక్తాహారము 🌻


సున్నితమగు మానవ చైతన్యమునకు మాంసాహారము అపాయకరము. చచ్చినవానిని, చంపిన వానిని తినుట వలన అతని చైతన్యమునకు అవస్థితులేర్పడును. ఎంత నిర్మూలించినను మాంస ఖండమున రక్తముండును. అట్టిమాంస ఖండములను తినుటవలన రక్తము త్రాగిన వారగుదురు. మాంసము తినకూడదనుటకు కారణమిది యొక్కటియే. రక్తమునకు మాంసమునకు విడదీయరాని బంధమున్నది.

రక్తపు ప్రభావము మాంసముమీద మిక్కిలిగ యున్నది. అట్టి మాంసమును భుజించుట వలన రక్త పిపాసుల బుద్ధులు, మానవ మేధస్సును చేరును. అంతియేకాదు దీని వలన రకరకములగు వ్యాధులు కూడ మానవ దేహమున పుట్టును. ఈనాడు భూమిపై జరుగు మారణ హోమమంతయు హింసా ప్రవృత్తి, రాక్షసత్వము, రక్తాహారము వలననే!

రక్తము త్రాగువారు, భుజించువారు రాక్షసులు కాక ఎట్లుందురు? ఇట్టివారి నుండి పుట్టు భావము లన్నియు రక్తదాహమును కోరుచునేయుండును. కల్లోలములు పుట్టించుట, యుద్ధములు చేయుట, శాంతిని భంగపరచుట అను వినాశకర కార్యములయందు యిట్టివారి జీవచైతన్యము యిమిడి పోయినది.

పై విషయమును గూర్చి శాస్త్రజ్ఞులు నిశితముగ శాస్త్రీయమగు ప్రయోగములు చేయవలసిన అవసరమెంతయునున్నది. జంతు వధశాల వద్ద గల వాతావరణమును పరిశీలించినచో పై సూచించిన సత్యములు తెలియగలవు.

ఇట్టి మానవ ప్రవర్తన యందు మార్పు రానిచో నూతనయుగమారంభమే కాదు. మానవులకు తెరతొలగింపు యుండదు. దీనిని గూర్చి ప్రభుత్వము, వైద్యము, విద్య కృషి చేయవలసిన అవసరమెంతయు గలదు. రక్తాహారమే ప్రస్తుత కాలమున మానవజాతి అలజడికి మూల కారణము. యుకాహారమే పరిష్కారము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


03 Aug 2021

No comments:

Post a Comment