దేవాపి మహర్షి బోధనలు - 126


🌹. దేవాపి మహర్షి బోధనలు - 126 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 103. బహుముఖత్వము 🌻

మరియొక సాధన చెప్పుచున్నాను. మీరొక చేయితో పనిచేయు చున్నప్పుడు రెండవ చేతితో మరియొక పని చేయుగలరా? సామాన్య ముగ చేయలేరు. రెండు చేతులతో రెండు భిన్నమైన పనులను చేయుట ప్రయత్నింపుడు. అట్లే ఒకే సమయమున రెండు భిన్నమైన ఉత్తరములు, చెప్పుటకు ప్రయత్నింపుడు. ఇద్దరు వ్యక్తులతో ఒకేసారి (Alterna-tingగా) మాట్లాడుటకు ప్రయత్నింపుడు. అట్లే వాహనము నడుపుచు మాట్లాడుటకు ప్రయత్నింపుడు. మీరు వాదన చేయుచున్నప్పుడు, ఎదుటి వ్యక్తి అసహనమునకు గురి అగుచున్నచో చటుక్కున వాదన మార్గమును మార్చుడు.

పై విధముగ చేయుటలో మీచేతనను ఒకే సమయమున రెండు విధములుగ ప్రవహింపచేయు అలవాటేర్పడును. అట్లు చేయుటలో చేతన ప్రవాహము సన్నగిల్లరాదు. ఒకే చైతన్యము రెండు రకములుగ ప్రవహించుటచే సృష్టి ఏర్పడుచున్నది. మీ నుండి కూడ సృష్టి జరుగుట కిదియొక ప్రక్రియ. ఉదాహరణకు, మా ప్రియశిష్యుడు జ్వాలా కూలుడు ఒకే సమయమున రెండు కాదు, మూడు పనులు చేయుట నేర్చెను. అతడు హిమాలయములలో నివసించుచు అదే సమయమున జర్మనీలోను, అమెరికాలోను కూడ పనిచేసి చూపించెను.

ఏకోన్ముఖ కార్యము కలియుగ నైజము. బహుముఖ కార్యములు దివ్యస్థితి. ఇది మేమందరము శ్రీకృష్ణుని వద్ద నేర్చినాము. అతడు యోగేశ్వరుడు. ఒకే సమయమున పదిచోట్ల పది పనులు గావించెడి వాడు. అతడు ఒకే సమయమున తన ఎనిమిద మంది భార్యలతో ఎనిమిది అంతఃపురములలో కలిసియుండుట చూపించి నారద మహర్షినే అబ్బుర పరచినాడు. సాధన నుండి యిట్టి సిద్ధులు పొంద వచ్చును. తీరిక సమయములలో దీనికి సంబంధించిన కసరత్తులు చేయుట తప్పుకాదు. ఇట్టి సాధనల వలన చైతన్యము బహు ముఖములుగ వికసించగలదు. పశువులు కూడ ఏకోన్ముఖత కలిగి యున్నవి. మానవులంతకన్న చాల శక్తివంతులు. ఇది తెలియుడు.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


14 Aug 2021

No comments:

Post a Comment