దేవాపి మహర్షి బోధనలు - 130


🌹. దేవాపి మహర్షి బోధనలు - 130 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 107. స్వస్వరూప దర్శనము 🌻


మైత్రేయ మహర్షి జీవుని పునరుత్థానమునకే అవతరించి యున్నాడు. అతని బోధనలన్నియు జీవుడు తనకు తాను శాశ్వతుడనని, నశింపనివాడనని, జననమరణముల కతీతుడనని తెలియ చేయుటకే. అది అతని ప్రధాన కార్యక్రమము. తూర్పుదేశములందు యీ అవగాహన జీవతత్త్వమున యిమిడి యున్నది. అనుభూతియే యింకను కొదవ. దానికి యోగసాధనమే మార్గము.

అందుచే అతని అనుయాయులమైన మేము అందరమును పై విషయములు బోధించుచు, వివిధ యోగసాధనా మార్గముల నందించు చున్నాము. అష్టాంగయోగమునకు కూడ అతడే అధిపతి. భాగవత మార్గమున విశ్వప్రేమను రుచి చూపుటకు కూడ అతడే ఉపదేశకుడు. భూమిపై అయన జీవనము కేవలము మానవుల పునరుత్థానము కొరకే.

మైత్రేయమహర్షి జాతికి స్ఫూర్తినిచ్చు విషయమున నిర్విరామముగ కృషిచేయుచు, మావంటి వారిని ప్రతినిత్యము హెచ్చరిక చేయుచునుండును. ఆయనెపుడూ మాతో పలుకు వాక్యము “త్వర పడుడు, ఆలస్యము పనికి రాదు. ఆనందమందరికిని అందవలెను. కర్తవ్యమున ఏ మాత్రము అలసత్వముండరాదు.” ఆయన పలుకు నప్పుడు అహర్నిశలు కృషిచేయుచున్న మాకు కూడయింకను చేయ వలసిన పని చాల మిగిలి యున్నదనిపించును. ఆయన దర్శనము, వాక్కులు మాలోనికి చొచ్చుకొనిపోయి యినుమడించిన ఉత్సాహము ఏర్పడును.

ఆయనను గూర్చి స్మరించినప్పుడెల్ల నాకిట్లనిపించు చుండును. “ఈ మైత్రేయుని కెంత కరుణ! ఈ రోజుననే జాతి అంతయు మేల్కాంచి ఆనందమయ లోకములలో ప్రవేశింపవలెనని తపన చెందు చున్నట్లుగ గోచరించును. జగన్మాతకు ఎంత కరుణ కలదో, ఆ కరుణ అంతయు ఆయన చూపుల నుండి ప్రసరించి, మేల్కొనిన వారిని కూడ మరింత మేలుకొల్పును కదా! ఆయన కన్నులు అనిర్వచనీయ మగు కరుణాపూరితము !!


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


22 Aug 2021

No comments:

Post a Comment