దేవాపి మహర్షి బోధనలు - 122


🌹. దేవాపి మహర్షి బోధనలు - 122 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 99. శిష్య దురాచారము 🌻


బుద్ధునికి దేవదత్తుడు, ఏసుక్రీస్తునకు జూడాసే తీరని ద్రోహము చేసినట్లు చరిత్ర పుటల కెక్కినది. చరిత్ర పుటల కెక్కక సద్గురువులకు ద్రోహము గావించిన వారు కోకొల్లలు. సద్గురు వందించిన బోధలనను యథాతథముగ గ్రహించుటయే మొదలు కష్టము. ఎవరి స్వభావమును బట్టి వారు బోధనలను అవగాహన చేసుకొందురు. సద్గురువు బోధనకన్న శిష్యుని అవగాహన భిన్నముగ నుండవచ్చును. ఇది సర్వసామాన్యము.

ఈ కారణముగ బోధనలను మరల మరల శ్రద్ధగ వినవలెను. తాను వింటినని, తెలుసుకొంటినని అనుకొనువాడు అహంకారి. ఒకటికి పదిమార్లువిని తన అవగాహనను అవకాశమున్నప్పుడు సద్గురువు వద్ద పరిశీలించు కొనవలెను. ఇది మొదటి మెట్టు. తాను పొందిన అవగాహనను ఆచరణలోనికి కొనివచ్చుటకు దీనితో ప్రయత్నింపవలెను. అట్టి దీక్షకు శ్రద్ధ, భక్తి, సంకల్పబలము, ప్రధానమై నిలచును. ఆచరణ మార్గముననే బోధన ఆకళింపు కాగలదు. ఇది రెండవ మెట్టు.

ఆచరణమున ఆకళింపైన బోధనమును సహాధ్యాయులతో, బంధుమిత్రులతో వారి ఆసక్తిని బట్టి పంచుకొనుట మూడవ మెట్టు. ఇది బాధ్యతాయుతమైన శిష్యత్వము. ప్రస్తుత కాలమున బోధనలందుకొని అవగాహన చేసుకొనక, తామాచరించక ఇతరుల కందించువారు కోకొల్లలుగ నున్నారు. ఈ స్వభావము శిష్యులలో ఈనాడు కొత్తగ ఏర్పడినది కాదు. ద్వాపర యుగ ఆరంభము నుండి యిట్టి ప్రవర్తనము మొలకెత్తినది. ఇది దురాచారము.

ఈ దురాచారము వలన శిష్యునికి హాని కలుగును. జీవితము ముందునకు సాగుతున్న కొలది మానసికముగ పలుమార్లు గాయపడు చుండును. క్రమముగ గురుశిష్య సంబంధ సూత్రము తెగును. ముందు జన్మలలో మరల గురువునకై అన్వేషణము జరుగును. ఈ దురాచారము సద్గురువును కూడ బాధించును. పై కారణముగ సద్గురు శిష్యుల నంగీకరించుటకు వ్యామోహపడరాదు. కలియుగమున శిష్యవ్యామోహము గురువునకు, దురాచారము శిష్యునకు హెచ్చగుచున్నది.

సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


06 Aug 2021

No comments:

Post a Comment