దేవాపి మహర్షి బోధనలు - 108


🌹. దేవాపి మహర్షి బోధనలు - 108 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 89. ప్రదర్శన - దర్శనము 🌻


పునర్జన్మను గూర్చి నీ వెన్నడైన భావింతువా? మరణమును గూర్చి భావింతువా? జన్మించక ముందు మరణించిన వెనుక నీ వెట్లుంటివో ఎప్పుడైన ఆలోచించితివా? ఆలోచించుట సత్సాధకున కవసరము. నీ విప్పటికే లక్షలాది సార్లు పుట్టితివి చచ్చితివికూడ. అన్నిసార్లు పుట్టిచచ్చిననూ, చచ్చిపుట్టిననూ దాని అనుభవము నీకు లేదు కదా! నీవెట్లు పుట్టితివి? ఎట్లు చచ్చితివి? నీకు తెలియనే లేదు కదా!

ఈ రెండు సన్నివేశములు జరుగునప్పుడు నీ వున్నావు. నిద్రకు ముందు, నిద్ర తరువాత నిద్రయందును, మేల్కాంచుట యందును స్వప్నమునందుకూడ నీవున్నావు. ఉండుట సత్యమే. కాని సన్నివేశములు జరుగుచున్నప్పుడు నీవున్నను పరికించలేక పోవుచున్నావు. దీనికి కారణమేమి? కారణ మొకటియే.

నీ యందు సాక్షిగ గమనించు బుద్ధి జనించ లేదు. ఈ సాక్షిత్వము నీయందు జనించవలె నన్నచో దైనందినముగ జరుగు సన్నివేశము లలో గమనించుట నేర్వవలెను. సన్నివేశము నందిమిడి పోవుట కాక దానిని గమనించువానిగ, సన్నివేశమునకీవలగ నుండవలెను.

అన్ని సన్నివేశములయందు నీవు సాక్షిగ నుండి జరుగుచున్న సన్నివేశమును సినిమా చూచినట్లు చూచుటవలె చూడవలెను. చిన్ని చిన్న విషయముల యందు దీనిని ముందు ప్రయత్నింపుము. ఇది అభ్యాసముగ స్థిరపడినచో క్రమముగ నీవు నీ జీవితమును నందలి సన్నివేశములను, నీ సినిమాగ చూడగలవు. ఇట్లు చూచుట నేర్చుటయే తారణమునకు మార్గము. అలసత్వము లేక ప్రయత్నింపుము.

మేమీ విద్య శ్రీకృష్ణుని నుండి నేర్చితిమి. ఆయన సాక్షీభూతులై యుండి కర్తవ్యమును అప్రమత్తతో నిర్వర్తించుచుండిరి. అన్ని మార్పులను చూచుచు వాని యందు మాకర్తవ్యములను నిర్వర్తించుచున్నాము. మా పుట్టుకలు మరణముల కూడ చూచితిమి. మీ పుట్టుకలు మరణములు కూడ చూచుచున్నాము. మీ రూపములు మారుచున్ననూ, జీవులుగ మేము గుర్తించుటకిదియే రహస్యము. మీరు మాకు పరిచితులే. మా సినిమాకథ, మీ సినిమాకథ కూడ చూచుచునుందుము.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


04 Jul 2021

No comments:

Post a Comment