దేవాపి మహర్షి బోధనలు - 128


🌹. దేవాపి మహర్షి బోధనలు - 128 🌹

✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ

🌻 105. దైవ నిర్ణయము 🌻


యాత్రికుడొకడు ఓడ నెక్కుచు నుండగ అతని బంగారపు నగల మూట దొంగిలింపబడెను. అందరును కలత పడుచు, “దొంగ, దొంగ” అని “పట్టుకొనుడు పట్టుకొనుడు” అని “అయ్యో అయ్యో” అని అరచుచు అలజడి గావించిరి. యాత్రికుడు మాత్రము దొరకక పారిపోయిన దొంగ వైపు చూచి తోటి యాత్రికులతో నిర్లిప్తముగ "దైవ నిర్ణయము” అని మృదువుగ పలికినాడు. అందరును అతని వైపుర్యముగ చూచినారు. అతనిని గూర్చి కొందరు ప్రశంసించుకొనిరి. మరికొందరు పాపమనిరి. మరికొందరు "కర్మ” యనిరి. మరికొందరు “అశ్రద్ధ" యనిరి. ఇంకొందరు “దొంగిలింపబడినది, దొంగిలింపబడినది" అని పలికిరి.

ఓడ కదిలినది- అది పెద్ద ప్రయాణము. మూడు పగళ్ళు, రాత్రుళ్ళ గడచిన వెనుక సముద్ర మధ్యమున ఓడ తుఫానుకు గురియైనది- సముద్ర మధ్యమున గల ఒక రాతిని గుద్దుకొని, ఓడ బీటలు వారినది. పడవ మునుగుట మొదలిడినది. ప్రయాణికు లందరును ప్రాణములు చేత బట్టుకొని సముద్రములోనికి దుమికిరి. ఎవరి ప్రయత్నము వారు గావించిరి. యాత్రికుడు ఓడ నుండి చెదిరి పడిన ఒక చెక్కముక్క ఆధారముగ ద్వీపము నొకటి చేరినాడు. ద్వీప వాసులు అతని నాదరించి శుశ్రూషలు చేసి స్వస్థత కూర్చిరి.

ద్వీపవాసులు యాత్రికునితో నిట్లనిరి “నీవు పయనించిన ఓడ సముద్ర మధ్యమున మునిగినది. వందలాది యాత్రికులు ప్రాణములు కోల్పోయినారు. నీ వొక్కడివే మిగిలినావు. నీ అదృష్టమేమిటో తెలియకున్నది. నీవు మిగులుట ఒక అద్భుతము.” యాత్రికుడిట్లని సమాధాన మిచ్చెను. “నేను ఓడ ప్రయాణమునకు కొన్న టిక్కెట్టు ఖరీదు చాల ఎక్కువ. ఖరీదైన టిక్కట్టుతో ఓడ ఎక్కితిని. అది దైవనిర్ణయము. ఓడ మునుగుట దైవనిర్ణయము. నేను మిగులుట దైవనిర్ణయము.” అంతా దైవనిర్ణయమని తెలియుడు.


సశేషం...

🌹 🌹 🌹 🌹 🌹


18 Aug 2021

No comments:

Post a Comment