దేవాపి మహర్షి బోధనలు - 111
🌹. దేవాపి మహర్షి బోధనలు - 111 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 91. భౌతికలోక సత్యము - 1 🌻
సోదరత్వము, సమానత్వము, స్వతంత్రము అనుభావములకు భౌతిక ప్రపంచమున అస్థిత్వము లేదు. ఇవి సూక్ష్మము దివ్యము అయిన లోకములకు సంబంధించినవి. అమృతత్వలోకములకు
సంబంధించినవి. సూక్ష్మలోకమున సృష్టిధర్మములు పరిపూర్ణముగ నవగాహనము కాగలవు. భౌతిక లోకమున అవగాహన వక్రత చెంది యుండును. స్వభావమునకు బానిసలైన జీవులకు స్వాతంత్ర్యము మృగ్యము.
స్వభావమే బలీయమై జీవుని ఆశయములు దానికి లోబడి యుండుటచే జీవునకు స్వాతంత్ర్యము లేదు. స్వాభావిక భావములు స్వతంత్ర్యమునకై ప్రయత్నించినపుడు అవి పరస్పర విరుద్ధములై, ధర్మవిరుద్ధములై ఘర్షణ చెందును. సమానత్వము స్వభావమునకు లోబడిన వారికి అసాధ్యము. అందరూ జీవులే అను భావనము తెలిసియున్నప్పటికిని స్వభావము నందు సమానత లేకుండుట వలన సమానత్వము సిద్ధింపదు.
సమర్థులు, అసమర్థులు సమానులు కారు. తెలిసినవారు తెలియని వారు సమానులు కారు. స్వభావము వైవిధ్యమై యున్నప్పుడు సమానత్వము అసాధ్యమగును. దివ్యము, అమృతము అగులోకముల యందు సత్పురుషులు ఏర్పరచుకొన్న సోదరత్వము సమానత్వము స్వతంత్రత ధర్మమున కనుగుణమై యుండును.
సశేషం...
🌹 🌹 🌹 🌹
10 Jul 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment