దేవాపి మహర్షి బోధనలు - 131
🌹. దేవాపి మహర్షి బోధనలు - 131 🌹
✍️. సద్గురు కె. పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ
🌻 108. స్వస్వరూప జ్ఞానము 🌻
సద్గురువును భ్రూమధ్యమున ధ్యాన మార్గమున వివరముగ దర్శించుట గూర్చి ముందు పాఠములలో తెలిపితిని. తేజోమయమగు అతని రూపమును ఆ విధముగ దర్శించు సాధన యందు మీకు పట్టు చిక్కిన వెనుక, నీవు భ్రూమధ్యమున సద్గురువు పాదముల చెంత కూర్చున్నట్లుగా దర్శించుటకు ప్రయత్నింపుము. నీ ముందు నీవు కూర్చున్నట్లు భావింపుము. నీ ముఖమును, రూపమును వివరముగ ఏకాగ్రతతో దర్శించుము.
శ్రద్ధ, భక్తి, నిరంతరత్వము, సద్గురువు అనుగ్రహము కారణముగ నీకు నీవు గోచరించుట ప్రారంభమగును. నీకు గోచరించు నీవు, నీకన్న తేజోమయముగ నుందువు. అపుడు నీవు “అది నేనే”, “అతడు నేనే”, “అతడే నేను” అని భావింపుము. దీనినే సంస్కృతమున “సో హం" అందురు. అతడు నీవైనప్పుడు, నీ వెవడవో కూడ నీకు తెలియును. అతడు తేజోమయుడు.
నీవు మృణ్మయుడవు. అప్పటి నీ భావన యిట్లుండును. "నేను తేజోమయుడను. ఈ మృణ్మయుడు నా గృహము, నా నివాసము, నా దేహము. అది నేను కాదు. నా నుండి అది ఏర్పడినది. దాని యందింతకాలము నీర, క్షీర న్యాయముగ కలిసి యున్నది. ఇపుడు విడిపడి నేను 'నేనుగ' నున్నాను. నా దేహమునందుండి పనులు చేయుదును.
అటుపైన దేహమును విడిచెదను. దాని నుండి విడిపడుటచే మరణించను. అది మరణించును. నేనుందును.” ఇట్టి క్షరాక్షరజ్ఞానము నీకు కలుగును. ఇది ధ్యానము వలననే సాధ్యము. కేవలము భావించుట వలన సాధ్యము కాదు. ఈ ధ్యానము సాధ్యపడుటకు కాలము, కర్మము కలసిరావలెను. అందులకై పరహిత కార్యములందు దీర్ఘకాలము సమర్పితుడవై జీవించవలెను. స్వార్థపరులకు యిది అసాధ్యము.
సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹
24 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment