నిర్మల ధ్యానాలు - ఓషో - 63
🌹. నిర్మల ధ్యానాలు - ఓషో - 63 🌹
✍️. సౌభాగ్య
📚. ప్రసాద్ భరద్వాజ
🍀. తెలిసిన దాని నించీ తెలియని దాని వేపు అడుగు వేసినపుడే పరమానందం వీలవుతుంది. ధైర్యశాలులకు, తెగించే వాళ్ళకే అది లభ్యం. అది శ్రమతో కూడుకున్నది. ప్రమాదాల్ని ఎదుర్కోందే పరవశాన్ని అందుకోవడం వీలుపడదు. 🍀
సాహసవంతులకే పరమానందం దొరుకుతుంది. ధైర్యశాలులకు, తెగించే వాళ్ళకే అది లభ్యం. తెలిసిన దాని నించీ తెలియని దాని వేపు అడుగు వేసినపుడే అది వీలవుతుంది. తెలిసిన దానికి అంటిపెట్టుకుని వుంటే నీ జీవితం రొటీన్‌గా వుంటుంది. పునరుక్తిగా వుంటుంది. ఒకే దారిలో, ఒకే వలయంలో వుంటుంది. సున్నితత్వాన్ని క్రమంగా కోల్పోతాం. బండబారిపోతాం. గుడ్డితనం, మూగతనం ప్రాప్తిస్తాయి. అక్కడ ఏదీ చూడ్డానికి, ఏదీ వినడానికి, ఏదీ రుచి చూడ్డానికి, ఏదీ అనుభూతి చెందడానికి వుండదు. అట్లాంటి వాళ్ళకు ఆనందం అమడ దూరంలో వుంటుంది.
వాళ్ళకు తెలిసింది దు:ఖం, బాధ, నిరాశ, విషాదం, నిశ్చలన వేదన. వ్యక్తి సాహసంతో తెలిసిన దాని నించీ తెలియని దానికి అడుగు వెయ్యాలి. పరిచితమైన దాని నించీ అపరిచితమైన దానికి ప్రయాణించాలి. అది శ్రమతో కూడుకున్న విషయం. పరిచితమైన దానితో రక్షణ వుంటుంది. భద్రత వుంటుంది.
తెలియని దానిలోకి అడుగు పెడితే ఏం జరుగుతుందో ఎట్లాంటి గ్యారంటీ లేదు. కానీ ప్రమాదాల్ని ఎదుర్కోందే పరవశాన్ని అందుకోవడం వీలుపడదు. ప్రమాదకరంగా జీవించు! కారణం జీవితానికి మరో మార్గం లేదు. జీవితం తప్పనిసరిగా ప్రమాదకరంగా జీవించాలి. సన్యాసికి సాహనమన్నది అత్యున్నతమైన ధర్మం! అపుడే పరమానందానికి అవకాశముంది. వ్యక్తి ప్రమాదకరంగా జీవించడానికి సిద్ధపడితే ఎన్నో పూలు వికసిస్తాయి. పరమానంద సుమాలు విచ్చుకుంటాయి.
సశేషం ...
🌹 🌹 🌹 🌹 🌹
24 Aug 2021
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment