గీతోపనిషత్తు - 47





🌹.   గీతోపనిషత్తు - 47   🌹

🍀   7. పరహితము - లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు.   🍀

✍️. సద్గురు కంభంపాటి పార్వతి కుమార్
సేకరణ : ప్రసాద్ భరద్వాజ


📚.   కర్మయోగము - 12   📚


12. ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితాః |

తైత్తా నప్రదాయైభ్యో యో భుంక్తే స్తేన ఏవ సః || 12


యః అప్రదాయః, సహస్తేన ఏవః :

పరహిత కార్యములను నిర్వర్తించుచు తద్వారా దేవతల ప్రీతి నందిన వాడు భోగ్యమగు అనేక విషయములను వారి యనుగ్రహముగ పొందు చుండును. అట్లు విశేషములైన భోగములను గూడ అనుగ్రహింప బడును. అనుగ్రహింప బడిన భోగ్య విషయములు తనకు తానే అనుభవించుట దొంగతనము. అట్టి దొంగ మరల పతనము చెందగలడు.

లభించిన భోగ భాగ్యములు ఇతరుల శ్రేయస్సు కొరకు వినియోగించు వాడు బుద్ధిమంతుడు. తనకు తానే అనుభవించు వాడు మూర్ఖుడు. అట్టి మూర్ఖుడు తన ప్రవర్తనము ద్వారా తానే పతనము చెందుచుండును. తాను పరహిత కార్యము లొనర్చుటచే దేవతానుగ్రహము పొందినవాడు. దేవతలు అనుగ్రహించుటకు కారణము తనయందు పరహిత బుద్ధి యున్నదని.

భోగ్యవిషయము లభ్యముకాగానే, పరహిత ధర్మము మరచుట కృతఘ్నత్వమగును. అందించిన ప్రతి భోగ్యవిషయమును పరహితమునకే సమర్పించుట వృద్ధికి కారణమగును. అట్లు కానిచో వృద్ధి యాగును. పతనము ప్రారంభమగును.

పరహిత బోధనలు విన్న పేద బ్రాహ్మణుడొకడు తనకుగల రెండు అంగవస్త్రములలో ఒక దానిని గౌతమబుద్ధునకు సమర్పించెను. ఆనందముతో ఏకవస్త్రము ధరించి బాటను పోవుచున్న పేద బ్రాహ్మణుని చూసి, ఆదేశపు రాజు, విషయము తెలుసుకొని బ్రాహ్మణునకు పది అంగవస్త్రముల జంటను అందించినాడు. లభ్యమైన పది అంగవస్త్రముల జంటలను బ్రాహ్మణుడు మరల దానము చేసి ఏకవస్త్రుడుగ నిలచి అమితానందము పొందినాడు.

పై విషయము తెలిసిన రాజు బ్రాహ్మణునియందు మిక్కిలి సంతసించి ధన కనకములు, ధాన్యము బ్రాహ్మణున కందించినాడు.

అవియును గూడ మండలము రోజులలో ఇతరుల శ్రేయస్సునకు వినియోగించి మరల ఏకవస్త్రుడుగ చరించసాగినాడు. ఈ విషయము తెలిసిన రాజు ఆనందభరితుడై, బ్రాహ్మణునకు సస్యశ్యామలమైన అగ్రహారము నిచ్చినాడు.

అగ్రహారమునంతను బౌద్ధసన్యాసులకు ఆశ్రమముగ నేర్పరచి పేద బ్రాహ్మణుడు పరమానందభరితుడై బుద్ధుని సాన్నిధ్యము పొందినాడు. రాజు మిక్కుటముగ ఆనందము పొంది పరహితమార్గమున పరిపూర్ణముగ నడచుటకు సంకల్పించి, దీక్షగ లోకహితమును ఆచరించి రాజర్షియై దైవసాన్నిధ్యమున నిలచినాడు.

ఇట్లు తనదగ్గర ఉన్నటువంటి విద్యగాని, తెలివిగాని, శక్తిగాని, ధనాదులుగాని ఇతరుల శ్రేయస్సు కొరకై వినియోగించు వాడు సృష్టియందు నిజమైన రాజుగ నిలచును. అట్లు జీవించని వారు ఎప్పుడును పేదలే. పేదలేగాదు దొంగలు కూడ అని కృష్ణుడు కర్మానుష్ఠాన రహస్యమును తెలిపినాడు. (3-12)

సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #గీతోపనిషత్ #సద్గురుపార్వతీకుమార్


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

No comments:

Post a Comment