శ్రీ శివ మహా పురాణము - 241



🌹 . శ్రీ శివ మహా పురాణము - 241 🌹

రచన ✍️. స్వామి తత్త్వ విదానంద సరస్వతి
📚. ప్రసాద్ భరద్వాజ


🌴. రుద్ర సంహితా - సతీఖండః 🌴

54. అధ్యాయము - 9

🌻. మారగణములు - 2 🌻

నా బాణమును ప్రయోగించుటకు ఆవశ్యకమగు దౌర్బల్యము శివునియందు నాకు ఏనాడూ కానరాలేదు. హే జగత్ర్ప భూ! నేను సత్యమును పలుకుచున్నాను. శివుని మోహింపజేయు శక్తి నాకు లేదు (20).

వసంతుడు శివుని మోహింపజేయుటకు ప్రయత్నించినాడు. మహాత్మా! ఆ వృత్తాంతమును వినుము. నేను ముమ్మాటికీ సత్యమునే పలుకుచున్నానను (21).

శివుడు ఉన్నచోట వసంతుడు సంపెంగలను, కేసరపుష్పములను, కురువేరు పుష్పములను, అరుణవర్ణము గల పొన్నలను, నాగకేశరములను, కింశుక పుష్పములను, మొగలి పువ్వులను, దానిమ్మ పువ్వులను (22),

అడవి మల్లెలను, దట్టమగు మోదుగ పువ్వులను, గోరింట పువ్వులను వికసింపజేసెను (23).

ఆతడు ప్రయత్న పూర్వకముగా శివుని ఆశ్రమములో సరస్సులను వికసించిన పద్మములతో సుగంధ భరితములగునట్లు చేసి మలయానిలము వీచునట్లు చేసెను (24).

అచట గల లతలన్నియూ పూలతో, చిగుళ్లతో నిండి వృక్షముల మొదళ్లను ప్రేమతో చుట్టుకొని యుండెను (25).

పుష్పములతో నిండియున్న ఆ వృక్షములను చూచి, ఆ సుంగధి భరితములగు గాలులను అనుభవించిన మునులు కూడా కామమునకు వశమైరి. ఇతరుల గురించి చెప్పనదేమున్నది? (26).

ఇట్లు ఉన్ననూ శివునకు మోహమును పొందే హేతువు గాన రాలేదు. ఆయనలో లేశమైనను వికారము కలుగలేదు. శంకరుడు నాపై కోపమును కూడ చేయలేదు (27).

ఈ వృత్తాంతమునంతనూ చూచిన నేను ఆ శివుని భావనను తెలుసుకున్నాను. నాకు శివుని మోహింపచేయుట యందు అభిరుచి లేదు. నేనీ మాటను నీకు నిశ్చయముగా చెప్పుచున్నాను (28).

ఆయన సమాధిని వీడినప్పుడు ఆయన చూపుల ముందు మేము నిలబడుటకైననూ సమర్థులము కాము. అట్టి రుద్రుని ఎవరు మోహింపజేయగలరు? (29).

హే బ్రహ్మన్‌! మండే అగ్నివలె ప్రకాశించు కన్నులు కలిగినట్టియు, జటాజూటముతో భయంకరముగా నున్నట్టియు, విషమును ధరించియున్న శివుని చూచి, ఆయన యెదుట నిలబడ గలవారెవ్వరు? (30).

బ్రహ్మ ఇట్లు పలికెను -

నాల్గు మోములు గల నేను ఈ మన్మథుని మాటలను విని, సమాధానమును చెప్పగోరియు చెప్పక ఊరకుంటిని. అపుడు నా మనస్సు చింతతో నిండి పోయెను (31).

శివుని నేను మోహింపచేయ జాలను అను మన్మథుని పలుకులను వింటిని. ఓ మహర్షీ! ఈ మాటలను విన్న నేను మహా దుఃఖముతో నిట్టూర్పు విడిచితిని (32).

నా నిట్టూర్పు వాయువుల నుండి అనేక రూపములు గలవారు, మహాబలులు, వ్రేలాడు జిహ్వలు గలవారు, అతి చంచలమైన వారు, మిక్కిలి భయమును గొల్పువారు నగు గణములు పుట్టినవి (33).

వారందరు అసంఖ్యాకములు, గొప్ప భయంకరమైన ధ్వని చేయునవి అగు పటహము మొదలగు అనేక వాద్యములను మ్రోగించిరి (34).

నా నిట్టూర్పుల నుండి పుట్టిన ఆ మహాగణములు నా ఎదుట నిలబడి 'చంపుడు నరుకుడు' అని కేకలు వేసినవి (35).

నన్ను ఉద్దేశించి వారు 'చంపుడు నరుకుడు' అని వేయుచున్న కేకలను విని మన్మథుడు వారిని ఎదుర్కొనెను (36).

ఓ మహర్షీ! అపుడు మన్మథుడు నాయెదుటనున్న ఆ గణములను వారించి, నాతో బ్రహ్మన్‌ అని సంబోధించి ఇట్లు పలికెను (37).

మన్మథుడిట్లు పలికెను -

హే బ్రహ్మన్‌! ప్రజాపతీ! సృష్టినంతనూ ప్రవర్తిల్ల జేయువాడవు నీవే . ఈ భయంకర వీరులు ఉత్పన్నమైరి. వీరెవ్వరు? (38).

హే విధీ! వీరి కర్తవ్యమేమి? వీరు ఎక్కడ ఉండెదరు? వీరినామము ఏమి? ఈ విషయములను చెప్పి, వీరిని నియోగింపుము (39).

వారికి స్థానమునిచ్చి, పేరు పెట్టి, వారి కర్మలయందు వారిని నియోగింపుము. హే దేవేశా! అపుడు దయతో నాకు తగిన ఆజ్ఞను ఇమ్ము (40).

సశేషం...
🌹 🌹 🌹 🌹 🌹


#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #శివమహాపురాణం


Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/


07 Oct 2020

No comments:

Post a Comment