✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
🌻. ఆత్మ విచారణ పద్ధతి - 33 🌻
“ఆకాశస్య సంభూతాత్మా” అనవచ్చునా అంటే అనరాదు. అంటే అర్ధమేమిటి? నీ కళ్ళముందున్నటువంటి పంచభూతాత్మకమైనటువంటి ఆకాశమే మిగిలిన నాలుగు భూతముల చేత ప్రభావితము కాకుండా వున్నట్టు కనబడుతున్నది కదా.
అట్టి ఆకాశమునకంటే ముందుగా వున్నటువంటి ఆత్మ స్వరూపము, అధిష్టానముగా వున్న ఆత్మ స్వరూపము, ఆశ్రయముగా వున్న ఆత్మస్వరూపము తదుపరి ఏర్పడినటువంటి వాటి చేత ప్రభావితమగుట, బాధింపబడుట అసత్యము, సాధ్యము కాదు. ఇంకా, మరి ఆకాశమునకంటే ముందున్నటువంటి సూర్య ప్రకాశము ఆత్మ ప్రకాశము వలననే సూర్యుడు ప్రకాశిస్తున్నాడనేటటువంటి అధిష్టాన ధర్మము కలిగినటువంటి ఆత్మ స్వరూపము, స్వరూప జ్ఞానమును ఎవరైనా ఒకరు చంపుతారని చంపెదనని చనిపోతుందని అనడం అసంబద్ధం కదా.
కాబట్టి చంపుట గాని చంపబడుట గాని చనిపోవుటగాని శరీర గతమైన లక్షణములే గాని ఆత్మ లక్షణము కావు. ఇట్టి ఆత్మ లక్షణములను తప్పక మానవులందరూ పూర్తిగా శ్రవణ మనన నిధి ధ్యాస యుక్తముగా ఆత్మస్వరూప లక్షణములను చక్కగా అనుశీలించవలసిన అవసరము వున్నది.
ఒకవేళ ఈ ఆత్మ లక్షణమునకు వ్యతిరేకముగా నీకెప్పుడైనా తోచినట్లయితే అపుడు శరీర గత ధర్మములను ఆశ్రయించావు అనేటటువంటి నిర్ణయాన్ని నువ్వు పొందాలి. ఏ భావములోనైనా, ఏ ఆలోచనలో అయినా ఈ శరీర ధర్మమేమిటి ఆ ఆత్మ ధర్మమేమిటి అని చక్కగా విచారణ చేసి ఆత్మ ధర్మమును ఆశ్రయించి ఆత్మ భావమునందు స్థిరముగా నిలబడి వుండటమే సాధకులకు అత్యావశ్యకమైనది.
కాబట్టి ఆత్మ ఎవరినీ చంపుటా లేదు, చచ్చుటా లేదు. ఆత్మకు రెండు లక్షణములూ లేవు. ఏమిటవీ? చంపబడదు, చనిపోదు. కాబట్టి ఎవరైనా చనిపోయారు అంటే అర్ధమేమిటంటే వారి శరీరము మాత్రమే చనిపోయింది. వారు చనిపోయే అవకాశం లేదు. ఈ రకమైనటువంటి సత్యాన్ని తప్పక మానవులు నిర్ణయాత్మకంగా గ్రహించవలసినటువంటి అవసరం వున్నది. అర్ధమయిందా అండి? ఈ రకంగా నీవు ఈ అంశాలను గ్రహించుకోవాలి.
ఇలా గ్రహించుకున్న తరువాత నీ నిజ జీవితంలో నువ్వు ఈ ఆత్మ భావనలో నిలకడ చెంది వుండటమనేది అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకనంటే అన్నీ ఇంద్రియములతో ఇంద్రియార్ధములతో విషయములతో కూడుకుని వున్నటువంటి భావనలు భావములే కలుగుతూ వుంటాయి.
అసంబద్ధమైనటువంటి శరీర ధర్మానుసారము వున్నటువంటి, మనో ధర్మానుసారము వున్నటువంటి, ఇంద్రియములతో కూడుకున్నటువంటి, గుణములతో కూడుకున్నటువంటి, వాసనలతో కూడుకున్నటువంటి, శరీరములతో కూడుకున్నటువంటి, అవస్థలతో కూడుకున్నటువంటి, కాలత్రయముతో కూడుకున్నటువంటి, కాలత్రయం, శరీరత్రయం, అవస్థాత్రయం, దేహత్రయం, జననమరణాలతో కూడుకున్నటువంటి, జరామరణ మృత్యు స్వరూపమైనటువంటి, ఏదో ఒక కాలంలో నేను చనిపోతాను కదా అనేటటువంటి భావన చేత మానవుడు శరీర ధర్మాన్ని పొందుతున్నాడు.
సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹
#ChaitanyaVijnanam #PrasadBhardwaj #చైతన్యవిజ్ఞానం #కఠోపనిషత్ #చలాచలబోధ
Facebook, WhatsApp, Telegram groups:
https://incarnation14.wordpress.com/2020/09/23/social-media-groups-channels-telegram-facebook-whatsapp-etc/
07 Oct 2020
No comments:
Post a Comment