✍️. సద్గురు శ్రీ విద్యాసాగర్
📚. ప్రసాద్ భరద్వాజ
గురువుగారి అనుమతి తీసుకుని శిష్యుడు వెళ్ళాలి. తండ్రి యొక్క అనుమతి తీసుకుని పిల్లవాడు వెళ్ళాలి.
ఈ “అనుమతి” - అనేది చాలా ముఖ్యమైనది. ఇవాళ్టి రోజున అనుమతితో పనిలేకుండా మనం అందరం జీవిస్తున్నాము, ఒకరి అనుమతితో మరొకరికి పనిలేదు.
ఏ మానవ సంబంధాలలో అయితే ఈ అనుమతి అన్నటువంటి దానికి లోబడి జీవించడం అనేటటువంటి విధానం వుంటుందో అక్కడ అతి గొప్పదైనటువంటి నియమం ‘శరణాగతి’ అమలపరచ బడుతుంది. నీలో ఉన్నటువంటి దివ్యత్వానికి నేను దాసోహం.
నీలో ఉన్నటువంటి చైతన్యానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి వివేకానికి నేను దాసోహం. నీలో ఉన్నటువంటి విజ్ఞానానికి నేను దాసోహం. దాసోహం అంటే అర్థం ఇది.
ఈ రకంగా ఎదుటి వ్యక్తిలో వున్నటువంటి వివేక, విజ్ఞానాలకు, దివ్యత్వానికి నువ్వు ఎప్పుడైతే శరణాగతుడవు అవుతావో, అప్పుడు ఆ ‘అనుమతి’ అనేటటువంటి విధానం నీలో ఏర్పడుతుంది. అట్లా ఎవరిలో అయితే వీటిని గుర్తించగలిగేటటువంటి లక్షణం వస్తుందో, వారిలో భక్తి, ప్రపత్తులు పెరుగుతాయి.
ఎవరైతే వివేకానికి, విజ్ఞానానికి, విచారణకి, వస్తునిశ్చయ జ్ఞానానికి ప్రాధాన్యతను ఇచ్చి, దివ్యత్వ ప్రధానంగా జీవిస్తున్నటువంటి వాళ్ళ యొక్క అనుమతి కొరకు వేచియుంటారో, వారు ఆ అనుమతి ఇవ్వడం చేతనే వారి బలమంతా కూడా వీరికి సంక్రమిస్తుంది.
అష్ట దిక్పాలకులలో ఒకడైనటువంటి యమధర్మరాజు బాలుడైనటువంటి నచికేతుడిని ‘అపరాధ క్షమాపణ’ అడుగుతున్నాడు.
మనం జీవితంలో ఎప్పుడైనా క్షమించమని ఎవరినైనా అడిగామా? అడగాలంటే మన కిరీటం పోయినట్లు, మన సింహాసనం పోయినట్లు, లేకపోతే మన రాజ్యం అంతా విడిచి వెళ్ళిపోయినట్లు బాధపడిపోతూ వుంటాము, కదా!
ఎవరినైనా క్షమించమని అడగాలంటే, మనకు చాలా బాధ కలుగుతుంది. చాలామంది క్షమాపణ అడుగుతారు, ఎట్లా అడుగుతారంటే? డిమాండ్ గా అడుగుతారు.
పశ్చాత్తాప భావన లేదనుకోండి అదే పొరపాటుని మరల మరల మరల మరల పునః పునః చేస్తూ వుంటాం అన్నమాట. ఒక్కసారి పశ్చాత్ తాప పడినట్లయితే, మరలా ఆ పనిని తిరిగి చేయకుండా వుంటాం అన్నమాట.
కాబట్టి, యమధర్మరాజు ఈ రీతిగా మనకి ధర్మాన్ని ఉపదేశిస్తున్నాడు. తన అపరాధమునకు, తెలియక జరిగినటువంటి అపరాధమునకు క్షమాపణ వేడుతున్నాడు.
🌹 🌹 🌹 🌹 🌹
No comments:
Post a Comment